విశాఖ సముద్ర తీరం .. ఆర్కే బీచ్..సాయంత్రం మెల్లగా చీకట్లు ఆవరించుకుంటున్న వేళ.. ఉధృతంగా ఎగిసి పడుతున్న అలల మీద రెండు ముక్కలుగా తేలుతున్న ఫ్లోటింగ్ బ్రిడ్జి వైపు బేలగా చూస్తున్నాడొక జిల్లా అధికారి.
ఆ సంధ్యాసమయంలో అటు చూస్తే ఫ్లోటింగ్ బ్రిడ్జి, ఇటు చూస్తే కలెక్టరాఫీసు.. ఎందులో పడి చావడమో తేలక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడు.
హఠాత్తుగా మొత్తం వైజాగ్ సిటీ అంతా కరెంటు పోయినట్టు అంతా చిమ్మ చీకటి కమ్మేసింది. శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. ఇంతలో యముడి మహిషపు లోహ ఘంటలు మబ్బు చాటున ఖణేల్ మన్నట్టు పెద్ద శబ్దంతో ఒక మెరుపు మెరిసి సముద్రంలోకి దూసుకుపోయింది.
ఈ ప్రకృతి విన్యాసంతో జిల్లా అధికారికి గుండెలు జారిపోయాయి. ఒక్కసారి కళ్ళు నులుముకుని సముద్రం వైపు చూశాడు.
ఎదురుగా..సముద్రంలోంచి ఎవరో ఒకాయన నింపాదిగా నడుచుకుంటూ తన వైపే వస్తున్నాడు. చూడ్డానికి పౌరాణిక సినిమాలో వృద్ధ మహారాజులాగా ఉన్నాడు. నెత్తి మీద ధగధగలాడుతున్న బంగారు కిరీటం, వెండి తీగల్లా మెరిసిపోతున్న బవిరి గడ్డం…
ఆయన నడుచుకుంటూ వచ్చి అధికారి దగ్గర ఆగాడు. అధికారి కొయ్యబారి చూస్తున్నాడు. “కంగారుపడకు నాయనా.. నీతో మాట్లాడాలని వచ్చాను” అన్నాడాయన చిరునవ్వుతో. ఆ ముసలాయన బవిరి గడ్డం, మీసాల చాటున దాక్కుండిపోయిన ఆ చిరునవ్వు అధికారికి కనపడనందువల్ల అధికారి ఇంకా షాక్ లోనే ఉండిపోయాడు. అధికారి అవస్థని అర్ధం చేసుకున్న ఆ ముసలాయన అధికారి భుజాన్ని గట్టిగా తట్టాడు.
అధికారి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి, అప్రయత్నంగా చేతులు జోడించి “ ఎవరు సార్ తమరు” అన్నాడు.
“నేను సముద్రుడిని నాయనా .. అన్ని సాగరాలకు రారాజుని. నువ్వు పడుతున్న గుంజాటన గ్రహించి, నీతో మాట్లాడాలని వచ్చాను, పద, ఆ బెంచీ మీద కూర్చుని మాట్లాడుకుందాం” అధికారి సముద్రుడిని అనుసరించాడు. ఇద్దరూ ఒక బెంచీ మీద కూర్చున్నారు.
“ఇప్పుడు చెప్పు. ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జి గురించే కదూ నువ్వు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నావు?” లాలనగా అడిగాడు సముద్రుడు.
పెద్దాయన అంత ఆప్యాయంగా అడిగేసరికి అధికారికి ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది. కళ్లు వత్తుకుంటూ తన గోడు వెళ్ళబోసుకున్నాడు.
పది రోజుల కిందట ఉన్నతాధికారులు, బడా రాజకీయ నాయకుల సమక్షంలో ఫ్లోటింగ్ బ్రిడ్జిని ప్రారంభించడం, మర్నాటికల్లా అది రెండు ముక్కలుగా తెగిపోవడం గురించి వివరించాడు. “అది తెగిపోవడం కాదూ, మాక్ డ్రిల్లులో భాగం” అని చెప్పుకుపోతుంటే సముద్రుడు అతడిని ఆపాడు. “మాక్ డ్రిల్లూ, మన్నూ మశానం అన్నీ ప్రారంభోత్సవానికి ముందే చేస్తారు గాని ఆ తర్వాత చేస్తారటయ్యా, మీ తెలివి తెల్లారినట్టే ఉంది” అని విసుక్కున్నాడు.
“కరెక్టుగా చెప్పారు. మేం అలా కవరింగ్ ఇచ్చుకున్నా జనం నమ్మలేదు లెండి. మేం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో గాని బ్రిడ్జి తెగినప్పుడు జనం లేరు. సరే, మావాళ్ళు విడిపోయిన రెండు భాగాలు కలిపే ప్రయత్నం చేస్తుంటే నిన్నటికి నిన్న కెరటాల దెబ్బకి మళ్లీ రెండోసారి ఫట్ మని తెగిపోయింది. అది ఎలాగైనా బాగుచేసి తీరాలని మా పైవాళ్ళు ఒకటే ఒత్తిడి చేస్తున్నారు. కాసేపట్లో ఉన్నత స్థాయి మీటింగ్ ఉంది. అక్కడ ఏం చెప్పాలో తెలీడం లేదు సార్” అంటూ భోరుమన్నాడు అధికారి.
“సరే గాని ఓ మాట అడుగుతాను చెప్పు. దీనిని బంగాళాఖాతం అని ఎందుకంటారో తెలుసా?” అడిగాడు సముద్రుడు. అధికారి బుర్ర గోక్కుని తెలీదన్నట్టు బుర్ర అడ్డంగా ఊపాడు.
“అఖాతము అనగా బాగా లోతయిన ప్రాంతము అని అర్ధం. ఈ తీరంలో సముద్రం బాగా లోతుగా ఉంటుందనీ . కెరటాల ఉద్ధృతి చాలా తీవ్రస్థాయిలో ఉంటుందనీ, లోపలి వెళ్ళడం చాలా ప్రమాదకరమనీ మీకు తెలియదా?” అడిగాడు సముద్రుడు.
సముద్రుడు అలా అడిగేసరికి అధికారిలో ఉత్సాహం తన్నుకొచ్చింది, “తెలియకేం సార్.. బాగా తెలుసు. అందుకే బీచ్ లో అడుగడుక్కీ డేంజర్ బోర్డులు పెట్టాం. ఇక్కడ ఈత ప్రమాదకరం అని పెద్ద అక్షరాలతో రాయించాం”.
“అబ్బో.. ఇన్ని తెలిసిన మీరు ఇంత ప్రమాదకరమైన ప్రదేశంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి కట్టి ఒకేసారి అంతమంది జనాన్ని సముద్రంలోకి పంపించే సాహసం ఎలా చేస్తారయ్యా? అసలు ఎవడు మీకు ఈ చచ్చు ఆలోచన ఇచ్చిందీ ?“ అని తిట్టాడు సముద్రుడు.
“అందుకే సాయంత్రం ఆరు గంటల కల్లా క్లోజ్ చేద్దామనీ, అలలు ఎక్కువగా ఉన్నప్పుడు, మళ్లీ పున్నమికీ, అమావాస్యకీ అసలు ఓపెన్ చెయ్యకూడదనీ అనుకున్నాం సార్!”
“మీ బొంద..అలలు తగ్గాక సముద్ర స్నానం చేద్దామనుకున్నాడట వెనకటికి ఒకడు.. అలా ఉంది మీ యవ్వారం. వెళ్లి ఇక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జి పెట్టడం కుదరదని మీ వాళ్లకి చెప్పు” కసిరాడు సముద్రుడు.
“అమ్మో.. అంత ధైర్యం నాకు లేదు సార్.. మీరు సముద్రానికి రాజునంటున్నారు కదా.. మీరే ఏదో దారి చూపించి పుణ్యం కట్టుకోండి సార్ “ అంటూ ప్రార్ధించాడు అధికారి.
సముద్రుడు కాసేపు ఆలోచించి, “నువ్వు రామాయణం చదివేవా” అని అడిగాడు.
“ఎప్పుడో చిన్నప్పుడు చందమామలో చదివేను సార్..రామాయణం సినిమాలు కూడా చూశాను..” సిగ్గుపడుతూ జవాబిచ్చాడు అధికారి.
“సరే, నీకిప్పుడు రామాయణంలో ఒక సన్నివేశం చెపుతా, విను” అన్నాడు సముద్రుడు. ఆయన మొహం మీద రింగులు రింగులు తిరిగాయి.
శ్రీరామ లక్ష్మణులు వానర సేనతో సముద్రం ఒడ్డుకి చేరుకున్నారు. అన్ని వేలమంది అవతల ఒడ్డున ఉన్న లంకకి చేరాలంటే వారధి నిర్మించడం తప్పని సరి అని నిర్ణయించుకుని ఆ ప్రయత్నాలు మొదలు పెట్టారు. కానీ ఏం లాభం? సముద్రంలో ఏ రాయి వేసినా బుడుంగుమని మునిగిపోతోంది. సరే, సముద్రుడినే దారి చూపమందాం అనుకుని శ్రీరాముడు సముద్రుడిని ధ్యానించాడు. సముద్రుడు ప్రత్యక్షం కాలేదు. శ్రీరాముడికి కోపం వచ్చి సముద్రం వైపు విల్లెక్కుపెట్టాడు. శ్రీరాముడు బాణం వదిలితే జరగబోయే ఉత్పాతం గ్రహించిన సముద్రుడు గడగడలాడుతూ బయటికి వచ్చి చేతులు జోడించి ఇలా అన్నాడు.
“శ్రీరామచంద్రా.. నామీద ఏం వేసినా లోపలికి లాక్కోవడం నా లక్షణం. దీనిని అధిగమించి వారధి కట్టడానికి ఒక మార్గం ఉంది. మీ వానర సేనలో నలుడు, నీలుడు అని ఇద్దరు వానరులు ఉన్నారు. వీరు చిన్నతనంలో మునులని బాగా అల్లరి పెట్టేవారు. వారి వస్తువులు నీళ్ళలో పడవేసేవారు. దాంతో మునులు కోపగించి, “మీరు నీళ్ళలో ఏం వేసినా అవి మునిగిపోకుండా తేలుతూ ఉండుగాక” అని శపించారు. ఆ శాపాన్ని మీరు వరంగా చేసుకుని వారిద్దరి సారధ్యంలో వారధి నిర్మాణం చేపట్టండి” అని చెప్పి అంతర్ధానమయ్యాడు. సముద్రుడు చెప్పినట్టే వారధి నిర్మాణం జయప్రదంగా పూర్తయింది.
సముద్రుడు ఇంతవరకు కథ చెప్పి ఆపగానే అధికారి “బండలు నీటి మీద తేలే టెక్నాలజీ మా దగ్గర కూడా ఉంది సార్.. కానీ అవి తెగిపోయి కొట్టుకుపోతున్నాయి” అన్నాడు.
“మీ దగ్గర టెక్నాలజీ ఉంది గాని ఆ నలుడు, నీలుడు లేరుగా వాటిని కదలకుండా బంధించి ఒక చోట కుదురుగా ఉంచడానికి.. మానవుడు కోతి నుంచే పుట్టాడు కాబట్టి ఆ నల, నీలుల అంశ మీలో ఎవరిలో ఉందో వెతికి పట్టుకోండి. వాళ్ళ చేత పని జరిపించండి” అని తరణోపాయం ఉపదేశించాడు సముద్రుడు.
“ఓర్నాయనోయ్.. వాళ్ళని ఎలా వెతికి పట్టుకోవాలి? ఎప్పటికి ఈ బ్రిడ్జి పని పూర్తి చేయాలి?” అంటూ లబోదిబోమన్నాడు అధికారి.
“మీ ఇష్టం వచ్చినట్టు అఘోరించండి. కానీ చివరిగా ఒక్క మాట చెబుతున్నాను. ఆ నల నీలులు వారికి మునులిచ్చిన శాపాన్ని వరంగా మార్చుకున్నారు. ఈ విశాఖపట్నానికి అందమైన బీచ్ దేవుడిచ్చిన వరం. ఆ వరాన్ని మీరు శాపంగా మార్చకండి” అంటూ మళ్లీ సముద్రంలోకి నడుచుకు పోయాడు సముద్రుడు.
– మంగు రాజగోపాల్