పద్యం:-
అడవిపక్షుల కెవ్వడాహారమిచ్చెను?
మృగజాతి కెవ్వడు మేతబెట్టె?
వనచరాదులకు భోజన మెవ్వడిప్పించె?
జెట్ల కెవ్వడు నీళ్ళు చేదిపోసె?
స్త్రీల గర్భంబున శిశువు నెవ్వడు పెంచె?
ఫణుల కెవ్వడు పోసె బరగబాలు?
మధుపాళి కెవ్వడు మకరంద మొనరించె?
బసులకెవ్వ డొసంగె బచ్చిపూరి?
జీవకోట్లను బోషింప నీవెకాని
వేఱె యొక దాత లేడయ్య వెదకిచూడ!
భూషణవికాస | శ్రీధర్మ పురనివాస |
దుష్టసంహార | నరసింహ దురితదూర |
-నృసింహ శతకంలో కవి శేషప్ప
అర్థం:-
అడవిలో పక్షులకు ఆహారం ఎవరిస్తున్నారు?
జంతువులకు మేత ఎవరు పెడుతున్నారు?
అడవిలో ప్రాణులకు అన్నం ఎవరు పెడుతున్నారు?
చెట్లకు ఎవరు నీళ్లు చేది పోస్తున్నారు?
స్త్రీల గర్భంలో శిశువును ఎవరు పెంచుతున్నారు?
పాములకు ఆహారం ఎవరు పెడుతున్నారు?
తేనెటీగలకు మకరందాన్ని ఎవరు ఇస్తున్నారు?
పశువులకు పచ్చి గడ్డిని ఎవరు అందిస్తున్నారు?
ఎంత తరచి చూసినా…జీవకోట్లకు వేళకింత ఆహారం పెట్టి…పెంచి పోషించేవాడివి నీవు తప్ప…
వేరొక దాత లేడయ్యా! నరసింహస్వామీ!
సృష్టిలో తానొక్కడే గొప్పవాడని మనిషి విర్రవీగుతూ ఉంటాడు కానీ…ప్రతి ప్రాణికీ తన ఉనికిని తనకు తానే కాపాడుకునే విద్య అంతర్గతంగా ఉంటుంది. నిజానికి ఆహారాన్వేషణలో, కష్టాల్లో గట్టెక్కడంలో మనిషి కంటే మిగతా ప్రాణులే గొప్ప.
ఒక చీమ అతి చిన్న బెల్లం ముక్కను కష్టపడి ఇతర చీమల సహాయంతో మోసుకుపోతుంటే అటుగా వెళుతున్న నారదుడు చూసి…జాలి పడి…అర చేతిలోకి తీసుకుని…అయ్యో చీమా! ఎంత కష్టపడుతున్నావు? నేను వైకుంఠానికి వెళుతున్నాను. నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్లి…పునరావృతి రహిత శాశ్వత వైకుంఠ స్థానం ఇప్పిస్తాను…నాతో రా! అన్నాడు. నాతో పాటు ఒకసారి నా చీమల గూట్లోకి రండి స్వామీ! అని నారదుడిని చీమ తన ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ వందల చీమలు. అరలు అరలు. ప్రతి అరలో చెక్కర, బెల్లం ముక్కలు. ఏమిటిదంతా? అని అడిగాడు నారదుడు. వర్షాకాలం వస్తోంది కదా స్వామీ! నాలుగు నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసి పెట్టుకున్నాము. ఎండన పడి వచ్చారు…కొంచెం బెల్లం పానకం కలిపి ఇవ్వమంటారా! చల్లగా తాగి వెళుదురు కానీ…అని చీమ అతిథి మర్యాదతో అడిగింది.
నారాయణ! నారాయణ!
సృష్టిలో అతి చిన్న చీమక్కూడా ఆహార సేకరణ, ఆహార నిల్వ మీద ఇంతటి క్లారిటీ పెట్టావా స్వామీ! అని నారాయణుడిని మనసులో తలచుకుని… “జీవకోట్లను పోషింప నీవెకాని…
వేఱె ఒక దాత లేడయ్య వెదకిచూడ!” అన్న కవి శేషప్ప పద్యం పాడుకుంటూ…చీమకు థాంక్స్ చెప్పి…చీమ గూట్లో నుండి బయటపడ్డాడు.
చీమల సామ్రాజ్యం చిట్టిది కాదని నారదుడికి తెలుసు. మనకు తెలియాలనే ఒక సందర్భాన్ని సృష్టించుకుని ఉంటాడు.
సృష్టిలో అత్యంత అల్ప ప్రాణి అని చీమను అందరూ చులకనగా చూస్తుంటే దానికి ఒళ్లు మండి ఘోరమైన తపస్సు చేసింది. తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షం కాగానే ఏమి వరమడగాలో పదే పదే అనుకుంటూ ఉంది.
“నేను కుట్టగానే ప్రాణులు చనిపోవాలి… నేను కుట్టగానే ప్రాణులు చనిపోవాలి… నేను కుట్టగానే ప్రాణులు చనిపోవాలి…”
అనుకుంటూ ఉంది. ఈ వరమే ఫలిస్తే ముల్లోకాలు అల్లకల్లోలమవుతాయని దిక్పాలకులు వెళ్లి ఇంద్రుడికి మొర పెట్టుకున్నారు. ఇంద్రుడు వెళ్లి బ్రహ్మ దగ్గర నెత్తీ నోరు కొట్టుకుని బాధపడ్డాడు. బ్రహ్మ సరస్వతి వైపు చూసి నవ్వాడు. సరస్వతీ దేవి ఇంద్రుడికి అభయమిచ్చింది.
సరిగ్గా బ్రహ్మ ప్రత్యక్షమయ్యే వేళకు చీమ నాలుక మీద సరస్వతి నాట్యమాడింది.
“నేను కుట్టగానే చనిపోవాలి” అని అడిగింది చీమ. తథాస్తు అన్నాడు బ్రహ్మ. లోకాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఆనాటినుండి చీమ కుట్టగానే మనచేతిలో అది తపస్సుతో పొందిన వరం ప్రకారమే చచ్చిపోతోంది!
అలాంటి చీమ ఎంత? దాని కాళ్ళెంత? ఒక చీమ కాలు విరిగితే మిగతా చీమలు వెంటనే గూట్లోకి తీసుకెళ్లి సర్జరీ చేయడాన్ని మైక్రో కెమెరాల సాయంతో రికార్డ్ చేశారు. సర్జరీలు చేసే చీమల మీద జర్మనీలోని యూనివర్సిటీ అఫ్ ఉర్జ్ బర్గ్ లో శాస్త్రవేత్తలు చాలా కాలం పరిశోధనలు చేశారు. ఒక గుంపులో వరుసగా వెళుతున్న చీమ కాలును విరిచారు. వెంటనే గాయపడ్డ చీమను మిగతా చీమలన్నీ కలిసి దగ్గర్లో ఉన్న చీమల గూట్లోకి తీసుకెళ్లాయి. గాయపడ్డ చోట చీమలు లాలాజలాన్ని పూశాయి. అది మందు. లేదా మత్తు మందు. ఇన్ఫెక్షన్ శరీరంలో మిగతా భాగానికి సోకకుండా తెగిపోయినంతవరకు కొరికి కొరికి గాయపడ్డ భాగాన్ని వేరు చేశాయి. మళ్లీ లాలాజలం పూశాయి. పది నిముషాల్లో గాయపడ్డ చీమ తేరుకుని మళ్లీ తన కాళ్లమీద తాను నడవగలిగింది. గుమిగూడిన చీమలన్నీ మళ్లీ క్యూలో పనిలో పడ్డాయి.
మనిషి తరువాత సర్జరీలు చేసే రెండో ప్రాణి చీమేనని జర్మనీ శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.
అప్పుడు కట్ చేస్తే-
“చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవె భామ!
చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవె భామ!
జింగల్లొ జింగ టింగుల్లొ రంగ అనిపిస్త ఉంగ తీరుస్త బెంగ హైలెస్సా తస్సాదియ్యంగా…
చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ గారి వీలునామా ప్రేమ రెచ్చిపోర మామ!”
అని బ్యాగ్రవుండ్లో రాజమౌళి పాటకు కీరవాణి రాగంలో చీమలు చిందేసి పాడుకుంటూ ఉంటాయి!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు