Support Sports In India :
జో జీతా వహీ సికందర్- అవును, గెలుపు గుర్రమే ఈ రోజుల్లో ప్రధానం. ఆ ప్రస్థానంలో తగిలే దెబ్బలు మనకెందుకు? అబ్బే, అదేం కాదు, ఆ కష్టాలు కన్నీళ్లు అర్థం చేసుకోగలం అంటారా? అయితే ఒలింపిక్స్ లో పతకం సాధించలేని వారిని ఆడి పోసుకుంటున్నదెవరు?
నిజమే, ఇన్నికోట్ల జనాభా ఉన్నదేశంలో పట్టుమని పది స్వర్ణాలు అయినా ఒలింపిక్స్ లో రాకపోవడం దయనీయమే. అయితే ఈ విషయంలో నిందించాల్సింది పాలకులనా? క్రీడాకారులనా? దశాబ్దాల తరబడి వందలకొద్దీ ఒలింపిక్స్ కి వెళ్లి రావడమే తప్ప ఛాంపియన్లను తయారు చేసేందుకు ఏదన్నా చర్యలున్నాయా? అంతర్జాతీయ క్రీడాకారులతో పోటీ పడేలా సౌకర్యాలున్నాయా? జాతీయ క్రీడల స్థాయి పోటీల్లో పాల్గొన్న వారికే ఉద్యోగాలులేని పరిస్థితి.
పైగా మన దేశంలో పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించే తల్లిదండ్రులు తక్కువ. స్పోర్ట్స్ హాస్టల్స్ లో ఉండే చాలామంది దిగువ మధ్యతరగతి వారే ఉంటారు. వాళ్ళు కూడా ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడడానికి ఆట ఉపయోగపడితే చాలనుకుంటారు. ఇప్పుడిప్పుడు ఈ పరిస్థితి మారుతోంది.
పుల్లెల గోపీచంద్ పుణ్యమా అని భారతదేశం బాడ్మింటన్లో ఆణిముత్యాలనందిస్తోంది. ఒలింపిక్స్ లో వరుసగా రెండుసార్లు సింధు పతకం సాధించింది. సైనా చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. టెన్నిస్ లో సానియా మీర్జా, లియాండర్ పేస్ గణనీయమైన విజయాలు సాధించారు.
తొలిసారిగా భారత్ 1900 లో ఒలింపిక్స్ లో పాల్గొన్న నాటినుంచి ఇప్పటివరకు వచ్చినవి 28 పతకాలు మాత్రమే. క్రీడల విషయంలో పాలకుల నిర్లక్ష్యానికి ఇది సాక్ష్యం. నిజానికి మన దేశంలో చక్కటి క్రీడాకారులు ఉన్నారు. కానీ ప్రోత్సాహం వనరులు అందడం లేదు. క్రీడల్లో శిక్షకుల ప్రవర్తన కూడా చాలా సార్లు ఆట మానేసేందుకు కారణమవుతోంది. ఎంతో ఉత్సాహంతో ఆటల్లో ప్రవేశించి రాజకీయాలు తట్టుకోలేక, ఖర్చులు పెట్టుకోలేక, లైంగిక వేధింపులు భరించలేక బయటకొచ్చే వారెందరో.
తాజాగా అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ మానసిక ఒత్తిడి తట్టుకోలేక పోటీ నుంచి విరమించుకుంది. ఆమెకి ఇంటా బయటా కూడా ఓదార్పు లభించింది. అదే మన ఆటగాళ్ల విషయంలో ప్రతి ఒక్కరూ విమర్శలు చేస్తున్నారు. ఆటలో గెలుపోటములు సహజం. దానికి క్రీడాకారుల్ని బాధ్యులు చెయ్యకూడదు. ఒలింపిక్స్ లో ఆడే అవకాశం ఒకేసారి వస్తుందనే ఒత్తిడి కూడా మన క్రీడాకారులు మేలైన ప్రదర్శన ఇవ్వలేక పోవడానికి కారణమని క్రీడా విశ్లేషకుల అభిప్రాయం. అయినా ఏ పతకం లేని స్థాయి నుంచి మనవాళ్ళు ముఖ్యంగా అమ్మాయిలు వెండి, కంచు పతకాలు సాధిస్తున్నారు. వీరు వేసిన పునాది ఉపయోగించుకొని మరింతమంది క్రీడాకారులు తయారవ్వాలి. ప్రభుత్వాలు సరయిన ప్రోత్సాహం అందిస్తే వచ్చే ఒలింపిక్స్ కు స్వర్ణాలు అందుకోవడం అసాధ్యం కాదు.
-కె. శోభ
Also Read : ఆహా! వండాలిరా మైమరచి!