Friday, April 19, 2024
HomeTrending Newsకంటోన్మెంట్ వాసులకు ఉచితంగా తాగునీరు

కంటోన్మెంట్ వాసులకు ఉచితంగా తాగునీరు

కంటోన్మెంట్ వాసులకు కూడా ఉచితంగా తాగునీటి సరఫరా కార్యక్రమం అమలు చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. బుధవారం సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో MLA సాయన్న తో కలిసి వాటర్ వర్క్స్ అధికారులు, బోర్డు CEO అజిత్ రెడ్డి లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల నీరు ఉచితంగా సరఫరా అమలులోకి వస్తుందని తెలిపారు. దీని వలన ప్రతి నెల సుమారు కోటిన్నర రూపాయల ఆర్ధిక భారం ప్రభుత్వం పై పడుతున్నదని చెప్పారు. దేశంలో 62 కంటోన్మెంట్ బోర్డులు ఉండగా ఒక్క తెలంగాణ లో మాత్రమే ముఖ్యమంత్రి ఆదేశాలతో అమలు ఉచిత నీటి సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కంటోన్మెంట్ ప్రజలు కూడా మా బిడ్డలే.. వారిని కన్నబిడ్డలుగా భావించి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం కాపాడుకుంటుందని చెప్పారు. కంటోన్మెంట్ ప్రాంతం లో సుమారు 4 లక్షల మంది జనాభా ఉందని, వారికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ క్రింద పేదింటి ఆడపడుచుల వివాహానికి ఆర్ధిక సహాయం, ఆసరా క్రింద వృద్దులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్ లు, పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను వర్తింప చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే కంటోన్మెంట్ అభివృద్ధి, ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవ చూపారని అన్నారు. రామన్నకుంట అభివృద్ధి కోసం 3 కోట్ల రూపాయలు, ప్యాట్నీ నాలా అభివృద్ధి, నిర్మాణ పనుల కోసం 10 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవల కోసం బొల్లారం లో బ్రహ్మాడమైన హాస్పిటల్ నిర్మాణం కోసం ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని, త్వరలో పనులు చేపట్టడం జరుగుతుందని వివరించారు.

కంటోన్మెంట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించడం లేదని అన్నారు. ప్రజల నుండి వసూలు చేసిన పన్నులను కూడా అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయకపోవడం దుర్మార్గం అన్నారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోగా తరచుగా కంటోన్మెంట్ రోడ్లను బ్లాక్ చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇది సరైన విధానం కాదన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని, ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించాలని అన్నారు. ఈ ప్రాంత సమస్యలను తెలుసుకోకుండా, పరిష్కరించకుండా కేంద్రం మోద్దునిద్రపోతుందని విమర్శించారు. బోర్డు కమిటీలు సమస్యల పై తీర్మాణాలు చేసి పంపినా పట్టించుకోకపోవడం బాధ్యతారాహిత్యం అని పేర్కొన్నారు. రక్షణమంత్రి దేశంలోని కంటోన్మెంట్ లలో పర్యటిస్తే ప్రజలు పడుతున్న బాధలు, సమస్యలు తెలుస్తాయని, ఆ మాత్రం ఆలోచన లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో బేవ రేజెస్ కార్పోరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, వాటర్ వర్క్స్ ED సత్యనారాయణ, ENC కృష్ణ, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, సభ్యులు లోకనాధం, పాండు యాదవ్, నళినీ కిరణ్, అనిత ప్రభాకర్, భాగ్య శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : పనికి మాలిన.. పసలేని బడ్జెట్ – సిఎం కెసిఆర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్