Friday, March 29, 2024
HomeTrending Newsఖమ్మం జిల్లాలో గోద్రెజ్ వంటనూనె ప్లాంట్

ఖమ్మం జిల్లాలో గోద్రెజ్ వంటనూనె ప్లాంట్

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. గోద్రెజ్ ఆగ్రోవేట్ లిమిటెడ్ తెలంగాణ రాష్ట్రంలో 250 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ పెట్టుబడితో అంతర్జాతీయ స్థాయి వంటనూనె ప్రాసెసింగ్ ప్లాంట్ ని తెలంగాణలో ఏర్పాటు చేస్తామని గోద్రెజ్ ఆగ్రోవేట్ ప్రకటించింది. గోద్రెజ్ ఆగ్రోవేట్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో గోద్రెజ్ ప్రతినిధి బృందం పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు తో సమావేశమైంది. 30 TPH ( గంటకి 30 టన్నుల సామర్థ్యం)తోఏర్పాటుచేసే ఈ ప్లాంట్ ను తర్వాత 60 టిపిహెచ్ లకి పెంచుకునే అవకాశం ఉంటుందని, ఈ ప్లాంట్ ను ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయనున్నట్లు గోద్రెజ్ అగ్రోవెట్ తెలిపింది. ఈ ప్లాంట్ ద్వారా ఖమ్మం మరియు ఖమ్మం పరిసర ప్రాంతాల్లో సాగవుతున్న పామ్ ఆయిల్ పంట ఉత్పత్తులను ప్రాసెస్ చేసేందుకు వీలు కలుగుతుందని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాలసీలు అద్భుతంగా ఉన్నాయని తెలిపిన గోద్రెజ్ సంస్థ, తెలంగాణలో మరింతగా విస్తరించాలన్న ఆలోచనతో సంస్థ ఉన్నదని, ఈ మేరకు తమకు అనేక ప్రణాళికలు ఉన్నాయని ఈ సందర్భంగా బలరాం సింగ్ యాదవ్ మంత్రి కేటీ రామారావుకి తెలియజేశారు.

గోద్రెజ్ ఆగ్రోవేట్ కంపెనీ ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ 2025-26వ సంవత్సరంలో తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందని తెలిపారు. ఈ ఫ్యాక్టరీకి కావాల్సిన విద్యుత్ అవసరాల కోసం ప్రత్యేకంగా కో-జనరేషన్ ప్లాంట్ ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటు 10 గోద్రెజ్ సమాధాన్ సెంటర్ లను పామ్ ఆయిల్ రైతుల కోసం ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కంపెనీ ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 10 మండలాల్లో తమ కార్యకలాపాలున్నట్లు తెలిపింది. పామ్ ఆయిల్ సాగు చేస్తున్న రైతులకి అవసరమైన సలహాలు సూచనలను అందించేందుకు, సాటిలైట్ మరియు డ్రోన్ ట్రాకింగ్ లాంటి వినూత్నమైన టెక్నాలజీలు, మొబైల్ యాప్ లాంటి ఆధునాతన సౌకర్యాలను వినియోగించుకోనున్నట్లు తెలిపింది. తమ కంపెనీ నిర్వహించే పామ్ ఆయిల్ బిజినెస్ వలన ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలలో 250 మందికి నేరుగా మరో 500 మందికి పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు కంపెనీ మంత్రి కేటీ రామారావుకి తెలియజేసింది.

సాంప్రదాయక పంటలతో మాత్రమే కాకుండా వాణిజ్య పంటల సాగు వైపు రైతులను మళ్లించేందుకు, తెలంగాణలో సుమారు 20 లక్షల ఎకరాల్లో పామ్ ఆయిల్ సాగును చేయాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని కేటీఆర్ తెలిపారు. పామ్ ఆయిల్ సాగుతో వంటనూనెల దిగుమతిలో దేశం స్వావలంబన దిశగా ముందుకు పోయేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా రాష్ట్రంలో యెల్లో రెవల్యూషన్ (ఆయిల్ పంటల విప్లవం) సాధ్యమవుతుందని నమ్మకం తమకు ఉన్నదని కేటీఆర్ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్