Sunday, January 19, 2025
HomeTrending Newsప్లీజ్ సర్! మాకోసం రావాలి మీరు

ప్లీజ్ సర్! మాకోసం రావాలి మీరు

When do you return Sir?
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సర్..!
మీరు లేక మీ కాన్వాయ్ కళ మొత్తం పోయింది
ప్రోటోకాల్ వెహికల్ లో సైరన్ మూగబోయింది
మీరు ఎక్కకుండానే…. కోరి తెచ్చుకున్న కోట్ల రూపాయల ‘డిఫెండర్’ కారు ముందుకు కదలనంటే కదలనంటుంది
ఆ కార్ లో మీరు ఉంచిన స్టైలిష్ కళ్ళద్దాలు బాధతో లుక్ తిప్పేసుకుంటున్నాయి
రోజు వ్యాయామం చేసే డంబెల్స్, త్రెడ్ మిల్స్ వంటి సాధనాలు ఏ పనీలేక ఉండిపోయాయి .
మీరు వేసుకునే బూట్లు, సూట్లు చలనం లేకుండా మిగిలిపోయాయి.


మీరు ఇష్టంగా తెప్పించ్చుకున్న “రసమలై” స్వీటు ఫ్రిజ్ లో అలాగే ఉండిపోయింది
మీరు కనపడక మీ పెంపుడు జంతువులు షీరో, ఆర్లోలు దిక్కుతోచక తోక ఊపుకుంటూ మీకోసం వెతుకుతున్నాయి.
దుబాయ్ నుంచి షాపింగ్ చేసిన బట్టల బాక్స్ అలా తెరవకుండానే ఉండిపోయింది
మూడేళ్ల కాలం మీతో వెన్నంటి ఉండిన వ్యక్తిగత సిబ్బంది ఏం చేయాలో తెలియక వాళ్ల తడారని కళ్ళు మీకోసం తడుముకుంటున్నాయి .
మీ ఆత్మకూరు, నెల్లూరు, వెలగపూడి సచివాలయం పేషీలన్నీ బోసిపోయాయి
ఉద్యోగం కోసం, టిటిడి దర్శనం కోసం మీరిచ్చిన లెటర్లు చెల్లవు అంటున్నారు.
విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తే మీరు తరచూ తినే రాణిగారి తోట హోటల్ మీ రాక కోసం ఎదురు చూస్తోంది.


గచ్చిబౌలిలోని కేఎంసీలో ఉన్న ఆవు మీరే అరటిపండు తినిపించాలని మారాం చేస్తుంది
మీరు పుట్టిన బ్రాహ్మణపల్లిలోని గంగమ్మ తల్లి నా బిడ్డ ఏడని గుడి గంట ధ్వని రూపంలో ప్రశ్నిస్తోంది సర్.
ఇటీవల వర్షాలకు శిథిలమైన సోమేశ్వర ఆలయం మీరుంటేనే పునరుజ్జీవం పోసుకుంటానంటుంది.
సోమశిల హై లెవెల్ కెనాల్ గట్టుదాకా వస్తూ ఆగిపోతూ కన్నీటిపర్యంతమవుతోంది .
సంగం ఆనకట్ట కట్టలు తెంచుకుంటానని విలపిస్తుంది.
నారంపేట పారిశ్రామిక పార్కు పురుడు పోసిన మీరే లేరని ఏడుస్తుంది.

ఆత్మకూరు బస్టాండ్ లో సందడి పోయింది.
బట్టే పాడు పార్కు మధ్యలోనే ఆగింది.
సంగం మండలం జ్యోతినగర్ లో మిమ్మల్ని నమ్ముకున్న నవదీప్ తండ్రి లాంటి మీరు లేరని గుక్క పట్టి ఏడుస్తున్నాడు
ఆత్మకూరులో శారీరక ఎదుగుదల లేని మరుగుజ్జు పిల్లాడు కంఠంలో బాధని అదుముకుంటున్నాడు.
పేరంటం చేసిన మీ చేతుల మీదుగానే వివాహం చేసుకోవాలనుకున్న కానూరు చిన్నారి మీ వార్త విని విస్తుపోయింది.
ఆత్మకూరులో మీరు నిలబడి చాయ్ తాగిన టీ స్టాల్ యజమాని ఎందుకిలా జరిగిందని తనను తానే ప్రశ్నించుకుంటున్నారు.
మెట్ట ప్రాంతం అంతా భోరుమని కన్నీటి ప్రవాహాలను తలపిస్తుంది

Mekapati Gowtham

గౌతమ్ సర్..
మీరు ఒక్కసారి మా కోసం రావాలి సర్.
అనాధలుగా మిగిలిపోయి లోలోపలే కుమిలిపోతున్న మాలాంటి వాళ్ళని “ఏమోయ్” అనీ ఒక్కసారి పలకరించాలి కలలోనైనా ఒకసారి కనిపించండి సర్.

“ఆత్మ నాశనం లేనిది. ఒక శరీరాన్ని విడిచి మరో శరీరంలో చేరుతుందని భగవద్గీత చెప్పింది నిజమే అయితే”.. మీరు కచ్చితంగా మళ్ళీ మీ శరీరంలోనే ప్రవేశించి మా అందరి కోసం మళ్ళీ రావాలి సర్. ప్లీజ్ సర్. ప్లీజ్.????

మంచిపగడం దేవదాస్
(దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి పీఆర్వో)

 ఇవి కూడా చదవండి: మంచి మంత్రికి ఆయన పిఆర్ఓ తుది వీడ్కోలు నివాళి ఇది

RELATED ARTICLES

Most Popular

న్యూస్