ప్రభుత్వ రంగం చావడానికే పుట్టిందని బహింగంగా ప్రకటించిన పీఎం నరేంద్ర మోడీకి ప్రభుత్వ రంగ ఇలాఖా సింగరేణికి వచ్చే అర్హత లేదని సింగరేణి జేఏసీ చైర్మన్ ఎండి.మునీర్ అన్నారు. దేశంలో రైల్వే,బ్యాంకులు,ఇలా మొత్తంగా ప్రభుత్వ రంగాన్ని అమ్మేస్తూ,ఉద్యోగులకు,నిరుద్యోగులకు అన్యాయం తలపెడున్న పీఎం..దేశంలోని ప్రభుత్వ రంగానికి చెందాల్సిన 500 బొగ్గు బ్లాక్లను వేలం వేసే ప్రక్రియను ప్రారంభించారని విమర్శించారు. 11వ బొగ్గు గని కార్మికుల వేతన ఒప్పందం పై జేబీసీసీఐ లో కేవలం 3 శాతం మాత్రమే పెంచుతామంటున్నారని, సింగరేణి గుర్తించిన 10 వేల మిలియన్ టన్నుల నిక్షేపాల్లోని బ్లాక్లను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. మా బొగ్గు మాకు ఇవ్వాలి,విద్యుత్ ప్రైవేటి కరణను విరమించుకోవాలన్నారు. మరో 150 ఏండ్ల భవిష్యత్తు ఉన్న సింగరేణిని నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. వేలంలో పాల్గొంటేనే బొగ్గు బ్లాకులు ఇస్తారట…20 ఏండ్ల నుంచి లాభాల్లో నడుస్తున్న కోల్ ఇండియా,సింగరేణిని నిర్వీర్యం చేసే కుట్రలకు తెర లేపారని సింగరేణి జేఏసీ చైర్మన్ ఆరోపించారు. మోడీ గో బ్యాక్ అంటూ సింగరేణి వ్యాప్తంగా నల్ల జెండాలెగరేస్తామని ప్రకటించారు.
సింగరేణి కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటి డిమాండ్లు
• రామగుండం గడ్డమీద అడుగుపెట్టేముందు సింగరేణి బ్లాకులను వేలం వేయకుండా సింగరేణి సంస్థకే అప్పగించాలి
• విద్యుత్ సంస్కరణలను కేంద్రం వెంటనే ఉప సంహరించుకోవాలి
• వేజ్ బోర్డులో సింగరేణి కార్మికులకు సంబంధించిన నిర్ణయాలను త్వరగా తీసుకోవాలి
• 11 వ బొగ్గుగని కార్మికుల వేతన ఒప్పందం పై… జెబిసిసిఐ లో కేవలం 3 శాతం మాత్రమే పెంచుతామంటున్న అంశాన్ని పున: సమీక్షించుకోవాలి
• సింగరేణిలో 49 శాతంగా వున్న కేంద్ర ప్రభుత్వం వాటాను ప్రయివేట్ పరం చేయబోమని ప్రధాని స్పష్టం చేయాలి