Sunday, January 19, 2025
HomeTrending Newsవిదేశీ విద్య - విద్యార్థుల అగచాట్లు

విదేశీ విద్య – విద్యార్థుల అగచాట్లు

భారతదేశం నుంచి ఉన్నత చదువుల కోసం యువతీయువకులు పాశ్చాత్య దేశాలకు లక్షల్లో వెళుతున్నారు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు వెళ్లేందుకు యువత మక్కువ చూపుతోంది. రెండు దశాబ్దాలుగా ఇలా వెళ్ళటం ఫాషన్ అయింది. ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. విదేశీ విద్య కోసం బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి.

ఉన్నత చదువుల కోసం వెళ్ళిన వారు అక్కడే స్థిరపడుతున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలతో పౌరసత్వాలు తీసుకొని  విదేశాలకే పరిమితమవుతున్నారు. కొంత కాలంగా ఈ ధోరణి పెరిగి దేశంలో ప్రతి పట్టణం నుంచి విదేశాలకు వెళ్ళిన వారు ఉండటం సాధారణంగా మారింది.

భారతీయుల వలసల ధాటికి దేశ విదేశాంగ విధానమే మారే పరిస్థితి తలెత్తింది. UPA ప్రభుత్వం వరకు ప్రపంచంలోని చాలా దేశాలకు మన రాష్ట్రపతి, ప్రధానమంత్రి వెళ్ళటం జరగలేదు. నరేంద్రమోడి ప్రధాని అయ్యాక లాటిన్ అమెరికా దేశాలు, పశ్చిమ ఆఫ్రికా దేశాలను కూడా సందర్శించారు. మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళే విద్యార్థుల్లో తెలుగు రాష్ట్రాలు ప్రథమ స్థానంలో ఉండగా పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాలు తర్వాతి వరుసలో ఉన్నాయి.

కెనడా

ఇండ్ల సంక్షోభం నెలకొన్న కెనడాలో విదేశీ విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉన్నది. ఉన్నత విద్య అభ్యసించేందుకు అక్కడకు వెళ్లిన వారికి ఇండ్లు దొరకడం కష్టతరంగా మారింది. ఇటీవల బ్రాంప్టన్‌ పట్టణంలోని ఒక అద్దె భవనంపై దాడులు చేసిన అధికారులు.. ఆ భవనం బేస్‌మెంట్‌లో ఏకంగా 25 మంది విద్యార్థులు నివసిస్తున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో నగర మేయర్‌ పాట్రిక్‌ బ్రౌన్‌ కీలక నిర్ణయం తీసుకొన్నారు. యజమానులు తమ రెంటల్‌ ప్రాపర్టీలను నగర కౌన్సిల్‌ వద్ద తప్పనిసరిగా రిజిస్టర్‌ చేసుకొనేలా ఒక చట్టం తీసుకురానున్నట్టు వెల్లడించారు.

సింగిల్‌ యూనిట్‌ను డజన్ల మంది విదేశీ విద్యార్థులకు అద్దెకు ఇవ్వడం ద్వారా యజమానులు భద్రతా ప్రమాణాలను విస్మరిస్తున్నారు. తద్వారా విద్యార్థులు ప్రమాదకరమైన పరిస్థితుల్లో జీవించేలా చేస్తున్నారు. అలాంటి యాజమానులపై తగిన చర్యలు తీసుకొంటామని మేయర్‌ హెచ్చరించారు. బ్రాంప్టన్‌లో గణనీయమైన సంఖ్యలో భారతీయ వలసదారులు నివసిస్తుంటారు.

ఆస్ట్రేలియా

విద్యార్థుల దరఖాస్తులను తాము తిరస్కరించడం లేదని ఆస్ట్రేలియా యూనివర్సిటీలు చెబుతున్నాయి. అయితే ఇటీవలి స్టడీ వీసా దరఖాస్తుల విషయంలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నదని విదేశీ విద్యా నిపుణులు అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆస్ట్రేలియాలో మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్య 3,75,000కు తగ్గుతుందని, తర్వాతి ఏడాదికి రెండున్నర లక్షలకు పడిపోతుందనే అంచనాలు ఉన్నాయని ఇన్‌ఫైనెట్‌ గ్రూపు సీఈవో గౌరవ్‌ బాత్రా అన్నారు.

ఈ వీసా దరఖాస్తుల తిరస్కరణల ప్రభావం, ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠిన నిబంధనలను గమనించదగినవని పేర్కొన్నారు. అధికారులు సరైన సమాచారం ఇవ్వకుండా చాలా దరఖాస్తులను తిరస్కరించారని, ఇది ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా రావాలనుకొంటున్న విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. తాజా పరిణామాల నేపథ్యంలో పలువురు విద్యార్థులు న్యూజిలాండ్‌, ఇతర దేశాల వైపు చూస్తున్నారు. తప్పుడు పత్రాలు సమర్పించడం వంటివి వీసా తిరస్కరణకు కారణాలుగా ఉండొచ్చని ఈఎస్‌ఎస్‌ గ్లోబల్‌ డైరెక్టర్‌ రోహిత్‌ సేథి చెబుతున్నారు.

యుకె

ఉన్నత చదువుల కోసం యూకేకు వెళ్లటానికి భారతీయులు ప్రస్తుతం ఆసక్తి కనబర్చటం లేదు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల అడ్మిషన్స్‌ సర్వీస్‌ (యూసీఏఎస్‌) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. బ్రిటన్‌కు ఉన్నత చదువుల కోసం వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 0.7 శాతం పెరిగినా.. కేవలం ఇండియా, నైజీరియా నుంచి వెళ్లే విద్యార్థుల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టిందని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

గత ఏడాదితో పోలిస్తే భారత్‌ నుంచి వచ్చే దరఖాస్తుల్లో 4 శాతం తగ్గుముఖం కనిపించింది. నైజీరియా నుంచి వచ్చే దరఖాస్తుల్లో 46 శాతం తగ్గుదల నమోదైంది. పోస్ట్‌ స్టడీ వర్క్‌ వీసాపై ఆంక్షలు, విద్యార్థులు తమ వెంట కుటుంబసభ్యులను తీసుకురావడంపై ప్రభుత్వం నియంత్రణ విధించడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది.

యూకేను ఆర్థికమాంద్యం చుట్టుముట్టింది. 2023 నాలుగో త్రైమాసికంలో జీడీపీ 0.3 శాతం క్షీణించడంతో దేశం మాంద్యంలోకి జారుకుంది. ఇది భవిష్యత్తులోనూ కొనసాగవచ్చుననే అంచనాల నేపథ్యంలో యూకేలోని భారతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మాంద్యం ప్రభావం ప్రధానం గా ఉద్యోగాలపై పడుతుందని, ఉద్యోగం రాకుండానే పోస్టు స్టడీ వర్క్‌ వీసా అయిపోతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా

అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. నాణ్యమైన విద్య, ఎక్కువ జీతం కోసం భారతీయ విద్యార్థులు చలో అమెరికా అంటున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న భారత విద్యార్థుల సంఖ్యలో 35 శాతం పెరుగుదల నమోదైంది. భారత్‌తో పోలిస్తే చదువులకు అయ్యే ఖర్చు కాస్త ఎక్కువైనా.. అమెరికాలో మంచి ఉద్యోగం దొరికితే జీవితంలో స్థిరపడొచ్చని యువత భావిస్తోంది.

అసోసియేటెడ్‌ ప్రెస్‌ అంచనాల ప్రకారం ప్రస్తుతం అమెరికాలో 2.69 లక్షల మంది భారతీయలు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 10 లక్షలకు చేరుతుందని అంచనా. భారత్‌లోని టైర్‌ 2, 3 నగరాల విద్యార్థులు కూడా అమెరికా చదువులపై ఆసక్తి చూపిస్తున్నారు. భారత విద్యార్థులు ట్యూషన్‌ ఫీజులు పూర్తిగా చెల్లిస్తుండటం వల్ల అమెరికా యూనివర్సిటీల ఆదాయం బాగానే పెరుగుతున్నది.

యూఎస్‌లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు భారతీయ విద్యార్థులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. వరుసగా భారత విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతుంటడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ ఏడాది మూడు నెలల కాలంలోనే 11 మంది భారత విద్యార్థులు మృతిచెందారు. వీరంతా 25 ఏండ్లు లేదా అంతకంటే తక్కువ వయసు వారే కావడం గమనార్హం.

అమెరికాకు విదేశీ విద్యార్థుల రాకతో స్థానికులకు ఉపాధి అవకాశాలు దెబ్బ తింటున్నాయి. దీంతో విదేశీయులపై ముఖ్యంగా భారతీయులపై అక్కడి యువత అక్కసు పెంచుకుంటోంది. మరోవైపు చదువుకునే విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగం చేసుకునే అవకాశం ఉన్నా తగిన ఉపాది లభించక ఇబ్బందులు పడుతున్నారు. తామర తంపరగా వస్తున్నవారితో

భారత్ నుంచి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే విద్యార్థుల్లో అధికశాతం… అక్కడి పరిస్థితులను అంచనా వేయటం లేదు. దీంతో ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న జాబ్‌ మార్కెట్‌ మాంద్యంతో మరింత దిగజారింది. పెరుగుతున్న జీవన వ్యయం, పని ఒత్తిడి కారణంగా ఉద్యోగం పొందిన విద్యార్థులు కూడా స్పాన్సర్‌షిప్‌ ద్వారా వీసా పొడిగించేందుకు ఆసక్తి చూపడం లేదు.

కేంద్ర ప్రభుత్వం విదేశీ విద్య, ఉపాధి కోసం వెళుతున్న వారి కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మేధావులు సూచిస్తున్నారు. విదేశాల నుంచి వస్తున్న మారక ద్రవ్యంతో ఆదాయం ఆర్జిస్తున్న ప్రభుత్వం విదేశాల్లోని భారతీయుల క్షేమం కోసం తగిన చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలు ఉన్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్