Thursday, January 23, 2025
HomeTrending Newsడోనాల్డ్ ట్రంప్ పై దాడి: ఖండించిన మోడీ

డోనాల్డ్ ట్రంప్ పై దాడి: ఖండించిన మోడీ

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆయన చెవికి గాయమైంది. వెంటనే భద్రతా సిబ్బంది ఆయన్ను చుట్టుముట్టి సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీనితో అమెరికా ఒక్కసారి ఉలిక్కిపడింది. దుండగుడు ఆరు రౌండ్ల కాల్పులు జరపగా ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు దుండగుడిని కాల్చి చంపాయి.

ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ తూటా ఆయన చెవిని తాకుతూ వెళ్ళింది, తూటా శబ్దం వినబడగానే ఆయన వెంటనే కిందకు ఒంగి కూర్చున్నారు, ఈలోగా తేరుకున్న భద్రతా సిబ్బంది ఆయనకు రక్షణ వలయంగా ఏర్పడ్డారు. కొద్ది నిమిషాల అనంతరం ట్రంప్ పైకి లేచి పిడికిలి బిగిస్తూ నినాదాలు చేశారు.  దాడి జరిగిన ప్రాంతాన్ని సీక్రెట్‌ సర్వీస్ సిబ్బంది చుట్టుముట్టారు.   స్థానికంగా ఉన్నఅన్ని బిల్డింగ్‌లను తమ ఆదీనంలోకి తీసుకున్నారు.

ట్రంప్‌పై దాడి ఘటనను అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఖండించారు. అమెరికాలో హింసకు చోటు లేదన్నారు. కాల్పుల ఘటనపై సెక్యూరిటీ ఏజెన్సీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు. ట్రంప్ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు.

డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గానే ఉన్నట్లు ఆయన ప్రతినిధి స్టీవెన్ తెలిపారు. స్థానిక మెడికల్ సిబ్బంది ఆయనకు చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో త్వరగా స్పందించిన భద్రతా సిబ్బందికి ధన్య వాదాలు తెలిపారు. మరోవైపు ట్రంప్ త్వరగా కోలుకోవాలని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.

ట్రంప్ పై దాడి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. తన మిత్రుడిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు. రాజకీయాలు, ప్రజాస్వామ్యంలో హింసకు ఏమాత్రం తావులేదని స్పష్టం చేశారు. ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకావాలని మోడీ ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్