Friday, October 18, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅదిగో లేపాక్షి-12

అదిగో లేపాక్షి-12

Lepakshi: What to be done: కలకాలం ఆధ్యాత్మిక, శిల్ప, చిత్ర కళా సౌధంగా నిలిచి ఉండాలని విజయనగర ప్రభువులు లేపాక్షిని తీర్చి దిద్దారు. అయిదు వందల ఏళ్లుగా లేపాక్షి కళలు వికసిస్తూనే ఉన్నాయి. వినిపిస్తూనే ఉన్నాయి.

లేపాక్షి గుడి గోపురాలు కట్టిన రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. లేపాక్షి మిగిలి ఉంది. విరుపణ్ణ కలగన్నట్లు ఆలయం పూర్తి అయి ఉంటే ఇంకెంత గొప్పగా ఉండేదో కానీ...అసంపూర్తిగా ఉన్నా లేపాక్షి ఆకర్షణకు, అందానికి తక్కువేమీ కాలేదు.

లేపాక్షి ఉత్సవాలు
ఆ ప్రాంతవాసి నీలకంఠాపురం రఘువీరా రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు…2012లో ఆయన చొరవతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటా లేపాక్షి ఉత్సవాలను ప్రారంభించింది.

తరువాత నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా లేపాక్షి ఉత్సవాలకు మరింత ప్రాచుర్యం కల్పించారు. లేపాక్షి ఉత్సవం ఒక రాజకీయ కార్యక్రమంలా, ఒక ప్రోటోకాల్ సమస్యగా మారి స్థానికుల ప్రమేయం లేకుండా పోయిందన్నది ఒక విమర్శ. లేపాక్షి చరిత్ర పుస్తకాలు, కవిత్వం, ఫోటో ఆల్బమ్, వీడియో డాక్యుమెంటరీల అవసరం గురించి చర్చే జరగడం లేదు. లేపాక్షి కళను పరిరక్షించే ప్రణాళిక ఏదీ కనిపించడం లేదు.

యునెస్కో గుర్తింపు

ప్రపంచ వారసత్వ కట్టడంగా లేపాక్షిని యునెస్కో 2022లో గుర్తించింది. కానీ…వచ్చింది తాత్కాలిక గుర్తింపే. అది శాశ్వతం కావడానికి లేపాక్షిలో ఇంకా చాలా పనులు జరగాలి. కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న లేపాక్షిలో గోడకు ఒక కరెంటు వైరు బిగించాలన్నా…అనుమతి తప్పనిసరి. ఆలయం చుట్టూ నిర్దేశిత దూరం వరకు ఆక్రమణలను తొలగించాలి. ఊళ్లో వీధులను వెడల్పు చేయాలి. మురుగునీరు నిలవకుండా కాలువలు ఉండాలి. ఇంగ్లీషులో ఆలయ చరిత్ర, ఇతర డాక్యుమెంటరీ సాక్ష్యాలను అందుబాటులో ఉంచాలి. ఇందులో కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులే ఎక్కువగా ఉంటాయి. గుర్తింపు ప్రకటన వచ్చాక జరగాల్సిన పనుల్లో కదలిక లేదు.

బెస్ట్ టూరిజం విలేజ్


లేపాక్షిని దేశంలో గొప్ప పర్యాటక గ్రామంగా కేంద్ర ప్రభుత్వం 2023లో గుర్తించింది. అవార్డులు, పొగడ్తలు, ప్రకటనలు వస్తుంటాయి కానీ…ఆలయం అభివృద్ధికి, పర్యాటకుల వసతులకు అడుగు ముందుకు పడదు.

వసతులు
సెలవు రోజుల్లో లేపాక్షికి వేల సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. వీరిలో 80 శాతం కర్ణాటకవారే ఉంటారు. లేపాక్షి బసవయ్య పక్కన ఏ పి టూరిజంవారి హరిత హోటల్లో ఆరు రూములే ఉన్నాయి. రాత్రి బసకు గదులు చాలవు. భోజనాలకు సరైన హోటళ్లు లేవు. దాంతో స్థానికులే ఉచిత అన్నదాన సత్రం ప్రారంభించారు. వారాంతాల్లో దాదాపు వెయ్యి మంది ఉచిత అన్నదాన సత్రానికి వస్తున్నారు. పదిహేనేళ్ల కిందట సొసైటీ ఫర్ అడ్వాన్స్ మెంట్ ఆఫ్ హెరిటేజ్ అండ్ కల్చర్- పేరిట స్థాపించిన లాభాపేక్ష రహిత ట్రస్ట్(లేపాక్షి రామ్ ప్రసాద్ 9440221194)ఆధ్వర్యంలో అన్నదాన సత్రం నడుస్తోంది. పర్యాటకులెవరయినా వారికి వారు విరాళాలిస్తే తీసుకుంటారు. లేకపోతే లేదు.

విమానం రెక్కలు కట్టుకుని విహార యాత్రలకు సింగపూర్లు, దుబాయ్ లు, శ్రీలంకలు వెళ్లే తెలుగువారు ఒకసారి లేపాక్షి వెళితే…కను విందు, ఆశ్చర్యం, అద్భుతం అంటే ఏమిటో తెలుస్తుంది.

ఇది- పునాది అంచనా లేక…నిర్మాణ లోపంతో పక్కకు ఒరిగిన పీసా టవర్ కాదు.
ఇది- లోహపు దూలాలు బోల్టులతో బిగించుకుంటూ పేర్చిన ఈఫిల్ టవర్ కాదు.
ఇది- మనిషిని చంపే క్రీడోన్మాదానికి కట్టిన ఇటలీ కొలాజియం గోడ కాదు.

ఇది- విజయనగర శిల్పి చేతిలో మంత్రదండం ఉలి దెబ్బకు రాతి స్తంభం నేల విడిచి నాట్యం చేసే లేపాక్షి ఆశ్చర్యం.
ఇది- నంది కొండల్లో పుట్టిన పెన్న నీళ్లు తాగిన రాతికొండ నందిగా మారి రంకెలేసిన లేపాక్షి బసవడి అద్భుతం.

గర్భగుడిలో దేవుడిని చూసే లోపు మనదైన భారతీయ సాంస్కృతిక వైభవం రాతిలో పాడే రాగంగా వినిపిస్తుంది. కళలు పూచి…నిలిచిన స్తంభాలు కనిపిస్తాయి. లిపి అక్షరం, మాట శబ్దం చెప్పని మాటలకందని శిల్ప సోయగం పిలుస్తుంది. ఒక చరిత చరితార్థమై కట్టుకున్న గుడి గోపురంలో అడుగు పెట్టకపోతే…లేపాక్షికి పోయేదేమీ లేదు. మనకే తీరని నష్టం.

లేపాక్షి గుడి గోడమీద ఉన్నవి విరుపణ్ణ కంటి రక్తపు చారలు అవునో కాదో కానీ…లేపాక్షి కంటిలో మాత్రం ఏదో విషాద ఛాయ తొంగిచూస్తూ ఉంటుంది. బహుశా అది మన నిర్లక్ష్యానికి రాతి గుండెల బాధ అయి ఉంటుంది.

కొన ఊపిరితో ఉన్న జటాయువును తట్టి లేపడానికి రాముడే స్వయంగా వచ్చి.. “లే! పక్షీ” అన్నాడు. రాముడు పేరు పెట్టిన ఊరని తెలిసి స్వయంగా అగస్త్యుడే వచ్చి లేపాక్షిలో తపస్సు చేశాడు. ఇప్పుడు లేపాక్షిని తట్టి లేపడానికి ఏ రాముడు రావాలో! లేపాక్షి తపస్సు ఫలించడానికి ఎందరు అగస్త్యులు రావాలో!

రెండు, మూడు ప్రామాణికమయిన లేపాక్షి పుస్తకాలు; కొన్ని పాత వ్యాసాల నుండి సేకరించిన సమాచారంతో రాసిన వ్యాసాలివి. లేపాక్షివాడిగా లేపాక్షి గురించి అందరికీ తెలియాలన్న తపన కొద్దీ దొరికిన కొన్ని రెఫెరెన్సులు చూసి…ఎవరో ఒకరు రాసినవాటినుండి ఎత్తి రాసినవే తప్ప …నా పరిశోధన కాదు. 14-15 శాతాబ్దాల శాసన లిపి భాషను చదివి, అర్థం చేసుకునేంత పరిజ్ఞానం నాకు లేదు. ఆయా శాసనాల్లో ఉన్న సమాచారాన్ని ఇప్పటి భాషలోకి చరిత్రకారులు అనువదించి పెట్టారు. ఇందులో ఒప్పులుంటే ఆయా రచయితలవి. తప్పులుంటే అవి నావి. చరిత్ర తేదీల్లో, ఇతర ప్రస్తావనల్లో ఎక్కడయినా తప్పులు దొర్లి ఉంటే [email protected] కు తెలియజేయగలరు. సవరిస్తాను. కొన్ని ఫోటోలు నేను లేపాక్షి వెళ్లిన ప్రతిసారీ తీసుకున్నవాటిల్లోవి. కొన్ని విడిగా తీయించినవి. సందర్భానికి తగిన కొన్ని ఫోటోలు మాత్రం నాదగ్గర లేక గూగుల్లో ఉన్నవాటినే వాడుకున్నాను. అభ్యంతరం ఉన్నవారు చెబితే…వాటిని తొలగిస్తాను. ఈ వ్యాసాలకు ఆధారమైన రచయితలు, ఫొటోగ్రాఫర్లకు రుణపడి ఉంటాను. అన్నిటికీ మించి 35 ఏళ్లుగా లేపాక్షి మీద నేనేమి రాసినా…ఇదివరకు ఎవరూ రాయనట్లు…అప్పుడే కొత్తగా నేనొక్కడినే రాసినట్లు అభినందిస్తూ…చాలదు…ఇంకా రాయి…ఇంకా రాయి…అని నా వెంటపడే లేపాక్షి మిత్రబృందానికి ఈ వ్యాసాలు అంకితం.

దీనితో అదిగో లేపాక్షి ధారావాహిక సమాప్తం.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్