అమెరికాలోని తూర్పు కెంటకీలో ఎడతెగని వర్షాల కారణంగా పర్వత ప్రాంతాల్లోని వాగులు వంకలూ ఉప్పొంగి సమీప ప్రాంతాలను ముంచెత్తాయి. వరదల కారణంగా అప్పలాచియన్ పర్వత ప్రాంతంలోని వందల సంఖ్యలో ఇళ్లు నీట మునిగాయి. వరదల్లో చిక్కుకుని కనీసం 25 మంది మృతి చెందగా.. మరెంతో మంది గల్లంతయ్యారని రాష్ట్ర గవర్నర్ యాండీ బేషీర్ ప్రకటించారు. మొత్తం మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. వరదల్లో ఎంతమంది గల్లంతయ్యారనే వివరాలు ఇంకా రావాల్సి ఉందని చెప్పారు.
వర్షాలు, వరదలకు సెల్ ఫోన్ సిగ్నల్ లేవు. చాలా ప్రాంతాలు నీట మునగటంతో తాగునీటికి ఇబ్బందిగా ఉంది. వరద సహాయ చర్యల్లో టేన్నేసే, వెస్ట్ వర్జీనియా ప్రాంతాల అధికార యంత్రాంగం బాధితులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
వరద తాకిడికి అనేక భవనాల కూలిపోయాయి. రహదారులు, వంతెనలపై నీరు చేరింది. ప్రకృతి ప్రతాపానికి ఆ ప్రాంతమంతా విలవిల్లాడుతోంది. 23 వేల ఇళ్లకు కరెంటు సరఫరా లేదు. మరో రెండు రోజుల పాటు వరద ముప్పు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వరదల్లో చిక్కుకున్న అనేక మందిని ప్రభుత్వ అత్యవసర సిబ్బంది బోట్లు, హెలికాఫ్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.