Monday, March 10, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅన్నమయ్య హృదయాన్ని ఆవిష్కరించిన గరిమెళ్ళ

అన్నమయ్య హృదయాన్ని ఆవిష్కరించిన గరిమెళ్ళ

అపర అన్నమయ్యగా పేరుతెచ్చుకున్న శాస్త్రీయ, లలిత, జానపద సంగీత విద్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్(1948-2025) గొప్పతనం తెలియాలంటే ముందు ఎలాంటి అన్నమయ్యను ఆయన మనముందు ఆవిష్కరించారో తెలియాలి. తరువాత అన్నమయ్య పదాలు పాడిన మిగతావారికంటే ఆయన ఎలా ప్రత్యేకమో తెలుసుకోవాలి.

తెలుగు భాషకు అన్నమయ్య చేసిన మహోపకారం గురించి రోజూ తలచుకోవాలి. సామాన్య జనం మాట్లాడుకునే మాండలిక భాషకు మంత్రస్థాయి కలిగించి, వాటిలో బీజాక్షరాలను బంధించి…వాటిని వెంకన్నకే ముప్పొద్దులా పద నైవేద్యంగా సమర్పించాడు అన్నమయ్య.

“నీవలన నాకు పుణ్యము;
నావలన నీకు కీరితి”
అని అన్నమయ్య సాక్షాత్తు వెంకన్నకే చెప్పుకున్నాడు. నిజమే వెంకన్న కీర్తి కిరీటంలో అన్నమయ్య కలికి తురాయి. ఇంకెన్ని యుగాలయినా వెంకన్నకు అన్నమయ్యలాంటి పి ఆర్ ఓ దొరకడు. ఇంకెన్ని యుగాలయినా రక్తమాంసాలతో మనిషిగా పుట్టినవాడెవడూ ఒక జీవితకాలంలో అన్నమయ్య సృష్టించినంత అంతులేని సాహిత్యామృతధార సృష్టించలేడు.

“శ్రుతులై శాస్త్రములై పురాణకథలై సుజ్ఞానసారంబులై
యతిలోకాగమ వీధులై విపుల మంత్రార్థంబులై నీతులై
కృతులై వేంకటశైల వల్లభు రతిక్రీడా రహస్యంబులై
నుతులై తాళులపాక అన్నయవచోనూత్న క్రియల్ చెన్నగున్”

అని అన్నమయ్య మనవడు చిన తిరుమలాచార్యులు చెప్పినట్లు ఒక్కో అన్నమయ్య కీర్తన ఒక్కో కావ్యంతో సమానం. వేదసారం. పురాణ కథ. సుజ్ఞానసారం. మంత్రార్థం. సామాన్యుల స్తోత్రాలు. భజనలు. మాటలకందని నూత్న పద చిత్రాలు.

తాళ్లపాక కవుల్లో అన్నమయ్యతో సమానమయిన కవులు చాలామందే ఉన్నారు. స్వయంగా అన్నమయ్య భార్య గొప్ప కవయిత్రి. పెద్ద కొడుకు పెద తిరుమలాచార్యులు, ఆయన కొడుకు అంటే అన్నమయ్య మనవడు చిన తిరుమలాచార్యులు అనన్యసామాన్యమయిన కవులు. వీరి కీర్తనలు కూడా అన్నమయ్య కీర్తనలుగానే లోకంలో ప్రచారంలో ఉన్నాయి. తాళ్ళపాక వంశం వారు తెలుగు ప్రపంచానికి ఇచ్చిన సాహిత్యంలో మనకు దొరికి…మిగిలింది ఆవగింజంత. తాళపత్ర గ్రంథాల్లో కాలగర్భంలో కలిసిపోయింది సముద్రమంత.

అన్నమయ్య 32 వేల కీర్తనలను ఆయన మనవడు రాగిరేకుల మీద రాయించి, భద్రపరిస్తే…వాటిలో 14,932 మాత్రమే కాలానికి దక్కాయి. దొంగలు దొంగిలించినవి కొన్ని. అవేమిటో తెలియక రాగిరేకులను కరిగించి సొమ్ము చేసుకున్నవి కొన్ని. పోయినవాటి గురించి ఏడ్చి లాభం లేదు.

ఉన్నవాటి గురించి లోకానికి తెలియడానికి మాత్రం దాదాపు 350 ఏళ్లు పట్టింది. తిరుమల గోపురం గూట్లో మూడున్నర శతాబ్దాల పాటు మట్టిలో మట్టిగా దుమ్ముకొట్టుకుపోయిన అన్నమయ్య కీర్తనలను వెలికి తీసి, పరిష్కరించి, అప్పటి తెలుగు లిపిని అర్థం చేసుకుని…ఇప్పటి తెలుగు లిపిలోకి వాటిని ఎత్తి రాసి, రాగాలను నిర్ణయించిన మహానుభావుల గురించి తెలుసుకోకపోతే చరిత్ర మనల్ను క్షమించదు.

ఇప్పుడు సా…పా…సా… అని అనగలిగిన ప్రతి గాయకుడూ అన్నమయ్యకు రాగాలు బోధించగలుగుతున్నారు. అక్షరాలు కలిపి చదవడం వచ్చిన ప్రతివారూ అంతర్యామి ఎందుకు అలసిపోయాడో? వివరించి చెప్పగలుగుతున్నారు.

అనేక భాషల్లో పండితుడు, సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు అన్నమయ్య సాహిత్యం మీద అనేక వ్యాసాలు రాశారు. అవి ఒక్కొక్కటి ఒక పరిశోధన గ్రంథంతో సమానం. వాటిలో ఒకచోట ఆయనన్న మాట:-  “ప్రబంధ కావ్యాలు, సంస్కృతం నుండి తెలుగులోకి అనువాదాలు, పద్యాలు రాజ్యమేలే రోజుల్లో, పద్యం తప్ప ఏదీ రచన కాదని రాజులు శాసించిన కాలంలో అన్నమయ్య జానపద శైలి పద కవితలను ఎందుకు పట్టుకున్నాడు? అన్నది లోతుగా ఆలోచించాల్సిన విషయం. పన్నెండో శతాబ్దంలో మరాఠీలో మొదలై తరువాత దేశమంతా విస్తరించిన భజన సంప్రదాయం సామాన్యజనానికి చేరువయ్యింది. విఠలా విఠలా! అన్న నామగానం దేశాన్ని ఊపేసింది. కన్నడలో దాస సాహిత్యం పురుడు పోసుకోవడానికి కూడా మరాఠీ భజనలే కారణం. దీన్ని గమనించిన అన్నమయ్య సామాన్యులకు అర్థమయ్యే భాషలో పద కవితలకు తెలుగులో శ్రీకారం చుట్టాడు. సకల వేద, పురాణ, మంత్ర సారాన్ని ఒక పల్లవి, మూడు చరణాల్లో పల్లెల్లో చదువులేనివారు మాట్లాడుకునే అత్యంత సహజమయిన, అందమయిన మాండలిక తెలుగులో చెప్పాడు. అందరిలా అన్నమయ్య కూడా పది పద్యకావ్య ప్రబంధాలు రాసి ఉంటే…తెలుగు జాతికి, తెలుగు భాషకు ఏమి మేలు జరిగి ఉండేదో కానీ…అలా కాకుండా జనం భాషలో పద కవితలు రాసి…పాడి…ప్రచారం చేయడం వల్ల తెలుగు భాషకు మహోపకారం జరిగింది. ఒక్క అన్నమయ్య వల్ల తెలుగు భాషకు పదివేల ఏళ్ల ఆయుస్సు పెరిగింది”.

అటకెక్కిన అన్నమయ్యను రాగిరేకుల మీదినుండి కిందికి దించి, బూజు దులిపి, అక్షరమక్షరం చదివి, సంగీత సాహిత్యాలకు భంగం కలుగకుండా ఎత్తి రాసి లోకానికి ప్రసాదించినవారిలో సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, వేటూరి ప్రభాకర శాస్త్రి, గౌరిపెద్ది రామసుబ్బ శర్మ అగ్రగణ్యులు.

రాగిరేకుల్లో ఉన్న అన్నమయ్య సాహిత్యాన్ని తప్పుల్లేకుండా ఎత్తి రాసి…మనకిచ్చిన వీరందరి కృషి కంటే వాటిని పాడి మనకు కర్ణామృతం చేసినవారి కృషి ఇంకా గొప్పది. అన్నమయ్య కీర్తనలనగానే గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గొంతే మన చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది.

అయిదు శతాబ్దాల క్రితం అన్నమయ్య ఎలా పాడాడో ఎవరికీ తెలియదు. తెలిసే అవకాశం కూడా లేదు. పదకవితలు, జానపద శైలి అనగానే ఎవరికి తోచినట్లు వారు పాడుకునే స్వేచ్ఛ ఉంటుంది. నిజానికి అన్నమయ్య కోరుకున్నది కూడా అదే. ఎవరికెలా కావాలంటే అలా పాడుకోవచ్చు. ఆయనది కొత్త దారి. తెలుగులో పదకవితలకు శ్రీకారం చుట్టి…అచ్చ తెలుగులో, మాండలికంలో ఇంతటి మాధుర్యం ఉంటుందా అని భాషాసరస్వతే మైమరచిపోయేలా చేసిన వాగ్గేయకారుడు; వేనవేల ఆధ్యాత్మిక, వేదాంత పారిభాషిక పదాలను, భావనలను కొత్తగా తెలుగులో పుట్టించి తెలుగుజాతికి ఆస్తిగా ఇచ్చినవాడు అన్నమయ్య. ఆ మాటల మాధుర్యం తెలియాలంటే గరిమెళ్ళ పాడిన అన్నమయ్య పదం వినాలి.

సాధారణ వచనంలో కర్త- కర్మ- క్రియ పదాలుంటాయి. సందర్భాన్ని బట్టి, ధ్వనిని బట్టి మనం ప్రశ్నిస్తున్నామో, కోప్పడుతున్నామో, తిడుతున్నామో తెలిసిపోతుంది. అలాగే కీర్తనల్లో కూడా ఒక ధ్వని ఉంటుంది. ఆనందమో, విషాదమో, అభ్యర్థనో, మైమరపో, ఏడుపో, నవ్వో, వ్యంగ్యమో ఏదో ఒకటి ఉంటుంది. ఒకానొక రాగంలో, తాళంలో స్వరాల సంగీతంలోకి కీర్తన సాహిత్యాన్ని కూర్చి తప్పుల్లేకుండా పాడవచ్చు. అది సంగీతం లెక్కప్రకారం సరైనదే కావచ్చు. కానీ అన్నమయ్యలాంటి భావప్రధానమైన సాహిత్యం లెక్కప్రకారం మాత్రం సరైనది కాదు. అలా సంగీతాన్ని దాటి సాహిత్యమే ప్రధానమైన అన్నమయ్య హృదయం అర్థం కావాలంటే గరిమెళ్ళ పాడిన అన్నమయ్య పదం వినాలి.

“నారాయణా! నీ నామమె గతి!” అని గరిమెళ్ళ గొంతెత్తగానే మన ముందు అన్నమయ్య పాట పాడుతుంటాడు.
“మునుల తపమునదే! మూల భూతియదె!” అని గరిమెళ్ళ పెదవి పలకగానే మునుల తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన వేంకటేశ్వరుడు మనముందు కూడా ఉంటాడు.
“దేవునికి, దేవికిని తెప్పల కొనేటమ్మా!” అని గరిమెళ్ళ పాడగానే మనం కోనేట్లో మునిగి తేలుతూ ఉంటాం.
“జగడపు చనవుల జాజర…” అని గరిమెళ్ళ జాజర పాట అందుకోగానే మనం దోసిట్లో పూలు తీసుకుని వెంకన్నకో, పద్మావతికో పరస్పరం చల్లుకోవడానికి పోటీలుపడి అందిస్తాం. “పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు…” అని గరిమెళ్ళ అనగానే పెళ్ళి పందిట్లో వెంకన్న- పద్మావతి దోసిళ్ళకు ముత్యాల తలంబ్రాలు అందించేవాళ్ళల్లో మనమూ ఉంటాం.
అలా మనల్ను వెంకన్న ముందు కూర్చోబెట్టడానికి అన్నమయ్య చేసిన చమత్కారం ఏమిటో తెలియాలంటే గరిమెళ్ళ పాడిన అన్నమయ్య పదం వినాలి.

ఒక్కొక్కరిది ఒక్కో శైలి. మిగతావారిని తక్కువ చేయాల్సిన పనిలేదు. కానీ...పండితుల సాహితీ చర్చలకే పరిమితమైన అన్నమయ్యను జనం బాట పట్టించి…సామాన్యుల నాలుకలమీద పాడుకునే పాటగా మలచిన కీర్తిలో మాత్రం గరిమెళ్ళగారిది సింహభాగం.

ఆయనతో నాకు వ్యక్తిగత పరిచయముంది. టీ టీ డి ధర్మప్రచార పరిషత్ కార్యదర్శిగా మా నాన్న పమిడికాల్వ చెంచు సుబ్బయ్య పనిచేసిన కాలంలో ఆ పరిచయం మరింత బలపడింది. ఎప్పుడు తిరుపతి వెళ్లినా భవానీ నగర్లో వారింటికి వెళ్ళి నమస్కారం పెట్టి…అన్నమయ్య సాహిత్యం మీద గంటలు గంటలు మాట్లాడేవాడిని. అన్నమయ్యమీద వ్యాసాలు రాస్తున్నప్పుడు ఏ సందేహం వచ్చినా వాట్సాప్ లో మెసేజ్ పెడితే ఆయనకు కుదిరినప్పుడు ఫోన్ చేసి వివరంగా చెప్పేవారు.

కొన్ని వందల, వేల కీర్తనలు ఆయన పాడారు. దాదాపు ఆరొందల అన్నమయ్య కీర్తనలను స్వరపరిచారు. ఆంజనేయస్వామిమీద పదులసంఖ్యలో స్వయంగా ఆయనే కీర్తనలు రాసి…స్వరపరచి…పాడారు. సామవేదం షణ్ముఖశర్మ గారి అనేక శివపదం కీర్తనలను స్వరపరచి…పాడారు. మోహన రాగం అంటే ఆయనకు అమిత ప్రేమ. మోహన రాగం ప్రత్యేకతమీద ఆయన రాసిన వ్యాఖ్యానం పుస్తకంగా అచ్చయ్యింది.

నేనెప్పుడు కలిసినా “ఎన్నడు విజ్ఞానమిక నాకు?”; “తానే తానే ఇందరి గురుడు…” అన్న అన్నమయ్య కీర్తనలను అడిగి పాడించుకునేవాడిని. కొత్తవి ఇన్ని పాడాను…ఆ రెండే వింటానంటే ఎలా? అని చనువుగా కోప్పడుతూ కనీసం పల్లవులైనా పాడి వినిపించేవారు. ఆ కీర్తనల్లో మాటలను అర్థస్ఫురణతో ఆయన పలికే, పాడే పద్ధతి విని అనుభవించాల్సిందే కానీ…మాటలతో చెబితే అర్థమయ్యేది కాదు. అందులో నాకు అర్థమైనదాన్ని, నా ఆనందాన్ని ఆయనతో పంచుకునేవాడిని. వెంటనే పక్కన డబ్బాల్లో రెడీగా పెట్టుకున్న గుప్పెడు జీడిపప్పు, ఎండు ద్రాక్ష చేతిలో పెట్టి తినమనేవారు. రిటర్న్ గిఫ్ట్ గా నాచేత పుట్టపర్తివారి శివతాండవంలో నాలుగు పద్యాలు పాడమనేవారు. రెండో పద్యానికి కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. కాసేపటికి తేరుకుని…”అంతయు తానే హరిపుండరీకాక్ష!” అని చేతులు జోడించి వెంకన్న ఉన్న వైపు ఒక నమస్కారం పెట్టేవారు.

ఎలాగైనా పాడుకొమ్మని జాతికి తన పదసంపదను అంకితం చేసి వెళ్ళిపోయాడు అన్నమయ్య.
అన్నమయ్య ఎలా పాడి ఉంటాడో అలాగే పాడి…జాతికి తన గళసంపదను అంకితం చేసి…వెళ్ళిపోయారు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్.

ఆయన మనమధ్య లేరు.
ఆయన పాట ఉంది.
అది అదిగో! అల్లదిగో! అని ప్రతిక్షణం మనకు ఏడుకొండలవాడిని పట్టి ఇస్తూనే ఉంటుంది.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్