శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష దేశం విడిచి పారిపోయారు. భార్య, ఇద్దరు అంగరక్షకులతో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు పారిపోయినట్టు వైమానిక దళ మీడియా డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. కొలంబోలోని కటునాయకే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ తదితర అన్ని నిబంధనలు పూర్తి చేసుకున్నాకే అనుమతించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రోజు ( బుధవారం) వేకువ జామున మాల్దీవులు చేరుకున్నట్టు వెల్లడించారు. అధ్యక్షుడు గోటబాయ రాజపక్స దేశం విడిచి వెళ్లినట్టు, మాల్దీవులలోని వెలాన అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నది వాస్తవేమేనని శ్రీలంక ప్రధానమంత్రి కార్యాలయం ద్రువీకరించింది.
తాత్కాలిక దేశాధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె ఈ రోజు బాధ్యతలు చేపడతారు. ఈ నెల 20వ తేదీలోగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. 19వ తేదిన అధ్యక్ష పదవి కోసం నామినేషన్లు స్వీకరించి..20 న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మరోవైపు తనకు రాజపక్స రాజీనామా పత్రం అందలేదని శ్రీలంక పార్లమెంటు స్పీకర్ మహింద యాప అభివర్దనే ప్రకటించారు. రాజపక్స మాల్దీవులు చేరుకున్నా ఇప్పటివరకు రాజీనామా లేఖ తనకు అందలేదని స్పీకర్ స్పష్టం చేశారు.
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఇటీవల తీవ్ర ప్రజాగ్రహాన్ని చవిచూసిన గొటబాయ అధ్యక్ష భవనం నుంచి పరారయ్యారు. అధ్యక్ష పదవి నుంచి నేడు వైదొలగుతానని పార్లమెంటు స్పీకర్, ప్రధాని విక్రమసింఘేకు ఆయన ఇది వరకే తెలిపారు. శ్రీలంక ఆర్ధిక శాఖ మంత్రి, గొటబయ సోదరుడైన బాసిల్ రాజపక్స కూడా దేశం విడిచి పారిపోయారు. గొటబయ దేశం విడిచి పారిపోయేందుకు భారత్ సహకరించిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని శ్రీలంకలోని భారత హైకమిషన్ అధికారులు స్పష్టం చేశారు. అవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేశారు.