Its not fair: ఉద్యోగ సంఘాల నేతలు నేడు కూడా చర్చలకు రాకపోవడం దురదృష్టకరమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. చర్చలు తప్ప మరో మార్గం ఏదైనా ఉందా అని అయన ప్రశ్నించారు. ఇప్పుడైనా, రేడు సమ్మె మొదలైన తర్వాతైనా ప్రభుత్వంతో చర్చల ద్వారానే ఉద్యోగుల సమస్యకు పరిష్కారం లభిస్తుందని, వేరే మార్గం లేదని తేల్చి చెప్పారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నానిలతో కలిసి సజ్జల మీడియాతో మాట్లాడారు.
నేడు కూడా ఉద్యోగుల కోసం తాము ఎదురు చూశామని, కొందరు ఉద్యోగ సంఘాల ముఖ్య నేతలతో ఫోన్ లో కూడా మాట్లాడామని, మాకు ఉద్యోగుల నుంచి ఒత్తిడి ఉందని చెబుతున్నారని, వారికున్న అపోహలు తీర్చడానికైనా చర్చలే శరణ్యమని సజ్జల అభిప్రాయపడ్డారు. నేతలు ఎక్కడో కూర్చొని డిమాండ్లు పెడుతుంటే సమస్య పరిష్కారం కాదని, చర్చిస్తేనే ఒక సానుకూల వాతావరణం వస్తుందని చెప్పారు. జీతాల బిల్లులు తయారు చేయకపోవడం క్రమశిక్షణా రాహిత్యం కిందకు వస్తుందని, అది నేరమని సజ్జల అన్నారు. తాము ప్రతిరోజూ మధ్యాహ్నం నుంచి తాము చర్చలకు సిద్ధంగా ఉంటామన్నారు. స్టీరింగ్ కమిటీ తో పాటు ఉద్యోగ సంఘాలకు చెందిన వారు ఎవరు వచ్చినా వారితో చర్చించేందుకు, వారి సందేహాలను నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులు ఇలా మొండిగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. మీడియాలో వచ్చిన వార్తలు, కథనాల ఆధారంగా ఉద్యోగ సంఘాల నేతలు అపోహలకు వెళ్ళడం సరికాదన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించి, వ్యవస్థను వ్యతిరేకం చేసుకోవద్దని సలహా ఇచ్చారు.
ఉద్యోగ సంఘాల నేతలు మీడియాలోనో, టివిల్లోనో మాట్లాడే బదులు నేరుగా ప్రభుత్వంతో చర్చలకు వచ్చి చెబితే బాగుంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. మొన్న సమావేశమైనప్పుడు ఉద్యోగులు పెట్టిన డిమాండ్లపై నేడు కూర్చుని మాట్లాడుకుందామని అనుకున్నామని, కానీ నేడు వారు చర్చలకు రాకపోవడం సరికాదని బొత్స వ్యాఖ్యానించారు.
Also Read : చర్చలకు రాలేము: ఉద్యోగ సంఘాలు