పేద ప్రజలకు అందించే రాయితీ విద్యుత్‌పై కేంద్రం కుట్రలు చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించడం కేంద్రానికి కంటగింపుగా మారిందని పేర్కొన్నారు. కేంద్రం ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఉచిత విద్యుత్ ఆపే ప్రసక్తే లేదని మంత్రి తేల్చిచెప్పారు. రాయితీ విద్యుత్ చార్జీలను డిస్కంలకు ముందస్తుగా చెల్లించాలనే కేంద్రం నూతన విద్యుత్ విధానంపై మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు.
కేసీఆర్ ఉన్నంతవరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తాం అని మంత్రి స్పష్టం చేశారు. విద్యుత్ రంగాన్ని ప్రయివేటు పరం చేయడం కోసమే కేంద్రం ఎత్తులు వేస్తోందని ధ్వజమెత్తారు. అన్నం పెట్టే రైతుకు ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచడం కోసమే సబ్సిడీలు ఇస్తున్నామని చెప్పారు. కేంద్రం ఫ్యూడల్ ఆలోచనలతో పేదలకు తీవ్ర నష్టం వాటిల్లుందని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకే కేంద్రం దుర్మార్గమైన ఆలోచన చేస్తుందన్నారు. ఉచిత విద్యుత్ ఆపేది లేదన్నారు. కేంద్రం తీసుకొస్తున్న నూతన విద్యుత్ విధానాన్ని వ్యతిరేకిస్తాం అని మంత్రి స్పష్టం చేశారు.
Also Read : రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం