డైనమిక్ లీడర్ గా వెలుగొందిన కరీంనగర్ మాజీ ఎంఎల్ఏ వెలిచాల జగపతి రావు (87) బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్ లో కన్నుమూశారు. జగపతి రావు రాజకీయ నాయకుడే కాకుండా కవి కూడా. వివిధ దినపత్రికల్లో వ్యాసాలు కూడా రాశారు. అయన చివరి రోజుల్లో బి.జె.పికి దగ్గరయ్యారు. రెండు నెలల క్రితం కరీంనగర్ లో జరిగిన సమావేశంలో బి జెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తో కలసి మౌన దిక్షలో పాల్గొన్నారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ కరీంనగర్ ఆపాలో ఆసుపత్రిలో చికిత్స పొందారు. కొద్దీ రోజుల క్రితం హైదరాబాద్ లో తన రెండవ కుమారుడు రాజేందర్ రావు వద్దకు వెళ్లారు. అక్కడే అనారోగ్యం తో బాధపడుతూ తుది శ్వాస విడిచారు.
కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న జగపతిరావు వివిధ సందర్భాల్లో స్వతంత్ర అభ్యర్థిగా కూడా ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు. 1972 లో జగిత్యాల నుండి, 1989 లో కరీంనగర్ నుండి ఎం ఎల్ ఏ గా గెలుపొందారు. పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎం ఎల్ సి గా ప్రాతినిధ్యం వహించారు. భార్య సరళాదేవి మరణాంతరం ఎక్కువ సమయం కరీంనగర్ లోనే ఉన్నారు. 2017లో తన భార్యపేరు మీద హరితహారం కార్యక్రమానికి 25లక్షల విరాళం ఇచ్చారు. జగపతి రావు ప్రకృతి ప్రేమికుడు కూడా. కరీంనగర్ లో తన నివాసం లో వేలాది మొక్కలను పెంచి బొటానికల్ గార్డెన్గా తీర్చి దిద్దారు.