కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీలో ఏం చర్చించానో బయటకు వెల్లడించలేనని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే తాను ఆలోచిస్తానని… వారికి మేలు జరిగేలా హోంమంత్రితో చర్చించానని అన్నారు. ఢిల్లీ పర్యటనలో తాజాగా కేంద్ర హోంమత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు గవర్నర్. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని… తనకు ఎవరి నుంచి ఎలాంటి సహకారం అందకపోయినా పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్తానని స్పష్టం చేశారు.
తాను రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నానని… అందరితోనూ స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తిని అని తమిళిసై పేర్కొన్నారు. ఈ నెల 10న భద్రాచలంలో జరిగే శ్రీరామ నవమి ఉత్సవాలకు హాజరవుతానని తెలిపారు. రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా భద్రాచలం వెళ్తానన్నారు. మేడారం జాతర సమయంలో రోడ్డు మార్గంలోనే ఐదు గంటల పాటు ప్రయాణించి అక్కడికి చేరుకున్నానని అన్నారు. రాజ్‌భవన్‌కు ఏ పార్టీతోనూ సంబంధం లేదని… గత రెండేళ్లలో తాను బీజేపీ నేతలను కేవలం ఒకటి, రెండు సార్లు మాత్రమే కలిశానని తమిళిసై పేర్కొన్నారు. ఉగాది ఉత్సవాలకు ఆహ్వానం పంపితే ప్రభుత్వం తరుపున ఎవరూ హాజరుకాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యక్తిగా తనను గౌరవించకపోయినా… రాజ్‌భవన్‌ను, గవర్నర్ పదవిని గౌరవించాలన్నారు. తానెవరినీ విమర్శించడం లేదని… అయితే ఒక మహిళను గౌరవించే విధానం మాత్రం ఇది కాదని అన్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఉన్నట్టుండి గవర్నర్‌ను ఢిల్లీకి రావాలని కేంద్రం కబురు పెట్టడంతో అసలేం జరుగుతోందన్న చర్చ మొదలైంది. కొంతకాలంగా గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అన్నట్లుగా తెలంగాణలో పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో గవర్నర్‌ను కేంద్రం ఆగ మేఘాల మీద ఢిల్లీకి పిలిపించడం చర్చనీయాంశంగా మారింది.
Also Read : ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళిసై అసంతృప్తి