Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకార్ల అంత్యక్రియల కొత్త పరిశ్రమ

కార్ల అంత్యక్రియల కొత్త పరిశ్రమ

Car- Re’Cycle’: మనిషి చనిపోతే అంత్యక్రియలు తప్పనిసరి. మరి- వాహనాలు పనికిరాకుండా మూలన పడి…పాడైపోయి… రిపేరులు చేయడానికి ఏమాత్రం వీలుకాక…చనిపోతే అంత్యక్రియలు చేయాలా? వద్దా? అన్నది భారత ఆటోమొబైల్ పరిశ్రమ ప్రశ్న. తప్పనిసరిగా వాహనాలక్కూడా అంత్యక్రియలు చేయాల్సిందేనని ఇన్నాళ్లకు భారత ప్రభుత్వం అంగీకరించింది. దీనికి సంబంధించి ఆటోమొబైల్ స్క్రాపింగ్ పాలసీ (దీనిని అచ్చ తెలుగులో తుక్కు తుక్కుగా నలగ్గొట్టడం లేదా పచ్చడి చేయడానికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన అందురు) తయారై…ఈమధ్యే అమల్లోకి వచ్చింది.

ఒక కారు తయారు కావడానికి ఒకప్పుడు కొన్ని రోజులు పట్టేది. ఇప్పుడు అంతా ఆటోమేటిక్ యంత్రాలే కాబట్టి పరిశ్రమలో ఒక కారు తయారు కావడానికి 35 గంటలు చాలు. అలాంటి కారును పచ్చడి చేయడానికి దాదాపు మూడున్నర గంటల సమయం పడుతుంది. ఏ ముక్కకు ఆ ముక్క నెమ్మదిగా విప్పుతూ మనుషులు చేసే పని కాదిది. ఎలెక్ట్రానిక్ పరికరాలను ఒక యంత్రం పీకేస్తుంది. రబ్బరు, టైర్లను ఒక యంత్రం లాగుతుంది. అద్దాలను ఒక యంత్రం పెరికి పక్కన పెడుతుంది. చివర ఇనుప బాడీని అప్పడంలా ఒక బరువైన యంత్రం ఒత్తేస్తుంది.

వాహనాలను తుక్కు చేయడం భారత దేశంలో కొత్త వ్యాపార అవకాశమని అప్పుడే ఆటోమొబైల్ పరిశ్రమ వారు తుక్కోత్సాహంతో తుక్కు పరిశ్రమలు నెలకొల్పుతున్నారు.

ఆటోమొబైల్ పరిశ్రమ కాకిలెక్కల ప్రకారమే భారతదేశంలో తక్షణం పచ్చడి చేయాల్సిన కార్లు కోటికి పైగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వాహనాలను విడగొట్టి, తుక్కు చేసే వ్యవస్థీకృత 72 పరిశ్రమలకు అనుమతిస్తే…అందులో ఏర్పాటైనవి 38 మాత్రమే. బయట లెక్కలోకి రాని వీధిపక్కన తుక్కు వ్యాపారుల దగ్గరే 90 శాతానికి పైబడి పాత వాహనాలున్నాయి. ఇవి కాక పాతరాతియుగంలో గుహల్లో మనిషి బతికిన కాలాల్లో కొన్న కార్లు కవర్లు కప్పి వీధుల్లో, ఇళ్ల ముందు దిష్టి బొమ్మల్లా పెట్టుకున్న కొన్ని లక్షల లేదా కోట్ల కార్ల లెక్కలు తేలడం కష్టమట.

1988 మోటారు వాహనాల చట్టం ప్రకారం 15 ఏళ్ల వయసు దాటిన వాహనాలను ఉపయోగించడానికి వీల్లేదు. అయితే- పాతికేళ్లు దాటినా వాడుతూ అంతులేని శబ్ద, వాయు కాలుష్యాన్ని ప్రసాదిస్తున్న వాహనాలు దేశంలో లెక్కలేనన్ని.

దేశంలో ఎందుకూ కొరగాని వాహనాలను ఎంతో కొంత రీసైకిలింగ్ వ్యవస్థలోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఒక సాధారణ కార్లో ఇనుము – 60 శాతం; అల్యూమినియం- 10 శాతం; రబ్బర్ ప్లాసిక్ గ్లాస్ కేబుల్ మిగతా శాతం ఉంటాయి. వీటన్నిటినీ మళ్లీ ఉపయోగించుకోగలిగితే కారు తయారీ ధరలో హీనపక్షం ముప్పయ్ వేల నుండి యాభై వేల వరకు తగ్గే అవకాశం ఉంది.

ఇవన్నీ అకడెమిగ్గా చదవడానికి బాగుంటాయి కానీ…తాతలు తాగిన నేతుల మూతుల వాసన గొప్పలు చెప్పుకునే మనం ఇంటి ముందు కుంటి కారును తుక్కుకు వేస్తామా ఏమిటి? చక్కగా రోడ్డును అడ్డగిస్తూ ఇంటి ముందు పనికిరాని కారు, ఇంటి షెడ్డులో పనికిరాని కారు ఉంటే... ఖాళీ జాగా కనపడితే అక్కడ కదలని కార్లను పెట్టుకుంటే…వచ్చే తృప్తి, కారుందన్న అప్రతిహతమయిన గర్వం, ఆనందం తుక్కుకు వేస్తే వస్తాయా? చచ్చిన మనిషిని శవమని వెంటనే శ్మశానానికి పంపి స్నానాలు చేస్తాము కానీ…చచ్చిన కారును చచ్చినా తుక్కుకు వేయం!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్