Emergency Issue:
ఆడుతూ ఒకరు.
పాడుతూ ఒకరు.
పని చేస్తూ ఒకరు.
పెళ్ళి చేస్తూ ఒకరు.
కసరత్తు చేస్తూ ఒకరు.
అసలేమీ చేయకుండా నిలుచున్న పాటున ఒకరు.
ఏ మాయరోగమో తెలియదు.
ఉన్నట్టుండి గుండె ఆగిపోతోంది.
నవ్వుతూ తుళ్లతూ వున్నవాళ్లు కుప్ప కూలిపోతున్నారు.
మొన్నటి వరకు యాభైలకి, నలభైలకి గుండెపోటేంటని ఆశ్చర్యపోయాం.
ఇప్పుడు పద్ధెనిమిది, ఎనిమిది ఏళ్ళపిల్లల గుండె కూడా ఆగిపోతోంది.
మొదట్లో అతిగా వ్యాయామం అన్నారు
తర్వాత కొలెస్ట్రాల్ అన్నారు.
కోవిడ్ అన్నారు.
దానికి తీసుకునే మందులన్నారు.
అదే జబ్బుకి సంబంధించిన వ్యాక్సీన్ కూడా కారణమే అంటున్నారు.
ఎవరంటున్నారు?
ఎవరు బడితే వాళ్ళంటున్నారు.
ఏ నలుగురు కలిసికూర్చున్నా దీని గురించే మాట్లాడుతున్నారు.
ఏ టీవీ చూసినా ఎవరో ఒక డాక్టర్ తనకు తోచిన అభిప్రాయం చెప్తున్నాడు.
కొన్ని చానెళ్ళు ఇంకాస్త ఉత్సాహం చూపిస్తున్నాయి.
ఆయుర్వేదం, హోమియో, అలోపతి డాక్టర్ల మధ్య దీన్నో వివాదంగా కూడా మారుస్తున్నాయి.
మధ్యలో అసలేవీ చదవకుండా.. ఉప్పు మానేస్తే చాలు, పప్పు తీసేస్తే చాలు..
మీ గుండె సేఫ్ అని చెప్పే తింగరి డైటీషియన్లకు లోటేం లేదు.
కొబ్బరి నూనె, కొరివి కారం అంటూ వికృత సలహాల ప్రకృతి చికిత్సల బిజినెస్ మరో వైపు.
ఒక యూట్యూబ్ అకౌంట్ వుంటే చాలు..ప్రతి వాడు స్వయంప్రకటిత డాక్టరే.
ఇంతకీ అసలు ప్రభుత్వాలేం చేస్తున్నాయి?
ఇందులో ప్రభుత్వాలు చేసేదేముంటుదని చాలా మందికి డౌట్.
నిజానికి ప్రభుత్వాలు కూడా ఇదే అనుకుంటున్నాయోమే..
జనాలు గుండాగి చనిపోతుంటే మధ్యలో ప్రభుత్వాలేం చేస్తాయని..
కానీ, ప్రభుత్వాలకి బాధ్యత వుంటే దీన్నో హెల్త్ ఎమెర్జన్సీగా చూడాలి.
ఇప్పటి దాకా చనిపోయిన వాళ్ళ హెల్త్ రికార్డులు తీయాలి.
వాళ్ల హెల్త్ హిస్టరీ మీద అధ్యయనం జరగాలి.
నిజంగా కోవిడ్, దానికి వాడిన మందులు, అది రాకుండా వేసుకున్న వ్యాక్సిన్లు అన్నిటినీ బేరీజు వేయాలి.
ఈ చనిపోయిన వాళ్లలో కామన్ కారణాలు ఏమైనా వున్నాయేమో పరిశోధన జరగాలి.
కనీసం ఇకపై ఇలాంటి దారుణాలు జరిగినప్పుడైనా ..
ప్రభుత్వ యంత్రాంగాలు యుధ్ద ప్రాతిపదికన రంగంలోకి దిగాలి.
ఆ వ్యక్తికి గతంలో కోవిడ్ వచ్చిందా?
ఏ ఫేజ్ లో వచ్చింది?
ఏ వ్యాక్సిన్ వేసుకున్నాడు?
ఏ మందులు వాడాడు?
ఇలాంటి రికార్డులన్నీ పరిశీలించాలి.
ఒక వేళ ఇలా మరణించిన వ్యక్తుల మధ్య ఏదైనా సారూప్యం వుంటే.,
అలాంటి మందులు,వ్యాక్సిన్, స్టెరాయిడ్లు వాడిన వాళ్ళందరినీ హెచ్చరించాలి.
లేదా, నివారణ మార్గాలు ఏమైనా సాధ్యమేమో పరిశీలించాలి.
ఇదంతా ప్రభుత్వ ఆధ్వర్యంలో శాస్త్రీయంగా జరగాల్సిన అధ్యయనం.
దీనిమీద ఎవరికి తోచిన అభిప్రాయాలతో వాళ్ళు విషయాన్ని మరింత గందరగోళ పరచకుండా నివారించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే.
ఒక వేళ కోవిడ్, దాని మందులు, వ్యాక్సిన్ తో ఈ గుండెపోట్లకి సంబంధం లేకపోతే, ఆవిషయాన్నైనా ఖచ్చితంగా ప్రభుత్వాలు చెప్పాలి.
ఈ డాక్టర్ల అభిప్రాయాలు, టీవీల్లో చర్చల వల్ల ఇప్పటికే మందులు , స్టెరాయిడ్లు వాడిన వాళ్ళంతా దిగులు పెట్టుకుని లేని బిపిలు పెంచుకుంటున్నారు.
ఏది ఏమైనా .. అప్పటిదాకా పూర్తి ఆరోగ్యంగా వున్నవాళ్ళు ఇలా రోజుకి ఇద్దరో ముగ్గురో రాలిపోవడం, అంత తేలికగా తీసుకోవాల్సిన విషయమైతే కాదు.
ప్రభుత్వాలు వీటిని ఎందుకు అసలు పట్టించుకోవడం లేదో అర్థం కాదు.
కె. శివప్రసాద్
Also Read :