Wednesday, January 1, 2025

ఆకులు అలములు

సంస్కృతంలో “అన్నం” అన్న మాటకు “తినునది” అని అర్థం. శబ్ద వ్యుత్పత్తి ప్రకారం మనం తినేది అయినట్లే, అది మనల్ను తింటుంది అనే అర్థం కూడా వస్తుంది. ముందు మనం దాన్ని తింటాం. తరువాత అది మనల్ను తింటుంది.

భగవద్గీత శ్లోకం:-
“అహం వైశ్వానరో భూత్వా ప్రాణినామ్ దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం”

భావం :-
మీరు తిన్న ఆహార పదార్థాలన్నిటినీ కడుపులో జఠరాగ్ని(వేడి)గా ఉండి పచనం(గ్రైండ్)చేసి, పుష్టి కలిగిస్తున్నది, నాలుగు విధాలుగా జీర్ణం చేయిస్తున్నది నేనే.

ఈ గీతా శ్లోకాన్నే అన్నమయ్య కీర్తనగా తేట తెలుగు పదంలో-
“దీపనాగ్నినై జీవ దేహముల అన్నములు 
తీపుల నరగించేటి దేవుడ నేను 
యేపున నిందరిలోని హృదయములోననుందు 
దీపింతు తలపు మరపై దేవుడ నేను”
అని ఆధునిక ఉదరసంబంధ వ్యాధుల నిపుణుడైన వైద్యుడికంటే గొప్పగా చెప్పాడు.

అందుకే భాషలో శబ్దోత్పత్తి జోలికి వెళ్ళం. వెళితే ఇలా నానార్థాలు తెలిసి నానా గడ్డి కరవాల్సి వస్తుంది.

అధ్వ అంటే దారి. అన్నం అంటే ఆహారం. సవర్ణదీర్ఘసంధితో అధ్వాన్నం అయ్యింది. ఈ మాటకు అర్థం- దారి మధ్యలో వండీ వండక; ఉడికీ ఉడకక, రుచీపచీ లేకుండా, ఆకలికి స్పృహదప్పి పడిపోకుండా ఏదో ఒకటి అనుకుని…ఎలా ఉన్నా తినే ఆహారం అని. ఈమాటకు అర్థవ్యాప్తి వచ్చి…చెడిపోయినది, బాగలేనిదేదైనా “అధ్వాన్నం” అయ్యింది.

ఆహారానికి సంబంధించి ఆధునిక కాలానికి తగినట్లు భాషలో కొత్తమాటలను కాయిన్ చేయకపోవడం చాలా అధ్వాన్నమయిన విషయంగా పరిగణించాలి. ఆకాశంలో విమానంలో వెళుతూ తినే ఆహారాన్ని “ఆకాశాధ్వాన్నం” అనచ్చు. సముద్రంలో నౌకలో వెళుతూ తినే ఆహారాన్ని “జలాధ్వాన్నం” అనచ్చు. రైల్లో వెళుతూ బోగీలో తినే ఆహారాన్ని “బోగ్యాధ్వాన్నం” అనచ్చు. కార్లో, బస్సులో వెళుతూ తినే ఆహారాన్ని “అధ్వాధ్వాన్నం” అనచ్చు. ఇలా ప్రయాణిస్తున్న చోటు, వాహనాన్ని బట్టి ఈ అధ్వాన్న పారిభాషిక పదకల్పనకు ఆకాశమే హద్దు!

విదేశాలకు వెళ్ళినప్పుడు శాకాహారం దొరకడం అంత సులభం కాదు. కొన్ని చోట్ల శాకాహారం అంటే నిజంగా ఉడకబెట్టిన ఆకు కూరలే తినాలి. ఆమధ్య లండన్ వెళ్ళినప్పుడు థేమ్స్ నది పక్కన మా క్లాస్ మేట్లతో ఇక్కడే తినేవాళ్ళం అని మా అబ్బాయి ఒక హోటల్ కు తీసుకెళ్ళాడు. చిన్నప్పుడు వాడిని మేము చేయి పట్టుకుని లండన్లో తిప్పాము. ఇప్పుడు వాడు మా చేయి పట్టుకుని తిప్పాడు. మేము తినగలిగిన వెజ్ ఐటమ్స్ మెక్సికన్, జపాన్, ఇటలీ దేశాల ఆహార పదార్థాలను ఆర్డర్ ఇచ్చాడు. ఆ పేర్లు నోరు తిరగవు. టేబుల్ మీదికి వచ్చాక అవి బ్రెడ్డు ముక్కలు, ఉడకబెట్టి వేయించిన బంగాళాదుంపలు, ఆకు కూరలు అని అర్థమయ్యింది. పూర్వం రుషులు కందమూలాలు తిని బతికారు అని చదవడమే తప్ప రుచి చూడని నాకు విదేశాల్లో తిరుగుతున్న ప్రతిసారీ, ఆకులు అలములు, కందమూలాలు ఎంత గొప్పవో తెలుస్తూ ఉంటుంది.

అదెక్కడో వేళ మైళ్ళ దూరంలో సముద్రాలు దాటి…ఖండాలు దాటిన చోట్లు కాబట్టి ఆకులు అలములు తప్పవు. ఇక్కడ భాగ్యనగరంలో కూడా ఆహారభాగ్యం ఆకులు అలములచుట్టే తిరుగుతోంది.

సాధారణంగా హోటళ్ళకు వెళితే ఇడ్లి, దోసె, గారె, ఉప్మా, పూరీ లాంటి టిఫిన్లు సౌత్-నార్త్ ఇండియన్ మీల్స్ వరకు నాకు సిలబస్ తెలుసు. ఇప్పుడు నగరాల్లో ఆధునికులు వెళ్ళాల్సింది ఉడిపి హోటల్స్ కాదు. కాఫీ షాపులు. బార్లు. ఈట్ అవుట్లు. వాటికి విదేశీ పేర్లే ఉంటాయి. ఐటమ్స్ పేర్లు కూడా ఫ్రెంచ్, కొరియా, ఇటలీ పేర్లతోనే ఉంటాయి. ఆ పదార్థాల స్వరూపం, అమరిక, రంగు, రుచి, వాసన కూడా విదేశీయమే. విజాతి ధ్రువాలే ఎప్పుడూ ఆకర్షించుకుంటాయన్న భౌతికశాస్త్ర సూత్రంలా ఇక్కడ కూడా విజాతి ఐటెమ్స్ పరస్పరం ఆకర్షించుకుంటూ ఉంటాయి. ఆ సిలబస్ మా పాఠాల్లో లేదు కాబట్టి తెలియదు. ఇప్పుడు తెలుసుకునే వయసు కాదు. ముంజేతి మణికట్టు దాకా ఫుల్ షర్ట్, అరికాలి దాకా ప్యాంటు వేసుకున్న నేను అక్కడికెళ్ళగానే అప్పుడే పాతరాతియుగం గుహలోనుండి బయటికొచ్చి...తినడానికి వెళ్ళిన అనాగరికుడిలా నాకు నేనే విచిత్రంగా కనిపిస్తాను.

ఈమధ్య హైదరాబాద్ లో ఒక విదేశీ ఈటింగ్ ప్లేస్ కు వెళితే మా టేబుల్ పక్కన అమ్మాయి అరగంటలో తాగిన నాలుగయిదు సిగరెట్ల పొగను మేము ముగ్గురు సమానంగా పీల్చుకున్నాము. అసలు “పొగ తాగడం” అన్న మాటలోనే తప్పుంది. “పొగ వదలడం” అనాలి. పొగ తాగి…వారు వదిలితే…తాగనివారు పీలుస్తారు. చివరికి తెలుగులో సింపుల్ క్రియాపదాలు కూడా సరిగ్గా అర్థం కాక వచ్చిన అనర్థమిది! అలా ఒక్కొక్కరు అనివార్యంగా ఒకటిన్నర సిగరెట్టు తాగుతూ…తిన్న ఆహార పదార్థాలేమిటో గుర్తే లేదు.

పద్యమంతా ఒకే సమాసంతో ఉన్న ఎన్నెన్నో గుర్తు పెట్టుకోగలిగిన నాకు ఒక్క ఐటెం కూడా గుర్తుండదు. తిన్న రుచిని బట్టి ఒకటి బంగాళాదుంప ముక్క అని, ఒకటి టమోటా ముక్క అని, ఒకటి వెజ్ పిజ్జా అని లీలగా అనిపించింది. చివర కేక్ ముక్క. దానిమీద పోయడానికి డార్క్ చాకొలేట్ ద్రవం, మరో తీపి ద్రవం. రంగు రంగుల ద్రవాలు పోసి…ఆ కేకును ముక్కలుగా ఆబగా, తాదాత్మ్యంగా, తదేకంగా, తపస్సుగా, పరవశంగా చుట్టూ అందరూ ఎలా తింటున్నారో అలాగే అనుకరిస్తూ తిన్నాను. చుట్టూ అందరూ తినడం కంటే ఆ ఆహార పదార్థాలతో సెల్ఫీలు, వీడియోలు తీసుకుని వెంటనే ఇన్స్టాలో, ఫేస్ బుక్లో పెట్టుకుంటున్నారు.

ఇలాంటి నవనాగరికాహార ప్రదేశాల్లో నాలాంటి జానపదులు ఏమి తినాలో తెలుసుకోవడం ఒక జె ఈ ఈ అడ్వాన్స్ ఎత్తు!
వాటిని ఎలా తినకూడదో తెలుసుకోవడం మరో మెయిన్స్ ఎత్తు!
తిని అరిగించుకోగలగడం ఐ ఐ టీ లో ప్రవేశం పొందిన ఎత్తు!!

అన్నట్లు-
ఇప్పుడు అంతా “అధ్వాన్నమే” అయినప్పుడు అధ్వాన్నానికి నీచ నెగటివ్ అర్థం పోయి…పరమ పాజిటివ్ అర్థం వచ్చిందని అధికారికంగా ప్రకటించి…నిఘంటువులను సరిచేయాల్సిన బాధ్యత భాషోత్పత్తి శాస్త్రవేత్తలకు, నిఘంటు నిర్మాతలకు లేదా?

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్