Monday, November 11, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపాపం పసివాళ్లు!

పాపం పసివాళ్లు!

Children are Safe:
అమ్మా చూడాలీ!
నిన్నూ నాన్నని చూడాలీ
నాన్నకు ముద్దూలివ్వాలి
నీ ఒడిలో నిద్దుర పోవాలి

ఇల్లు చేరే దారే లేదమ్మా… నిన్ను చూసే ఆశే లేదమ్మా…
ఇల్లు చేరే దారే లేదమ్మా… నిన్ను చూసే ఆశే లేదమ్మా…
నడవాలంటే ఓపిక లేదు… ఆకలి వేస్తోంది
అమ్మా… అమ్మా… అమ్మా… అమ్మా…
పలికేందుకు మనిషే లేడు… నిలిచేందుకు నీడే లేదు …
పలికేందుకు మనిషే లేడు … నిలిచేందుకు నీడే లేదు …
బాధగా ఉంది భయమేస్తోంది.. ప్రాణం లాగేస్తోంది
అమ్మా… అమ్మా…”

యాభై ఏళ్ళక్రితం వచ్చిన పాపం పసివాడు సినిమాలో పాట ఇది. ఎప్పుడు విన్నా, చూసినా గుండె బరువెక్కుతుంది. ‘ లాస్ట్ ఇన్ ద ఫారెస్ట్ ‘ అనే ఆఫ్రికా చిత్రానికి తెలుగు రీమేక్. చిన్నపిల్లవాడు చికిత్స కోసం పైలట్ అయిన మామయ్య, కుక్కపిల్లతో ప్రైవేటు విమానంలో విదేశాలకు వెళుతుంటే అడవిలో విమానం కూలిపోతుంది. ఆ పిల్లవాడు ఎలా బతికి అడవినుంచి బయటపడ్డాడు అనేది ఇతివృత్తం. అడవిలో తిరుగుతూ అమ్మానాన్నలకోసం అలమటించే వేళ పసివాడి వేదన పై పాటలో అద్భుతంగా ఆవిష్కరించారు. పిల్లల కంట్లో నలుసు పడితేనే విలవిల్లాడే తల్లిదండ్రులకు తమ పిల్లలు ఆపదలో ఉన్నారంటే కాళ్ళూ చేతులు ఆడవు. ఇలాంటి సంఘటనే కొలంబియా దేశంలో జరిగింది. ఒకటీ రెండూ కాదు నలభై రోజుల పాటు నలుగురు పిల్లలు అమెజాన్ అడవుల్లో తప్పిపోయి ఇన్నాళ్ల వెతుకులాట తర్వాత మిలిటరీ దళాలకు దొరికిన వైనం యావత్ దేశానికి పండగైంది. ప్రపంచానికి సంతోషమనిపించింది. పిల్లలకు ప్రకృతితో పరిచయం ఉండాలని తెలియచెప్పింది. అవునుమరి, ఈ పిల్లలకు అడవులు, చెట్టుచేమలతో ఉన్న పరిచయమే వారిని కాపాడిందని అందరూ అంటున్నారు.

13,9,4,1… ఈ అంకెలు ర్యాంకులు కావు. విమాన ప్రమాదంలో తల్లి, సహాయకుడు, పైలట్ తో ప్రయాణిస్తున్న నలుగురు పిల్లల వయసు. వీరిలో పెద్దది లెస్లీ. హ్యూటిటో అనే తెగకు చెందిన కుటుంబం. అడవులు చెట్లు కొత్త కాదు. అందునా లెస్లీ తల్లి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంది. అమెజాన్ అడవుల్లో విమానం కూలిపోయి తల్లి, మరో ఇద్దరు మరణించిన వేళ ఆ చిన్నారి తన తమ్ముళ్లకు తల్లయింది. వారి క్షేమమే ధ్యేయంగా అడవిలో ప్రయాణించింది. అడవిలో ఏ పండు తినాలి, ఎలా తమని తాము రక్షించుకోవాలి అనే విషయాలపై అవగాహన ఉండబట్టి తమ్ముళ్ళతో కలసి విమాన శిధిలాల నుంచి కొంత ఆహారం తీసుకుని బయలుదేరింది. వీరిని వెతుకుతున్న బృందాలకు మొదట విమాన శిధిలాలు, ఆపై మరణించిన వారి శరీరాలు కనిపించాయి. అప్పుడు పిల్లలకోసం వెతకడం ప్రారంభించారు. మిలిటరీ జాగిలం కూడా సహాయపడింది.

అడవిలో పిల్లల అడుగుజాడలు, వారు వదిలిన వస్తువులు కనిపించాయి. దాంతో స్థానిక తెగల సహకారం తీసుకుని ఓపికగా అన్వేషణ ప్రారంభించారు. హెలీకాఫ్టర్లలో ఆహారం జారవిడిచారు. పిల్లల అమ్మమ్మ మాటల్ని రికార్డు చేసి మైకుల్లో వినిపించారు. అలా సుమారు నెలపాటు గాలిస్తే మొన్నటికి పిల్లల ఆచూకీ చిక్కింది. నలుగురూ క్షేమం. కాకపోతే అన్నాళ్ళుగా సరయిన ఆహారం, నీరు లేక నీరసించిపోయారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా కొలంబియా అధ్యక్షుడు స్థానిక తెగలు, మిలిటరీ మధ్య గొడవలకు పరిష్కారం ప్రకటించడం విశేషం. ఇప్పుడు దేశమంతా ఆ పిల్లలనే చూస్తోంది. తల్లిని పోగొట్టుకున్న పిల్లలను అడవితల్లి కాపాడిన విశేషమే చెప్పుకుంటోంది. త్వరలో ఈ సంఘటన సినిమాగా వచ్చినా ఆశ్చర్యంలేదు.

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

మన భాష- 4

మన భాష- 3

మన భాష- 2

న్యూస్