భారీ వర్షాలు, వరదల కారణంగా పాకిస్థాన్‌లోని మూడోవంతు భూభాగంలో పంటలు దెబ్బతిన్నాయి. రాబోయే రోజుల్లో కూరగాయలు, పండ్ల కొరత తలెత్తే ప్రమాదం ఉంది. నిత్యావసరాల ధరలు సైతం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న సామాన్య జనానికి ఇది పిడుగులాంటి వార్తే. కాగా వరదల కారణంగా ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉండటంతో.. పొరుగు దేశాలై ఇరాన్, అప్ఘానిస్థాన్‌ల నుంచి ఉల్లిపాయలు, టమాటోలు దిగుమతి చేసుకోవాలని పాకిస్థాన్ నిర్ణయించింది. టమాటోలు, ఉల్లిపాయల దిగుమతులపై మూడు నెలలపాటు సుంకాలు ఎత్తివేయాలని ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూను పాకిస్థాన్ జాతీయ ఆహార భద్రతా శాఖ కోరింది. మార్కెట్లో నిత్యవసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవడంపై పాకిస్థాన్ ప్రభుత్వం దృష్టి సారించింది.



