Wednesday, September 25, 2024
HomeTrending Newsమంత్రి నియోజకవర్గంలో కుల బహిష్కరణ

మంత్రి నియోజకవర్గంలో కుల బహిష్కరణ

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు కావస్తున్న పల్లెల్లో ఇంకా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతూనే ఉంది.  దేశమంతా స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుకుంటుండగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం గాదెపల్లిలోని 5 కుటుంబాలు కుల, గ్రామ బహిష్కరణకు గురై గ్రామాన్ని వదిలిపెట్టి వేరే చోట తలదాచుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రెండు నెలలు గడస్తున్న పోలీసులకు ఈ విషయమై పిర్యాదులు వెళ్లిన పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం ఆగ్రామానికి వెళ్లి విచారణ జరుపలేదనే ఆరోపణలు వస్తున్నాయి.  గాదెపెల్లి గ్రామానికి చెందిన కొంతమంది కలిసి హార్వెస్టర్ తీసుకోగా దానికి సంబంధించిన లేవాదేవిల విషయంలో వారి మద్య వివాదం తలెత్తింది. వివాదంలో పెద్దమనుషులు ఏకపక్షంగా పంచాయితీ నిర్వహించగా దాన్ని అంగీకరించకపోవడంతో పెద్ద మనుషులు తండ్రి కుటుంబంతో పాటు 4 గురు కుమారుల కుటుంబాలపై కుల, గ్రామ బహిష్కరణ చేసిన ఉదంతం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం గాదెపల్లిలో చోటుచేసుకుంది. మాకు న్యాయం చేసి గ్రామ, కుల బహిష్కరణ విధించిన వ్యక్తులపై చర్యలు తీసుకుని రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అయినా జీవించే హక్కును పరిరక్షించాలని మానవహక్కుల కమిషన్ చైర్మన్, జగిత్యాల జిల్లా ఎస్పీ కి బాధితులు వెలుగు సాయన్న, వెలుగు శేఖర్ లు 3 రోజుల క్రితం పిర్యాదు చేశారు.


బాధితుల కథనం ప్రకారం ఒ వివాదం విషయంలో ఇరువర్గాలకు పంచాయతీ జరుగగా తనకు వ్యతిరేకంగా నిర్వహించిన పంచాయితీని అంగీకరించకపోవడంతో పెద్ద మనుషులు రెండు నెలల క్రితం (జూన్ 15 )తన కుటుంబంతో పాటు నలుగురు కొడుకుల కుటుంబాలను కుల బహిష్కరణ చేశారని వెలుగు సాయన్న  ఆవేదన వ్యక్తం చేశారు.  వెలుగు సాయన్న, వెలుగు శేఖర్, వెలుగు గంగాధర్, వెలుగు సంతోష్, వెలుగు నరేష్ అనే 5 కుటుంబాలను కులబహిష్కరణ విధించి తమ సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరూ మాట్లాడిన 10 వేల జరిమానా విధించారని సాయన్న, శేఖర్ లు తెలిపారు.
ఈ విషయమై ధర్మపురి పోలీసులకు పిర్యాదు చేయగా కక్ష గట్టిన పెద్దమనుషులు ఏకంగా జూన్ 28 న మాకుటుంబాలకు గ్రామబహిష్కరణ చేశారని దాంతో గాదెపల్లిలో తమ సామజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎవరూ మాట్లాడడం లేదన్నారు.
తమకు ఎవరూ వ్యవసాయ పనులకు రావడం లేదని, మమ్ములను పిలువడంలేదని , కిరాణాసరుకులు ఇవ్వడంలేదని,మా పశువులను మందలోకి తోలడలేదని, మాతో గ్రామంలో ఎవరూ మాట్లాడడంలేదని దాంతో మళ్ళీ ధర్మపురి సీఐ, ఎస్సై లకు పిర్యాదు చేయగా జులై 23 న గాదెపల్లికి వచ్చిన పోలీసులు విచారణ చేసినప్పటికీ వారిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు వెలుగు సాయన్న, వెలుగు శేఖర్ లు వాపోయారు.

ప్రస్తుతం మేము మా గ్రామానికి వెళ్లలేక జగిత్యాలలోనే తలదాచుకుంటున్నామని బాధితులు తెలిపారు. ఆ వ్యక్తులు గతంలోనూ తమపై రెండు, మూడు సార్లు దాడి చేశారని అట్టి వ్యక్తులపై పోలీసులకు పిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిర్యాదులో వివరించారు. ఈ విషయంలో న్యాయం చేయాలని పెద్ద మనుషులు విధించిన కుల, గ్రామ బహిష్కరణ ఎత్తివేసి, కుల, గ్రామ బహిష్కరణ విధించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్, జగిత్యాల జిల్లా ఎస్పీ లను బాధితులు వెలుగు సాయన్న, వెలుగు శేఖర్ లు వేడుకుంటున్నారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిద్యం వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గంలోనే కులబహిష్కరణ వివాదం చోటు చేసుకోవటం గమనార్హం. ధర్మపురి మండలం గాదేపల్లిలో జరిగిన ఘటనపై పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

Also Read: వరి నాట్ల సంబరాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్