Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంగాడిదా! ఓ గాడిదా!

గాడిదా! ఓ గాడిదా!

గాడిద అంటే మామూలు గాడిద. మరీ అడ్డదిడ్డంగా , ప్రతి పనికీ అడ్డంగా ఉంటే అడ్డ గాడిద.
ఒంటి మీద గీతలు ఉంటే కంచెర గాడిద.
భరించలేని చాకిరీ అయితే గాడిద చాకిరి.
కర్ణకఠోర గానం గార్దభ స్వరం.
గాడిదకేమి తెలుసు గంధపు చెక్కల వాసన?
గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే; ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందట.
గతిలేక గాడిదకాళ్లు పట్టుకున్నట్లు.
గుర్రం గుర్రమే- గాడిద గాడిదే.
కూసే గాడిద వచ్చి, మేసే గాడిదను చెరిచిందట.

తెలుగు భాషలో అడుగడుగునా గాడిదలు వస్తూనే ఉంటాయి. గాడిద అన్న మాట తిట్టుగా నిందార్థంలోకి మారడం నిజంగా గాడిదలు చేసుకున్న పాపం. అకారణంగా తమను ఆడిపోసుకుంటున్నారని అంతర్జాతీయ గార్దభ సమ్మేళనం నర గార్దభాలకు ఏనాడో వినతి పత్రం ఇచ్చుకున్నా మార్పు లేదు.

ఎడారుల్లో, కొండా కోనల్లో, పల్లెల్లో మొన్నటివరకు గాడిదలు మానవజాతి బరువును మోశాయి. ఇప్పటికీ ఆ గాడిద చాకిరీ కొనసాగుతూనే ఉంది. భగవంతుడు గుర్రాన్ని సకిలించమని, గాడిదను గాండ్రించమని సృష్టి చేసినప్పుడే షరతు పెట్టి అందుకు అనుగుణంగా వాటి స్వర తంత్రులను బిగించి పెట్టాడు. గాడిదలే మూర్ఛపోయేలా ఎందరో పాడుతున్నా…గార్దభ స్వరం అని తమ గొంతును కించపరచడం మీద కూడా అంతర్జాతీయ గార్దభ సమాఖ్య ఐక్యరాజ్యసమితికి ఏనాడో చెప్పింది.

వసుదేవుడు అంటే సాక్షాత్తు దేవదేవుడు, జగద్గురువు శ్రీకృష్ణుడి తండ్రి. అలాంటి వసుదేవుడు పట్టుకున్న కాళ్లు గాడిదలవి. 84 లక్షల జీవరాశుల్లో గాడిద కాళ్లు తప్ప ఇంకే ప్రాణి కాళ్లు పట్టుకుని దేవతలు ప్రాధేయపడినట్లు ఆధారాల్లేవు. లోకంలో ఎవరెవరో అడ్డగాడిదల కాళ్లు పట్టుకోవడంతో పోలిస్తే- అసలు గాడిదల కాళ్లు పట్టుకోవడంలో అవమానపడాల్సిందేమీ లేదు. ప్రతి ప్రాణి బ్రహ్మమయమే అయినప్పుడు…గాడిదలో కూడా తప్పనిసరిగా దైవాన్ని దర్శించాలి.

ఈమధ్య హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు పక్కన, కోకాపేట గుట్టల్లో రెండు తెలుగు రాష్ట్రాల గాడిద సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక అత్యవసర సమావేశం జరిగింది. కోకాపేటను సమావేశ స్థలిగా ఎంచుకోవడం ద్వారా గాడిదలు సమాజానికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వగలిగాయి. ఈ భూ ప్రపంచంలోనే అత్యంత విలువయిన భూముల్లో తాము కూడా మీటింగులు పెట్టుకోగలం అన్నది ఇందులో సందేశం.

మీటింగ్ కు ముందు మీడియాను ఆహ్వానించినా…గుర్రాన్ని- గాడిదను ఒకే గాట కట్టేసే మీడియా లేకపోతేనే సమావేశం సజావుగా జరుగుతుందన్న ఎరుకతో చివరి నిమిషంలో మీడియాకు అనుమతి లేదని మర్యాదగా చెప్పాయి. అయినా కొన్ని కెమెరాలు రహస్యంగా వెళ్లాయి. గాడిదలు గమనించి వెనుక కాళ్లతో తన్నడం వల్ల కెమెరాల కళ్లు పగిలాయి. లోకంలో ఎన్నెన్నో గాడిద సమ్మేళనాల వార్తలను రహస్యంగా రికార్డు చేసిన మీడియా అనుభవం వృథా పోలేదు. గాడిదలు ఈ విషయాన్ని పసిగట్టినా…ఎంతో కొంత కవరేజి రావాలి కాబట్టి…చూసినా…చూడనట్లు నటించాయి.

రెం. తె. రా. గా. సం. ఐ. కా. వే. అంటే రెండు తెలుగు రాష్ట్రాల గాడిద సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక చర్చల సారాంశమిది:-

భాషా భేదం
భూమ్మీద గాడిద అంటే గాడిదే కావాలి. ఇంగ్లీషు గాడిద, తెలుగు గాడిద, హిందీ గాడిద అని భాషా భేదం పాటించడాన్ని రెంతెరాగాసంఐకావే తీవ్రంగా ఖండించింది. గాడిదల భాష తెలియని గాడిదలు ఏదేదో గాండ్రిస్తుంటే దాన్ని గాడిదలకు ఆపాదించి…గాడిదల మధ్య భాషా భేదాలు సృష్టించడానికి జరుగుతున్న ప్రయత్నాలను తిప్పి కొట్టాలని గా సం ఐ కా వే పిలుపునిచ్చింది.

గాడిద గౌరవం
ఊరూ పేరు లేని అనేక యూనివర్సిటీలు అనేక అడ్డ గాడిదలకు గౌరవ డాక్టరేట్లు ఇచ్చినప్పుడు…ఆ డాక్టరేట్లు తమకు చెందుతాయా? లేక మానవ జాతికి చెందుతాయా? అన్నది నిష్పాక్షికంగా నిగ్గు తేల్చి యావత్ గార్దభ జాతి గౌరవాన్ని కాపాడాలని గా సం ఐ కా వే డిమాండు చేసింది.

గాడిద ప్రథమా విభక్తి
ఓరీ
ఓయీ
ఓసీ
ఒరేయ్
ఒసేయ్
అన్నవి సంబోధన ప్రథమా విభక్తులైనప్పుడు…
గాడిదా!
అడ్డ గాడిదా!
నిలువు గాడిదా!
అని పిలిచినా…గార్దభ సంబోధన ప్రథమా విభక్తిగానే పరిగణిస్తూ…ఆ మేరకు డు ము వు ల విభక్తి సూత్రాలను పునర్నిర్వచించాలని లేదా పునర్లిఖించాలని గా సం ఐ కా వే వ్యాకరణ పండితులను అభ్యర్థించింది.

గాడిద పాల ప్రచారం
ఆవు పాలు
ఆవు నెయ్యి
ఆవు పేడ
ఆవు పంచకాలపై అనాదిగా అతిగా ప్రచారం జరగడం వల్ల ఎంతో ఆరోగ్యకరమయిన గాడిద పాలపై చిన్న చూపు ఏర్పడిందని గా సం ఐ కా వే నిట్టూర్చింది. రానున్న ఐదేళ్లలో గాడిద పాల ఉపయోగాలను విస్తృతంగా అన్ని భాషల్లో ప్రచారం చేయడానికి అంతర్జాతీయంగా పేరు ప్రతిష్ఠలున్న యాడ్ ఏజెన్సీని తక్షణమే నియమించుకోవాలని వేదిక తీర్మానించింది.

గాడిదల ఎన్నికల వ్యూహం
మనిషిగా గుర్తించని ఎవరో ఒకరు నిలబడే కొన్ని స్థానాల్లో రానున్న ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలని వేదిక నిర్ణయించింది.

గాడిదల ఆత్మ గౌరవం
ప్రతి అడ్డమయిన వారిని గాడిదా! గాడిదా! అని లోకులు సంబోధిస్తుండడంతో తమనే పిలుస్తున్నారేమోనని ప్రతిసారి బదులు పలకాల్సి వస్తోందని వేదిక విచారం వ్యక్తం చేసింది. తమ ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత గాడిదలకంటే గాడిద నామాన్ని పదే పదే స్మరిస్తున్నవారి మీదే ఎక్కువగా ఉంటుందని వేదిక అభిప్రాయపడింది.

గాడిదల సంతానానికి గుర్తింపు
కాకి పిల్ల కాకికి ముద్దు అయినప్పుడు…గాడిద పిల్ల గాడిదకు ముద్దు కాకుండా ఉండడానికి అవకాశమే లేదు. నిజానికి బుజ్జి గాడిద పిల్ల అందమే అందం. కానీ గాడిదల కొడుకులను మాత్రం నిందించి, గాడిద కూతుళ్లను నెత్తిన పెట్టుకోవడం మీద వేదికలో యువ కొడుకు గాడిదలు ప్రత్యేక నిరసన తీర్మానం ప్రవేశ పెట్టాయి. అయితే దీని మీద చర్చకు తగిన సమయం లేకపోవడంతో కొడుకులను వేదిక ఓదార్చింది. తదుపరి ఢిల్లీ సమావేశంలో కూలంకషంగా చర్చిద్దామని గా సం ఐ కా వే సమాధానపరిచింది

మానవ జాతికి కృతఙ్ఞతలు
సమావేశం చివర గాడిద సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక మానవ జాతికి కృతఙ్ఞతలు తెలిపే ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. కోకాపేట సభా ప్రాంగణమంతా గాడిదల గాండ్రింపులు, హర్ష ధ్వానాలతో మారు మోగింది. గాడిదల్లో మనుషులు ఉండకపోవచ్చు- కానీ మనుషుల్లో గాడిదలు ఉన్నందుకు, ఉండనిచ్చినందుకు, నోరారా గాడిద స్మరణ చేస్తున్నందుకు– యావత్ గార్దభ జాతి జన్మ జన్మాలకు మానవ జాతికి రుణ పడి ఉంటుందన్న కృతఙ్ఞతలు తెలిపే తీర్మానానికి వేదిక ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. గాడిదల సభ ముగిసింది.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read: పాన్ బహార్ ఏమన్నా పోషకాహారమా?

Also Read: హీరోను పొగడలేక మూగబోతున్న భాష

RELATED ARTICLES

Most Popular

న్యూస్