Friday, November 22, 2024
HomeTrending Newsనేపాల్ లో రాజకీయ అనిశ్చితి

నేపాల్ లో రాజకీయ అనిశ్చితి

సుప్రీం కోర్ట్ తీర్పుతో నేపాల్ రాజకీయం రసకందాయంలో పడింది. రద్దైన పార్లమెంటు పునరిద్దరించాలనటంతో తాత్కాలిక ప్రధాని కేపి శర్మ ఒలి అనుచరులు నిరసనకు దిగారు. ఖాట్మండు లో ఒలి అభిమానులు పెద్ద సంఖ్యలో ఆందోళన బాట పట్టారు. కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని, సుప్రీం కోర్టు తీర్పు సమీక్ష చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు షేర్ బహదూర్ దేవ్ బా ప్రధాని పదవి చేపట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును అమలు చేయాలని, తాజా తీర్పు దేశ ప్రతిష్ట పెంచుతుందని దేవ్ బా అనుచరగణం దేశవ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయింది.

ఖాట్మండు రాజకీయ మలుపుల్ని చైనా ఓ కంట కనిపెడుతోంది. ఎవరు గద్దె నెక్కుతారో గమనిస్తోంది. ఇతర దేశాల నుంచి వచ్చే సరుకుల కోసం  చైనా రేవులు, రోడ్లు వాడుకోవటం పై మూడేళ్ళ కిందటే చైనా-నేపాల్ మధ్య ఒప్పందం జరిగింది.  అయితే ఇప్పటి వరకు ఒకసారి కూడా నేపాల్ ఆ ఒప్పందం ప్రకారం రేవులు, రోడ్లు వాడుకోలేదు. ఒప్పందం ఎలా అమలులోకి తీసుకు రావాలో నేపాల్ పాలకులకు అంతుపట్టడం లేదు. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలు ఎలాంటి మార్పులకు దారితీస్తాయోనని చైనా పాలకులు వేచి చూస్తున్నారు.

అయితే తాత్కాలిక ప్రధాని కేపి శర్మ ఒలి చైనా పాలకుల విధానాలకు అనిగిమనిగి ఉంటారనే పేరుంది. గతంలో చైనా విదేశాంగ కార్యాలయం అధికారిణితో సన్నిహిత సంబందాలు ఉన్నాయనే వార్తలు సంచలనం రేపాయి. షేర్ భాహడుర్ దేవ్ బా భారత దేశంతో సఖ్యతగా వ్యవహరిస్తారని, రెండు దేశాల మధ్య స్నేహం దేవ్ బా తోనే సాధ్యమని నేపాల్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజకీయ అనిశ్చితి ఇదే విధంగా కొనసాగితే దేశం ఆర్థికంగా దివాలతీయటం ఖాయమంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్