Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకర్ణాటకలో ఉచిత ప్రయాణ ఉద్యమం

కర్ణాటకలో ఉచిత ప్రయాణ ఉద్యమం

Freebies – Financial Bites: ప్రభుత్వాల ఉచితానుచితాల మీద చర్చ కాదిది. ఆంధ్ర- కర్ణాటక సరిహద్దు ఊళ్లు లేపాక్షి, హిందూపురంలో పెరిగినవాడిని కాబట్టి కన్నడ రాయడం తప్ప…చదవగలను. రోజువారీ పనులకు సరిపడా మాట్లాడగలను. మా ప్రాంతంలో తెలుగును కన్నడ ఉచ్చారణతోనే మాట్లాడతారు. లేదా మాట్లాడే తెలుగులో సగం కన్నడను నింపేస్తారు. దానికదిగా ఒక మాండలికం. దాని అందచందాలు, మిగతా ప్రాంతాల వారికి అది ఎగతాళి కావడం మీద ఇంకెప్పుడయినా మాట్లాడుకుందాం. ప్రస్తుతం మన చర్చ- కర్ణాటకలో కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు మహిళలకు ఆర్ టీ సీ లో ఉచిత ప్రయాణానికి అనుమతించడం గురించి. ఆ ప్రాంతం నుండి నా మిత్రులు అనేక విషయాలు చెబుతున్నారు. ఆ వివరాలివి.

సులభంగా అర్థం కావడానికి కన్నడ దినపత్రికలో వచ్చిన ఒక కార్టూన్ చూడండి. పరిస్థితి ఏమిటో తెలిసిపోతుంది.
“అయ్యో! తుంబ మళేరీ! ఇళియోదు బేడా. నిల్లో తనక ఈ బస్సల్లే సుత్తోణా! హెంగిద్రూ “ఫ్రీ” తానే!”
(అయ్యో! వర్షం బాగా వస్తోందండీ! దిగద్దు. వర్షం ఆగేదాకా ఈ బస్సులోనే తిరుగుతూ ఉందాం…ఎలాగూ “ఫ్రీ”యే కదా!)

ఎన్నికల మ్యానిఫెస్టో అంటే కొందరికి చిత్తు కాగితం. కొందరికి గాలి పోగేసిన మాటల పుట్ట. కొందరికి ఎన్నికల ఏరు దాటగానే తగలేయాల్సిన తెప్ప. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇలా ఎలా చెబుతారు? అని అడగగలిగే వ్యవస్థలు మనకు లేవు. అందులో చెప్పినవి చేయకపోతే…బాధ్యులను చేసి…అనర్హులుగా ప్రకటించే నియమ నిబంధనలు లేవు. కాబట్టి మ్యానిఫెస్టో తయారీ, ప్రకటన, అమలు గురించి ఎవరికీ పెద్ద పట్టింపు లేకుండా పోయింది. ఆ కోణంలో చూసినప్పుడు కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను...గెలిచిన వెంటనే అమలు చేయడం- నిజంగా అభినందించదగ్గ విషయం. ఎన్నాళ్లు అమలు చేయగలరు? రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో ఉచితాల మీద ఎంత శాతం వరకు సముచితం అన్న చర్చ ఇక్కడ అనవసరం. “నువ్ తొడ కోసుకుంటే…నేను మెడ కోసుకుంటా…” అన్నట్లు ఈ విషయంలో పార్టీలు పరస్పరం పోటీలు పడి ప్రభుత్వ ఖజానాను అహోబిల మఠం చేస్తాయి కాబట్టి…ఉచితానుచితాల మీద చర్చించడం ఒట్టి కంఠ శోష.

కర్ణాటకలో ఆర్ టీ సీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాలు మొదలయ్యాక పరిస్థితిని పరిశీలిస్తే-

1. పుట్టలు పగిలినట్లు మహిళలు రోడ్ల మీదికి వస్తున్నారు.
2. ఎంత దూరమయినా మహిళలు ఆర్ టీ సీ బస్సులనే ఆశ్రయిస్తున్నారు.
3. కూరలు కొనడానికి, పాలు తీసుకురావడానికి కూడా ఆర్ టీ సీ బస్సులే శరణ్యం.
4. బెంగళూరులో ఒక కాలనీలో నలభై మంది మహిళలు కుక్కే సుబ్రహ్మణ్యం గుడికి వెళ్లాలనుకున్నారు. “కాబట్టి ఆర్ టీ సీ బస్సును మా కాలనీకి పంపుతారా? ఉచితంగా వెళ్లి…వచ్చి…మా కాలనీలో మా గుమ్మాల ముందే దిగుతాం” అని ఒక మహిళా మణి ఆర్ టీ సీ కి ఫోన్ చేశారు. ఆ ఫోన్ అందుకున్న మేనేజర్ ప్రస్తుతం బెంగళూరు NIMHANS (మానసిక వ్యాధుల వైద్యశాల) గేటు ముందు తిరుగుతున్నారేమో అని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది!


5. కర్ణాటకలో పల్లె మొదలు పట్టణాలు, నగరాల దాకా షాపింగ్ కాంప్లెక్స్ లు, పెద్ద పెద్ద మాల్స్, పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలు ఆర్ టీ సీ లో ఉచితంగా ప్రయాణించి…వచ్చిన మహిళలతో కిటకిటలాడుతున్నాయి.
6. ఈ తాకిడిని తట్టుకోలేని కొందరు తమ పర్యటనలను వాయిదా వేసుకోక తప్పడం లేదు.
7. ఉచితంగా ఎంత దూరమయినా ప్రయాణించి…సత్రాల్లో ఉచితంగా పడుకుంటూ…గుళ్ళల్లో ఉచిత అన్నదానం కేంద్రాల్లో తింటున్న మహిళల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో చిన్నా చితకా క్షేత్రాలు కూడా జనంతో కళకళలాడుతున్నాయి.


8. కర్ణాటక ఆర్ టీ సీ నిలువునా మునిగినా…ఇతరేతర రంగాలకు ఇది ఊతం కాగలదని ఆర్థికరంగ నిపుణుల అంచనా!
9. ఇళ్లల్లో పురుషులు కాలు కదలక విలవిలలాడుతుండడం పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదు. కొన్ని శతాబ్దాల తరువాత మహిళలకు కొత్తగా వచ్చిన “ఉచిత” రెక్కలతో విస్తృతంగా తిరగడం సామాజిక మార్పుకు సంకేతం. హెంగిద్రూ “ఫ్రీ” తానే! ఇళియోదు బేడా! నిల్ల బేడా! హోగుతా ఇరి!- ఆగకండి! దిగనే దిగకండి! ఎలాగూ ఫ్రీయే కదా! వెళుతూనే ఉండండి!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్