ప్రపంచ దేశాల్లో ఆహార కొరత తృణధాన్యాల సాగుతోనే తీరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భారత దేశంలో ఆహార భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో పదిహేడవ జీ-20 సదస్సు ఈ రోజు (మంగళవారం) ప్రారంభమైంది. ఈ రోజు విద్యుత్, ఆహార భద్రత మీద జరిగిన సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. వచ్చే ఏడాది బుద్ధుడు, గాంధీల పవిత్ర భూమిలో(భారత్‌లో జరగబోయే సమావేశాన్ని ఉద్దేశించి) జీ20 సమావేశమైనప్పుడు ప్రపంచశాంతి అనే బలమైన సందేశం తెలియజేయడానికి అంగీకరిస్తామని నేను విశ్వసిస్తున్నా అని ప్రధాని మోదీ అన్నారు. భారత్‌లో ఆహార భద్రతను ప్రస్తావించారు. నేటి ఎరువుల కొరత రేపటి ఆహార సంక్షోభానికి దారి తీయవచ్చునని అన్నారు. ఎరువులు, ఆహార ధాన్యాల సరఫరా గొలుసును స్థిరంగా ఉంచేలా ప్రపంచ దేశాలు మధ్య ఒప్పందాలు జరగాలన్నారు.
వాతావరణ మార్పులు, పుడ్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ, కరోనా మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు సహా పలు అంశాల గురించి మోదీ ప్రస్తావించారు. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధాన్ని ఆపడానికి దౌత్యమార్గాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు. ఇందుకోసం ప్రపంచం సమిష్టిగా కృషి చేయాలని మోదీ దేశాధినేతలకు పిలుపునిచ్చారు. కరోనా తర్వాత కొత్త ప్రపంచ వ్యవస్థను సృష్టించే బాధ్యత మనపై ఉందని చాటి చెప్పారు.
మోదీ – బైడెన్ ఆలింగనం భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య ఆత్మీయత వెల్లివిరిసింది. జీ-20 సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఈ ఇద్దరు నేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రధాని మంత్రి కార్యాలయం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. వారిద్దరి మధ్య కొద్దిసేపు జరిగిన సమావేశంలో నేతలు ఇద్దరు ఆత్మీయంగా పలకరించుకున్నారు.