ఘంటసాల ఒక చరిత్ర .. ఆయన గురించి కొన్ని మాటల్లోనో .. కొన్ని పేజీఏల్లోనో చెప్పుకోలేం. అప్పట్లో ఒక వైపున ఎన్టీఆర్ .. మరో వైపున ఏఎన్నార్ ఇద్దరూ కూడా ఎవరి సినిమాలతో వారు బిజీ. ఇద్దరి సినిమాలకి పాడుతూ ఘంటసాల మరింత బిజీ. పాట .. పద్యం ఏదైనా సరే ఘంటసాల వారు పాడవలసిందే అనే రోజులవి. ఘంటసాలవారికి సంగీత సాహిత్యాలపై మంచి పట్టు ఉండేది. సంగీతాన్ని ఒక తపస్సులా భావించి సాధనచేసినవారాయన. గ్రామీణ నేపథ్యంలో పెరగడం వలన, జానపదాలపై కూడా కావలసినంత పట్టు ఉండేది.
ఘంటసాల వారు ఎక్కువగా తెల్లని వస్త్రాలు ధరించి మల్లెపువ్వులా కనిపించేవారు. ఆయనది కల్లాకపటం లేని మనసు. ఆ స్వచ్ఛత ఆయన పాటల్లోను కనిపించేది .. వినిపించేది. తాను మహాగాయకుడినని ఆయన పొంగిపోయిన సందర్భాలు ఎక్కడా కనిపించవు. నిర్మలమైన నవ్వుతోనే ఆయన అందరినీ ఆకట్టుకునేవారు. వచ్చిన దానిలోనే సంతృప్తిని పొందేవారు. ఒకరిని గురించి మరొకరి దగ్గర మాట్లాడటం .. ఇతరులను చులకనగా చూడటం ఆయనకి తెలియదు. ఆయనకి తెలిసిందల్లా ఎదుటివారిని ప్రేమించడం .. గౌరవించడం అంతే.
అప్పట్లో సంగీతంపై మంచి పట్టు ఉన్న సంగీత దర్శకుల పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగుతూ ఉండేది. అయినా తాను కూడా ఒక వైపున పాడుతూ .. మరో వైపున సంగీత దర్శకుడిగా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. గాయకుడిగా .. సంగీత దర్శకుడిగా ఘంటసాల వారి స్థాయిలో విజయాలను అందుకున్నవారు మరొకరు కనిపించరు. తాను పడిన కష్టాలు .. ఆర్థికపరమైన ఇబ్బందులు మరొకరు పడకూడదనే ఉద్దేశంతో ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలను అందించిన సౌమ్యమూర్తి ఆయన.
ఘంటసాల వారు కూడా సొంత సినిమాలను నిర్మించి చేతులు కాల్చుకున్నారు. ఘంటసాలవారిలో మంచితనం ఎక్కువ. అందువలన ఆయనలో కావలసినంత మొహమాటం సహజంగానే ఉండేది. మొహమాటం ఉన్నవారు వ్యాపారాలు చేయకూడదని అంటారు. కానీ ఘంటసాల వారు నిర్మాణ రంగంలోకి దిగి ‘పరోపకారం’ .. ‘సొంతవూరు’ .. ‘భక్త రఘునాథ్’ వంటి సినిమాలను నిర్మించారు. ఆ సినిమాలు ఆయనను అప్పులపాలు చేశాయి. వాటిని తీర్చుకోవడానికి ఆయన ఆస్తులను అమ్ముకోవలసి వచ్చింది. తక్కువ మొత్తానికి డబ్బింగ్ సినిమాల్లో పాటలు పాడవలసి వచ్చింది. ఒక చిత్తూరు నాగయ్య .. ఒక సావిత్రి .. ఒక కాంతారావు .. ఒక ఘంటసాల .. వీరిలో ఎవరిని చూసినా, తమ మంచితనం .. అమాయకత్వం కారణంగా నష్టపోవడమే ఎక్కువగా కనిపిస్తుంది.
– పెద్దింటి గోపీకృష్ణ
Also Read :