Bharat Bhavan: భారత్ భవన్ కు శంఖుస్థాపన

ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. భావి భారత నిర్మాతలుగా రేపటి యువతను తయారు చేసే దిశగా, దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత సమర్థవంతమైన నాయకత్వాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరమున్నదన్నారు. ఇందుకోసం రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సైద్దాంతిక రంగాల్లో భోధన, శిక్షణ అవసరమున్నదని సిఎం కేసీఆర్ అన్నారు. ఈ దిశగా చేపట్టిన చర్యల్లో భాగంగా, సోమవారం కోకాపేటలో ‘భారత్ భవన్’ (సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్) కు బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ శంఖుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ… ‘‘ దేశ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుంటూ పనిచేసే సమర్థవంతమైన నాయకత్వం వర్తమాన భారతానికి అవసరమున్నది. సమాజాభివృద్ధికి దోహదం చేసే దిశగా నాయకత్వాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనమీద వున్నది. ఈ దిశగా ప్రపంచ వ్యాప్తంగా ఆయా రంగాల్లో అనుభవజ్జులైన గొప్ప గొప్ప మేధావులను, నోబుల్ లారేట్లను కూడా పిలిచి నాయకత్వ శిక్షణనిప్పిస్తాం. ప్రజలకు సుపరిపాలన నందించే నాయకత్వాన్ని తీర్చిదిద్దుతాం. తద్వారా భారత ప్రజాస్వామిక సౌధాన్ని మరింత పటిష్టం చేసే కృషి చేస్తాం. అందులో భాగంగానే ‘ పొలిటికల్ ఎక్సలెన్స్ అండ్ హెచ్ ఆర్ డీ’ కేంద్రాన్ని తీర్చిదిద్దాలనే నిర్ణయం తీసుకున్నాం.’’ అని సిఎం కేసీఆర్ తెలిపారు.

రాజకీయ సామాజిక ఆర్థిక రంగాల్లో శిక్షణనిచ్చేందుకు దేశం నలు మూలల నుంచి అనుభవజ్జులైన రాజనీతి శాస్త్రజ్జులు, ఆర్థిక వేత్తలు సామాజిక వేత్తలు సమాజాభివృద్ధికి దోహదం చేసే రచయితలు ప్రొఫెసర్లు విశ్రాంత అధికారులు తదితరులను ఆహ్వానించనున్నట్టు సిఎం తెలిపారు. దేశం నలుమూలల నుంచి వచ్చే సామాజిక కార్యకర్తలకు రాజకీయ వేత్తలకు నాయకులకు భారత్ భవన్ లో సమగ్రమైన సమస్త సమాచారం లభ్యమౌతుందని సిఎం అన్నారు.

ఇక్కడికి శిక్షణ కోసం వచ్చే వారికోసం, శిక్షణ పొందే వారి కోసం వసతులను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. శిక్షణకు అనుగుణంగా.. తరగతి గదులు, ప్రొజెక్టర్ తో కూడిన మినిహాల్స్, విశాలమైన సమావేశ మందిరాలు, అత్యాధునిక సాంకేతికత కలిగిన డిజిటల్ లైబ్రరీలు, వసతికోసం లగ్జరీ గదులు నిర్మితమౌతాయని సిఎం అన్నారు. దేశ విదేశాల వార్తా పత్రికలు అందుబాటులో వుంటాయని తెలిపారు. ప్రపంచ రాజకీయ సామాజిక తాత్విక రంగాలకు చెందిన ప్రపంచ మేధావుల రచనలు, గ్రంధాలు అందుబాటులో వుంటాయన్నారు. స్థానిక, దేశీయ, అంతర్జాతీయ మీడియా ఛానల్లు సమాచార కేంద్రాలుండే ఏర్పాటు చేస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా…సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రంగాల్లో చోటు చేసుకునే పురోగతిని పరిశీలించే వేదికలను అందుబాటులోకి తెస్తామన్నారు. వార్తలు కథనాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ విశ్లేషించి, క్రోడీకరించే వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నామని అధినేత తెలిపారు.
ప్రజలను నిత్యం ప్రభావితం చేస్తున్న సామాజిక మాధ్యమాల పట్ల అవగాహన కోసం ప్రత్యేక శిక్షణాతరగతులుంటాయని అన్నారు. మీడియా రంగంలో రోజు రోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతికను అందిపుచ్చుకునే దిశగా సీనియర్ టెక్నికల్ బృందాలు కూడా పనిచేస్తాయని తెలిపారు. సంక్షేమం అభివృద్ధి రంగాల అధ్యయనం దిశగా, శిక్షణ సమాచారం అందుబాటులో వుంటుందన్నారు.
భారత్ భవన్ కు కేటాయించిన స్థలంలోని కొంతమేరకే భవన నిర్మాణం చేపడుతామని, మిగిలిన స్థలమంతా పచ్చదనంతో నింపుతామన్నారు. నాయకత్వ శిక్షణ కోసం ఇక్కడకు వచ్చే వారికి విశాల ప్రాంతంలో ఆహ్లాదకరవాతావరణం లో శిక్షణ బోధన అందుతుందని సిఎం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *