Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసంతోషమే బలం, అభివృద్ధి....

సంతోషమే బలం, అభివృద్ధి….

Be Happy: తన కోపమే తన శత్రువు… తన శాంతమె తనకు రక్ష! దయ చుట్టంబౌ… తన సంతోషమె స్వర్గము, తన ధుఃఖమె నరకమండ్రు.. తథ్యము సుమతీ !! బద్దెన చెప్పిన ఈ సుమతీ శతకంలోని పాజిటివిటీకి ఆ దేశాలు నిలువెత్తు ఉదాహరణలైతే… నెగటివిటీకి అదే జాబితాలో ఆఖరు నుంచి చోటుచేసుకున్న దేశాలూ మరి నిలువెత్తు ఉదాహరణలే!

ఎవరికైనా.. తమ కోపమే తనకు శత్రువని… తమ శాంతమే తనకు రక్షణని… తమ దయాగుణమే బంధువులవలె సహకరించునని.. మొత్తంగా తాము సంతోషంగా ఉండగల్గడమే స్వర్గముతో సమానమని అంటాడు బద్దెన. అంతేకాదు దుఖాన్ని చేజేతులారా తెచ్చుకుంటే అది నరకం కావడం తథ్యమనీ ఘోషిస్తుంది ఈ బద్దెన పద్యం.

ఇందులో ఏ పాజిటివ్ వర్డ్స్ ను బద్దెన తన పద్యాన ఉదహరించాడో అవే ఫిన్లాండ్ వంటి దేశాలను ప్రపంచ చిత్రపటంలో అగ్రస్థానాన నిలబెడుతుంటే… ఏ నెగటివ్ వర్డ్సైతే ఉన్నాయో అవే ఆఫ్ఘాన్, లెబనాన్ నుంచి మొదలుకుంటే మన ఇండియా వరకూ చివరిస్థానాలకు పరిమతమయ్యేలా చేస్తున్నాయన్నది నమ్మితీరాల్సిన నిజం.

ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో,
ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో,
ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో,
సంసారపు గోడలమధ్య ఎక్కడ భాగాలకింద ప్రపంచం విడిపోదో,
ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో,
ఎక్కడ అలసట నెరగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణత వైపు జాస్తుందో,
ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా వుంటుందో,
ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ, కార్యాలలోకీ నీచే నడపబడుతుందో,
ఆ స్వేచ్ఛా స్వర్గానికి… తండ్రీ… నా దేశాన్ని మేల్కొలుపు…
అని గీతాంజలిలో ఏ భావావేశంతో రాశాడోగానీ రవీంద్రుడు నాడు… ఒకవేళ నేటి కాలాన ఆయనేగనుక ఫిన్లాండ్ లో పుట్టుంటే… ఈ గీతాంజలి పద్యానికే ఆస్కారముండేదే కాదేమో…? ఎందుకంటే ఫిన్లాండ్ ఆయన చెప్పిన నేటి కలియుగ స్వేచ్ఛా స్వర్గం కనుక!

ఆనందంతో పాటు… దాన్ని ఆస్వాదించే అనుభూతి పొందినప్పుడే తృప్తి. అదిగో అలాంటి రసానుభూతి దొరుకుతుంది కాబట్టే… ఫిన్లాండ్ ఐదోసారి కూడా భూతలస్వర్గంగా పేర్కొనబడుతూ… పతాకశీర్షికలకెక్కుతోంది. ఏవో ఆషామాషీ సంస్థలో… ప్రైవేట్ సర్వేలో కాదు ఈ లెక్క తేల్చేది! స్వయానా ఐక్యరాజ్యసమితికి చెందిన సస్టెయినబుల్ డెవలప్ మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్!! జీడీపీ పర్ క్యాపిటా, సామాజిక మద్దతు, ఆరోగ్యవంతమైన జీవన విధానం, స్వేచ్ఛ, ఇతరుల పట్ల కనబర్చే ఔదార్యం, అవినీతిరహితంగ ఉండగల్గడమనే ఆరు అంశాలను ప్రధానంగా తీసుకుని… 150 ప్రపంచ దేశాలను మదింపు చేస్తే… అందులో ఫిన్లాండ్ ఐదోసారి అంటూ నంబర్ వన్ స్థానంలో నిలబడటమంటే ఇంకా మరి భూతల స్వర్గమనడంలో తప్పేముంది…?

అయితే ఒక్క ఫిన్లాండే కాదు… ఆ తర్వాత పది స్థానాలు ఆపైన కనీసం ఇరవై, ముప్పై స్థానాల వరకూ ముందువరుసలో ఉన్నవాటినీ అవి సాధించిన ప్రగతినీ మనం పరిగణనలోకి తీసుకోవాల్సిందే. అవీ ఎంతగా పోటీ పడుతున్నాయో అర్థం చేసుకోవాల్సిందే. డెన్మార్క్, ఐస్ ల్యాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ వంటివి టాప్ 5లో చోటు దక్కించుకుంటే… లక్సెంబర్గ్, స్వీడన్, నార్వే వంటి ఆ తర్వాతి స్థానాల్లో నిల్చి.. ప్రపంచంలోని మేమేదో గొప్ప అని బడాయి పోయే దేశాలకు ఓ చుక్కానిలా నిల్చాయి. అసలెందులో గొప్ప… మళ్లీ ఇదో ప్రశ్న…? రవీంద్రుడు చెప్పినట్టుగా ఎక్కడైతే ఆనందంగా, స్వేచ్ఛగా, హాయిగా, మానసిక వికాస ఎదుగులతో జీవించే ప్రతి క్షణాన్నీ ఆనందిస్తావో… ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనంతగా ఆస్వాదిస్తావో… అది కదా స్వర్గమంటే…? ఆ దేశాలు కదా బడాయి పోవాల్సింది…?? ఇదిగో జాబితాలో ముందువరుసలో నిలుస్తూ… అణుపరీక్షలని, బలమైన దేశాలని, నిత్యం ఆధిపత్య ధోరణులు, మత మౌఢ్యాలు, కులాల కుమ్ములాటలు, యుద్ధాలు, పరస్పర ఆరోపణలు, కుట్రలు, కుతంత్రాలతో తమ దేశాల్లో మిస్సవుతున్న సంతోష, సౌభాగ్యాలను సవాల్ చేస్తూ ప్రశ్నిస్తున్నట్టు లేదూ ఈ ఫిన్లాండ్ దాని తర్వాత స్థానాల్లో నిల్చిన దేశాల సక్సెస్ స్టోరీస్…?

అయితే ఈసారి ఐక్యరాజ్యసమితి సస్టెయినబుల్ డెవలప్ మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్ రూపొందించిన 146 దేశాల జాబితాలో కిందనుంచి.. సంస్కృతీ, సంప్రదాయాలకు, ప్రాచీన వైభవానికి పెట్టింది పేరుగా నిలిచే మన భారత్… గతంలో ఉన్న 139వ స్థానం నుంచి కొంచెం మెరుగుపడి 136కు చేరుకోవడం గర్వపడాలా…? ఎన్నేళ్లకు మనం మరో ఫిన్లాండ్ గానో… కనీసం నార్వేలానో అలాంటి స్వర్గసీమను తయారుచేయగలమని బాధపడాలో తెలియని ఓ అయోమయం. అవన్నీ చిన్న, చిన్న దేశాలు.. వాటితో పోలిక పెట్టుకోవడం అసలు సరైందే కాదు అనే వాదనా రావొచ్చు! వస్తుందికూడానూ!! కానీ, మంచివైపు పరుగులు తీసేటప్పుడు మన డిసండ్వంటేజెస్ ను చూపించుకుంటూ… మనకు మనమే సమర్థించుకునే ధోరణే ఏ విషయంలోనైనా వెనుకబాటుకు కారణమవుతుంది కూడాను!!!

ముఖ్యంగా ఓ ఫిన్లాండ్, ఓ డెన్మార్క్, ఓ స్విట్జర్లాండ్… ఇలా అద్భుతమైన దేశాలుగా గుర్తింపు సాధిస్తున్న క్రమంలో అక్కడ్నుంచి మనం గ్రహించాల్సిన, గమనించాల్సిన, నేర్చుకోవాల్సిన అంశాలేంటన్న చర్చ జరగాలి. పోటీ ఉండాలి… కానీ ఆరోగ్యకరంగా ఉండాలి… అనారోగ్యకర పోటీ ఎప్పటికీ ప్రమాదమే అనేది పెద్దలు చెప్పే మాటే కాదు… ఇప్పుడు పెద్దదేశాలమని బడాయి పోయే రాజ్యాలను చూసి అవగతం చేసుకోవాల్సిన విషయం కూడాను! నువ్వు గొప్పా… నేను గొప్పా… అన్నట్టుగా అనారోగ్యకరమైన పోటీతత్వం.. ఇంటా, బయటా రచ్చ తప్ప… ఓ ఫిన్లాండ్ లాంటి సక్సెస్ స్టోరీ అయ్యేందుకు సామాజిక మద్దతెక్కడుంది..? కాంప్టీషన్ కన్నా.. కో ఆపరేషనే ముద్దనే మోటోనే... ఓ ఫిన్లాండ్ నైనా, ఓ నార్వేనైనా, నెదర్లాండ్స్ నైనా స్వర్గసీమల్లా మారడానికి ప్రధాన కారణమనే విశ్లేషణ ఐక్యరాజ్యసమితి సస్టెయినబుల్ డెవలప్ మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్ రిపోర్ట్స్ లో వెల్లడైంది.

Finland

ఫిన్లాండ్ దేశమేం ఇంద్రుడు పాలించే స్వర్గం నుంచి భూమ్మీద ఊడిపడిన ఓ ముక్కేం కాదు… అన్ని దేశాలకు మల్లే… ఫిన్లాండ్ లోనూ పలు సమస్యలున్నాయి. ఫిన్లాండ్ తో పాటు పోటీ పడే దేశాల్లోనూ అదే పరిస్థితి! కానీ, ఫిన్లాండ్ గానీ, ఓ లక్సెంబర్గ్ గానీ… అవి ఆ సమస్యల పట్ల స్పందించే తీరు… ఏ పథకం చేపట్టినా రాజకీయలాభం చూసుకోని తీరు… పాలనలో పారదర్శకత… అసలు మొత్తంగా కుటుంబ వ్యవస్థ నుంచీ ప్రభుత్వ వ్యవస్థ వరకూ ఓ బాధ్యత… ఇలా ఇవన్నీ వెరసి.. ఫిన్లాండైనా, ఐస్ ల్యాండైనా ఆ స్థాయిలో నిలవడానికి ప్రధాన కారకాలు.

విద్యతోనే ఎవరికైనా… ఏ దేశానికైనా వికాసం. అదిగో ఆ అత్యుత్తమ విద్యా, కనీస వైద్యమందించడంలో ఫిన్లాండ్, స్వీడన్ వంటి దేశాలు ముందువరుసలో నిలుస్తూ ఔరా అనిపిస్తున్నాయి. ఎంతలా అంటే ప్రపంచంలోనే ఒత్తిడి లేని నాణ్యమైన విద్య ఎక్కడ దొరుకుతుందంటే ఫిన్లాండ్ అని చెప్పే స్థాయిలో! తెల్లార్లేస్తే ప్రతీది దందా!! ఒకటి ఒకటి ఒకటి అంటూ విద్యావ్యాపారం.. చచ్చిపోయిన మనిషికి ట్రీట్మెంట్ చేసే మెడికల్ బిజినెస్… ఓ అన్నాదమ్ముల ఆత్మీయబంధాన్ని అద్భుతమైన ఆఫ్ బీట్ స్టోరీగా మల్చి చూపాల్సిన చోట… అదే అన్నాదమ్ములు భూముల పంచాయితీలతో పరస్పరం రక్తం కారేలా నరుక్కోవడాన్ని రేటింగ్స్ కొరకు బులెటిన్ తప్పి బులెటిన్ లో చూపించే నేరఘోర ఛానల్స్… సినిమా హీరోయిన్ల బికినీల వీడియోలు, ఫోటోలతో కాసులు నింపుకోవాలనుకునే మీడియా సంస్థలు… దుమ్మెత్తిపోసుకునే రాజకీయాలు.. ఆడది అబల కాదని స్పీచులిస్తూనే అబలగా చూసే పురుషాధిక్యులు… టేబుల్ కిందనుంచి కవర్ అందించకుంటే రైతుకు పట్టాదార్ పుస్తకమివ్వని తహశీల్దార్లు… నెలనెలా తమది తమకు పంపిస్తే పెట్రోల్ పంపుల్లో అసలేం జరుగుతుందో కూడా అటువైపే చూడని తూనీకలు, కొలతల అధికారులు… ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా అందులో చెడే తప్ప… మంచిపాళ్లెంత…? మరలాంటప్పుడు… ఇంకెప్పుడు ఈ బడాయి దేశాలు అవినీతి కూపం నుంచి నేరాలు, ఘోరాల నుంచి బయటపడేవి.. ఏ ఫిన్లాండ్ నో… కనీసం నార్వేనో ఎప్పుటికందుకునేవీ…?

మొత్తంగా రవీంద్రుడి గీతాంజలి కవిత తరహాలోనే చెప్పుకుంటే…

ఎక్కడైతే కాంపిటీషన్ కాదనుకుని కో ఆపరేషన్ ఉంటుందో…
ఎక్కడైతే అత్యుత్తమ విద్యా, వైద్యానికి అధిక ప్రధాన్యమిస్తారో…
ఎక్కడైతే నేరాలు, ఘోరాలు లేని సమాజం ఆవిష్కృతమవుతుందో… ఎక్కడైతే నువ్వు బాస్, నేను సబార్డినేట్ అనే ఆధిపత్య ఉద్యోగస్వామ్యం లేని ఫ్లాట్ వర్కింగ్ మాడల్ కార్యాలయాలు పుట్టుకొస్తాయో… అదిగో ఆ భూతలస్వర్గంలోకి తండ్రీ మమ్మల్ని నడిపించూ అంటే… అదిగో ఆ స్వర్గసీమలే ఓ ఫిన్లాండ్, ఓ స్విట్జర్లాండ్, ఓ ఐస్ ల్యాండ్!

-రమణ కొంటికర్ల

Also Read : చదవాల్సిన పుస్తకం

RELATED ARTICLES

Most Popular

న్యూస్