నిఖిల్ హీరోగా రూపొందిన ‘కార్తికేయ 2‘ క్రితం నెల 13వ తేదీన థియేటర్లకు వచ్చింది. ద్వాపరయుగం – ద్వారకానగరం .. ఈ రెండింటి మధ్య దాగిన ఓ రహస్యం అంటూ, దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాను థియేటర్లకు తీసుకుని వచ్చాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి, కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. 15 రోజులు కూడా తిరగకముందే ఈ సినిమా 100 కోట్ల మార్క్ ను టచ్ చేసింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ను రాఘవేంద్రరావు ఇంటర్వ్యూ చేశారు. 100 సినిమాలకి పైగా దర్శకత్వం వహించిన ఆయన, ‘కార్తికేయ 2’ టీమ్ ను ఇంటర్వ్యూ చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఆయన ప్రశ్నలకు నిఖిల్ స్పందిస్తూ .. ”  సార్ .. మాకు మీరే స్ఫూర్తి .. మీ సినిమాలను చూస్తూనే పెరిగాము. ఇప్పటికీ కూడా అప్పటి మీ సినిమాలను గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. ‘కార్తికేయ 2’ సినిమాలో కృష్ణుడి గురించి చెప్పాలనుకున్నాము. కానీ అనంతమైన ఆయన చరిత్రను ఇంత తక్కువ నిడివిలో ఎలా చెప్పాలనే విషయంలో టెన్షన్ పడిపోయాము” అన్నాడు.

ఇక చందూ మొండేటి మాట్లాడుతూ .. “ఈ సినిమా బాగానే ఆడుతుందని అనుకున్నాముగానీ, ఈ రేంజ్ లో ఆడుతుందని  ఎంత మాత్రం గెస్ చేయలేదు. ముఖ్యంగా నార్త్ నుంచి ఈ స్థాయి రెస్పాన్స్ వస్తుందని ఎంతమాత్రం అనుకోలేదు. హిందీలో ఈ సినిమా ఓ 10 కోట్లు వసూలు చేయవచ్చునేమో అని కాలభైరవ అన్నాడు. ఆ మాత్రం ఆశిస్తే ఆశ అవుతుందేమోనని నేను అన్నాను. కానీ చాలా ఫాస్టుగా ఈ సినిమా అక్కడ  25 కోట్ల గ్రాస్ ను దాటేసింది” అంటూ చెప్పుకొచ్చాడు. మధ్య మధ్యలో తన సినిమాల విషయాలను కూడా రాఘవేంద్రరావు చెబుతూ ఉండటంతో, ఈ ఇంటర్వ్యూ మరింత ఆసక్తికరంగా కొనసాగింది.

Also Read : ‘కార్తికేయ 2’ కు గుజరాత్ సిఎం ప్రశంసలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *