Tuesday, January 28, 2025

తెర తీయగరాదా?

నిజమే- ఏమి చేసినా పోయిన ప్రాణం తిరిగిరాదు.
నిజమే- ఏమిచ్చినా ఆ శోకం తీరనిదే.
నిజమే- తెలవారని ప్రీమియర్ సంధ్యల్లో తగ్గని వైల్డ్ ఫైర్ రగిలించిన కార్చిచ్చు బూడిదచేసిన జీవితాలు చెప్పే ఐకానిక్ పాఠాలు ఎవరికి కావాలి?

“వెయ్యి కోట్లు పెట్టాం కాబట్టి మొదటిరోజే లక్ష కోట్లు పిండుకోవాలి” అన్న ఆధునిక వినోద దోపిడీని ఒక విలువగా, ఆదర్శంగా, అవసరంగా, బాధ్యతగా మనమెన్నుకున్న ప్రభుత్వాలు అధికారికంగా అంగీకరించాక; మొదటి రోజు మొదటి ఆట, బెనిఫిట్(ఎవరికో?)షో, ప్రీమియర్ షో చూడకపోతే ప్రాణం పోతుందని మనం విలవిలలాడుతున్నప్పుడు ప్రాణాలు పోకుండా ఎలా ఉంటాయి?

అభిమానులున్నదే ప్రీ రిలీజుల్లో పోలీసు చేతిలో లాఠీ దెబ్బలు తినడానికి. రిలీజయ్యాక బ్లేడ్లతో కోసుకుని రక్తతిలకాలు దిద్దడానికి. కటౌట్లకు పాలాభిషేకాలు చేయడానికి. అభిమాన సంఘాలుగా ఏర్పడి సంఘంలో సంఘజీవులమన్న మౌలికమైన స్పృహ మరచి, మంచీమర్యాద మరచి చొక్కాలు చింపుకోవడానికి. తన్నుకోవడానికి. కులాలుగా విడిపోయి పరస్పరం పొడుచుకోవడానికి. ఇళ్ళల్లో అమ్మానాన్న, దేవుడి ఫోటోలు, నాలుగు అక్షరాలు నేర్పిన గురువుల ఫోటోలు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా హీరో- హీరోయిన్ ల ఫోటోలు పెట్టుకోవడానికే. తెరమీద హీరోలు తెరవెనుక కనీసం జీరో విలువకుడా లేనివారని తెలిసినా హారతులు పట్టాల్సిందే.

“ఎంత రేటు పెంచినా సినిమా చూసి తీరాల్సిందేనని ఎవరూ తుపాకీ పెట్టి బెదిరించడం లేదు కదా? ప్రేక్షకులే వినోదంకోసం ఇష్టంగా వస్తున్నారు. కొంటున్నారు…” అన్నది ఒక సమర్థన. పది రూపాయల టికెట్టు వెయ్యి రూపాయలు చేసి…ఈ సినిమా మెదటి రోజు మొదటి ఆట చూడకపోతే రౌరవాది నరకాల్లో పడి చస్తారని కృత్రిమ హైప్ క్రియేట్ చేస్తున్నదెవరు? తొక్కిసలాట సంధ్యలో ప్రాణం పోయిన రేవతికి ఒక కంట కన్నీరు కారుస్తూ, ఇంకో కంట్లో తొలిరోజు కలెక్షన్ల రికార్డ్ బద్దల లెక్కల ఆనందబాష్పాల చుక్కలు జలజలా కారుస్తున్నదెవరు?

థియేటర్లో హీరో టాప్ లెస్ వెహికిల్ ప్రదర్శన గంగవెర్రి జాతరలో ఒక ప్రాణం పోయి…మరో చిరు ప్రాణం కొడిగట్టే దీపంలా మిణుకుమిణుకుమంటున్నప్పుడయినా ఇకపై ప్రీమియర్ షోలకు అనుమతులుండవని ప్రభుత్వం ప్రకటించడం ఆహ్వానించదగ్గది. ఈపని ఎప్పుడో చేయాల్సింది.

ప్రీ రిలీజు వేడుకలకు ప్రభుత్వం పోలీసు భద్రత ఎందుకివ్వాలి?
అయిదు వేలమందిని పిలిస్తే లక్షమంది వచ్చి ఊరు ఊరంతా ట్రాఫిక్ జామ్ ఎందుకు కావాలి?
ఇంట్లో కూర్చుని ఏకాంతంగా లైవ్ లో మాట్లాడితే కోట్లమంది ప్రత్యక్షప్రసారంలో చూడడానికి వీలున్న ఈరోజుల్లో ప్రభుత్వానికి ఈ సినిమా అశాంతి అభద్రత తలనొప్పి ఎందుకు?

ప్రజాస్వామ్య పార్లమెంటులో స్టెన్ గన్ తో ప్రతినిధులను కాల్చి చంపే కథలో హీరోకు మూడొందల కోట్ల రెమ్యునరేషన్; కాపీ కథల కలర్ జెరాక్స్ దర్శకుడికి వందకోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాలని నిర్మాతకు ఏ అభిమాని చెప్పాడు? ఎప్పుడు చెప్పాడు? చిన్నపిల్లలు సెల్ ఫోన్లో సృష్టించగలిగే గ్రాఫిక్స్ కు వందకోట్లు పారబోయమని ఏ అభిమాన సంఘం ప్రాధేయపడింది? పది రూపాయల వడ్డీకి తెచ్చి పసలేని కథతో నీటిమీద రాతలు రాసుకోమని నిర్మాతను ఎవరు అడుక్కుంటున్నారు? పెళ్లీడు మునిమనవరాలు ఉన్నా ఇంటర్ చదివే అమ్మాయితో తుంటరి డ్యాన్స్ లే చేయాలని ముత్తాత హీరోను ఎవరు అడుక్కుంటున్నారు?

పేరుకు సినిమా పరిశ్రమ. శ్రమ ప్రేక్షకులతోపాటు అందరిదీ. ఫలితం పట్టుమని పది మందిది. పనిలో పనిగా సిమాటోగ్రఫీ మంత్రి ఇంకొంచెం లోతుగా దృష్టిపెడితే…తెరముందు, తెరవెనుక, తెర కింద, తెరపక్కన, తెరదగ్గర, తెర చుట్టుపక్కల, తెరపేరిట జరిగే పట్టపగటి వినోద దోపిడీల తెర తొలగిపోతుంది. మంత్రి ఆ తెర తీయగలరా?

“రాలిపోయే రేవతీ!
నీకు రాగాలెందుకే?
వాలిపోయే సంధ్యా!
నీకు వర్ణాలెందుకే?”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్