అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో విషాదం చోటుచేసుకున్నది. భారత సంతతికి చెందిన యువకుడు శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రసిద్ధ గోల్డెన్ గేట్ బ్రిడ్జి పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వంతెనపై అతని సైకిల్, ఫోన్, బ్యాగ్ లభ్యమయ్యాయని అమెరికా కోస్టల్ గార్డ్స్ అధికారులు తెలిపారు. పన్నెండో తరగతి చదువుతున్న 16 ఏండ్ల ఇండియన్ అమెరికన్.. బుధవారం సాయంత్రం 4.58 గంటల సమయంలో బ్రిడ్జిపై నుంచి దూకాడని చెప్పారు. వెంటనే తాము గాలింపు చేపట్టామని వెల్లడించారు.
గోల్డెన్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ భారతీయ అమెరికన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఇది నాలుగోసారని ఎన్నారై అజయ్ జైన్ భూటోరియా తెలిపారు. కాగా, 1937లో ప్రారంభమైన ఈ బ్రిడ్జిపై నుంచి ఇప్పటివరరు 2 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో గతేడాది 25 మంది ఉన్నారు. అయితే తరచూ ఇక్కడ ఆత్మహత్య కేసులు నమోదవుతుండటంతో వంతెనకు ఇరువైపులా 20 అడుగుల వెడల్పుతో ఇనుప మెష్‌ను నిర్మిస్తున్నది.