Sunday, January 19, 2025
HomeTrending NewsRefugees: పాకిస్థాన్ కర్కశత్వం... ఆఫ్ఘన్ శరణార్థుల కడగళ్ళు

Refugees: పాకిస్థాన్ కర్కశత్వం… ఆఫ్ఘన్ శరణార్థుల కడగళ్ళు

పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘన్ శరణార్థుల తిరుగుముఖం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు మూడు లక్షల మంది అఫ్ఘన్లను స్వదేశానికి పంపారు. మరో లక్ష మందిని పంపించేందుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. పాకిస్తాన్ లో పూర్తి స్థాయి ప్రభుత్వం లేదు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఆపద్ధర్మ ప్రధానిగా బలూచిస్తాన్ అవామీ పార్టీ (BAP) నేత అన్వర్ ఉల్ హక్ కాకర్ ఉన్నారు. అఫ్ఘన్లను స్వదేశానికి పంపాలనే కీలక నిర్ణయం ఆపద్ధర్మ ప్రధాని చేయలేదు. ఈ నిర్ణయం వెనుక కీలకంగా పాక్ సైన్యం ఉండగా.. అందుకు పాకిస్తాన్ ముస్లిం లీగ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలు మద్దతు ఇచ్చాయనేది సుష్పష్టం. అంతర్జాతీయంగా అప్రతిష్ట రాకుండా…దేశ ప్రజల్లో వ్యతిరేకత, ముస్లిం దేశాలు, మానవ హక్కుల సంఘాల నిరసనల నుంచి తప్పించుకునేలా… ప్రజా ప్రభుత్వాలు చేయలేని పని ఆపద్ధర్మ ప్రభుత్వంతో చేయిస్తున్నారు.

అక్రమ వలసదారులు అక్టోబరు 3న దేశం విడిచి వెళ్లాలని, నవంబర్ 1 తర్వాత ఉన్నవారిని జైల్లో వేస్తామని ప్రకటించగానే పాక్, ఆఫ్ఘన్ దేశాల్లో సంచలనం రేపింది. 1980లలో రష్యాతో యుద్ధం సమయంలో మొదలైన వలసలు 2021లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక అధికం అయింది.

పాకిస్తాన్లో సుమారు 40 లక్షల మంది విదేశీయులు ఉన్నారని అందులో 30 లక్షల 80 వేల మంది ఆఫ్ఘన్ ప్రజలే అని ప్రభుత్వ లెక్కలలో తేలింది. ఇందులో 20 లక్షల అఫ్ఘన్లకు పాక్ అధికారిక పత్రాలు ఉన్నాయి. దేశంలో ఒక ఏడాదిలో 24 ఆత్మాహుతి దాడులు జరగగా 14 ఘటనలలో ఆఫ్ఘన్ జాతీయులే ఉన్నారని అంతరంగిక శాఖ మంత్రి సర్ఫరాజ్ బుగ్తి వెల్లడించారు. ఈ దాడుల్లో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఉందనేది బహిరంగ రహస్యం.

2007లో స్థాపించిన TTP పాకిస్తాన్ దేశాన్ని ఇస్లామీకరణ చేయటమే లక్ష్యమని ప్రకటించుకుంది. అయితే దీని కార్యాచరణ భిన్నంగా ఉంది. ఇస్లాం మత సూత్రాలు సరళతరంగా ఉండే పంజాబ్ రాష్ట్రంలో కన్నా బెలూచిస్తాన్, ఖైభర్ పఖ్తుంఖ్వ రాష్ట్రాల్లో దాడులు చేయటం గమనార్హం. దాడులన్నీ పాక్ సైన్యం టార్గెట్ గా జరిగాయి. పాక్ పగ్గాల్ని చేపట్టేందుకు ఈ సంస్థ యత్నిస్తోందని సైన్యం, ప్రభుత్వ వర్గాలకు సమాచారం రావటంతో అప్రమత్తమయ్యారు.

ఇది ఇలా ఉండగా 40 ఏళ్ళుగా ఉంటున్న తమను తిప్పి పంపటం శోచనీయమని ఆఫ్ఘన్ శరణార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇక్కడే పుట్టి పెళ్ళిళ్ళు చేసుకొని చిన్న చితక పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆఫ్ఘన్ గురించి వినటమే కానీ అక్కడికి వెళ్ళింది లేదు. చూసింది లేదు.

చలికాలం సమీపిస్తున్న వేళ అక్రమవలసదారులను పంపటం విమర్శలకు దారితీస్తోంది. ఆఫ్ఘన్లో మైనస్ 20 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. అక్కడ ఉండటానికి గూడు లేదని, ఉపాధి లేదని..చంటి పిల్లలను తీసుకొని వెళ్లి ఎక్కడ ఉండాలో తెలియటం లేదని బాధపడుతున్నారు. ఇక అమ్మాయిల పరిస్థితి దీనంగా ఉంది. ఆఫ్ఘన్ వెళితే తమ చదువులు ఆగిపోతాయని, ఉపాధి అవకాశాలు కోల్పోతామని కన్నీరుమున్నీరు అవుతున్నారు.

మరోవైపు శరణార్థుల శిబిరాల్ని పాక్ అధికార వర్గాలు బుల్దోజర్లతో కూల్చేసి చదును చేశాయి. దీంతో ఆఫ్ఘన్ వెళ్ళటం.. లేదంటే పాక్ జైలుకు అన్న దురవస్థ దాపురించింది. వారం రోజుల నుంచి సింద్, బెలూచిస్తాన్, ఖైభర్ పఖ్తుంఖ్వ రాష్ట్రాల్లో జైళ్ళు అఫ్ఘన్లతో నిండిపోతున్నాయి. యుఎన్ మానవ హక్కుల సంఘం జారీ చేసిన పత్రాలు ఉన్న వారిని సైతం జైల్లో వేస్తున్నారని ఆమ్నెస్టీ ఇంటర్ నేషనల్ ఆందోళన వ్యక్తం చేసింది. జైల్లో ఉన్న వారికి న్యాయవాదిని, కుటుంబ సభ్యులను కలుసుకోనివ్వటం లేదని పాక్ ప్రభుత్వ తీరును అమ్నెస్టీ దుయ్యబట్టింది.

అంతర్జాతీయంగా పాలస్తీనాకు మద్దతుగా మాట్లాడుతున్న దేశాలు, సంస్థలు ఈ విషయం విస్మరించాయి. శరణార్ధులపట్ల సానుబూతి చూపాలని ఐక్యరాజ్య సమితి మొక్కుబడి ప్రకటన చేసి చేతులు దులుపుకుంది. అదే పాలస్తీనా వ్యవహారంలో యుఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటేరాస్ నిత్యం ఎదో ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అమెరికా, నాటో దేశాలు తమకు సంబంధం లేదన్నట్టు ఉన్నాయి. ఆఫ్ఘన్ల పట్ల పాకిస్తాన్ పాలకుల కర్కశత్వాన్ని ప్రశ్నించటం లేదు.

పాక్ వైఖరిపై ఆగ్రహంగా ఉన్న తాలిబన్లు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇరుగు పొరుగు వాళ్ళం..భవిష్యత్తు పరిణామాలు అలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ ప్రధాని ముల్లా మహమ్మద్ హస్సన్ అఖుండ్ పాక్ పాలకులకు హితవు పలికారు. శరణార్థుల సమస్య రెండు దేశాల మధ్య అఘాతం పెంచుతోంది. రాబోయే రోజుల్లో పాక్ లో ఉగ్ర దాడులు తీవ్రం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్