Monday, July 8, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంజి ఆర్ మహర్షి వ్యంగ్యం

జి ఆర్ మహర్షి వ్యంగ్యం

Arrows Through Satires:

1 . విషాద నాటకం

“రంగస్థలంపై తెరలు ఎత్తకముందే విదూషకుడు ప్రత్యక్షమయ్యాడు.

విదూషకుడు:-
దయతో ప్రేక్షకులందరూ వెళ్లిపోవాలని ప్రార్థన. మీరు చూడదలచుకున్న నాటకం తొందరపడి ఆత్మహత్య చేసుకుంది. పరదాకి కట్టిన తాడుతో ఉరేసుకుంది. రంగస్థలం ముసుగు తొలగిస్తే మీరు ఉరికొయ్యకి వేలాడుతున్న నాటకాన్ని చూడొచ్చు. చివరిసారి నాటకం రాసిన ఉత్తరాన్ని చదవమంటారా?

విదూషకుడు చక్కని హాస్యం సృష్టిస్తున్నాడనుకున్న ప్రేక్షకులు బిగ్గరగా నవ్వుతూ ‘తొందరగా చదువు’ అంటూ అరిచారు.

విదూషకుడు జేబులోనుంచి ఒక ఉత్తరాన్ని తీసి

ఇప్పుడు ప్రజలకు నాటకాలతో పనిలేదు. ఎవడి నాటకంలో వాడు మునిగిపోయాడు. ఇళ్లలోనూ, సందుగొందుల్లోనూ, వీధుల్లోనూ ఎక్కడ చూసినా నాటకాలే. ఎవడి స్క్రిప్ట్ వాడే రాసుకుని నటించేస్తున్నాడు. ఒకే వ్యక్తి అనేక పాత్రల్లో దూరి రక్తి కట్టిస్తున్నాడు. నటనిప్పుడు వెన్నతో పెట్టిన విద్య.

పరదాల చాటున, ఫోకసింగ్ లైట్ల వెలుగులో నడిచే నాటకం ఇక ఎవ్వరికీ అక్కరలేదు. ఆత్మహత్య చేసుకోవడం కూడా కొన్నిసార్లు సంఘసేవతో సమానం” అని చదవడం ముగించాడు.

జనం మళ్లీ చప్పట్లు కొట్టి “ఇంతకీ ఏమంటున్నావ్?” అని అరిచారు.

విదూషకుడు:-
నాటకం అంతిమ యాత్రలో పాల్గొనమని అడుగుతున్నాను.

ప్రేక్షకులు:-
కుదరదు. మేము టికెట్లు కొని వచ్చాం. నాటకం చూపాల్సిందే. లేదా డబ్బులివ్వండి.

విదూషకుడు:-
అయ్యా! నిర్వాహకుడు పరారయ్యాడు. వాడు బహుశా ఏ వీధిలోనే నాటకం శవాన్ని ముందు పెట్టుకుని డబ్బులు అడుక్కుంటూ వుంటాడు. (ఈ మాట ముగియక ముందే విదూషకుడిపై టమోటాలు, కోడిగుడ్లు పడ్డాయి)

ఇంతలో ఒక పెద్దమనిషి స్టేజిపైకి వచ్చి ఆగండి” అని అరిచాడు. “అయ్యా!తమరెవరు?” అని విదూషకుడు అడిగాడు.

“మనుషుల్ని జంతువులు వాసన పట్టినట్టు, రాజకీయమెక్కడున్నా నేను వాసన పడతాను” అన్నాడా పెద్దమనిషి.

విదూషకుడు:-
ఇక్కడ రాజకీయమెక్కడుంది?

పెద్దమనిషి:-
టికెట్లమ్మి నాటకం చూపించకపోవడం రాజకీయం కాదా! పెద్దమనిషి అనుచరులు ఐదుగురు స్టేజిపైకి ఎక్కారు.

“మా అన్న ఒక్క ఎమ్మెల్యే టికెట్ తప్ప ఇంకే టికెట్ కొనడు. అన్న కోరినట్టు నాటకం వేయకుంటే ఇప్పుడే ఆత్మాహుతి చేసుకుంటా” అని ఒక అనుచరుడు కిరోసిన్ నెత్తిన పోసుకున్నాడు. వెంటవున్న నలుగురు గట్టిగా పట్టుకుని అగ్గిపెట్టె అతనికి దొరక్కుండా జాగ్రత్తపడ్డారు.

పెద్దమనిషి:-
వీడు నాకోసం ఇప్పటికి నూటపదారుసార్లు ఆత్మాహుతికి ప్రయత్నించాడు. వాడిని రెచ్చగొట్టకు.

విదూషకుడు పారిపోడానికి ప్రయత్నించాడు. ఇదంతా చూస్తున్న జనం ఈలలు వేశారు.

పెద్దమనిషి:-
ప్రజలకు ఏదీ నేరుగా చెప్పకూడదు. అర్థం కాకుండా గందరగోళంగా సంక్లిష్టంగా చెప్పాలి. అప్పుడే చప్పట్లు కొడతారు. నాటకం అనవసరంగా ఎందుకు చనిపోయిందో ఇప్పటికైనా అర్థమైందా?

ప్రేక్షకులు:-
నాటకం చస్తే పీడపోయింది. కనీసం ఒక అధివాస్తవిక నాటకాన్నయినా చూపించండి.

విదూషకుడు:-
ఎవరి మొహాలను వాళ్లు అద్దంలో చూసుకోండి. అద్దంలో మన మొహానికి బదులు వందరకాల ముఖాలు కనిపించడమే అధివాస్తవికత అంటే!

జనం మళ్లీ కోడిగుడ్లు విసిరారు. విదూషకుడి మొహం పచ్చడైంది”.

2 . సింహస్వామ్యం

సాధారణ ఎన్నికల ప్రచారం హోరెత్తుతూ ఉంటుంది. సభలు, ర్యాలీలు, మైకులు, నినాదాలు, పొగడ్తలు, తిట్లతో ఊరూ వాడా ఊగిపోతూ ఉంది. ఒక ఊరి పక్కన అడవిలో జంతువులకు ఈ ఎన్నికల హడావుడి అంతా విచిత్రంగా అనిపిస్తుంది. ఏమిటిదంతా అని ఆరా తీస్తాయి. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు కీలకం అని తెలిసి అడవిలో “ఆటవిక పాలన” అన్న నింద తొలగించుకోవాలంటే ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమం అని జంతువులన్నీ అంగీకారానికి వస్తాయి.

సింహం మొదలు చీమ దాకా దేన్నీ వదలకుండా ఓటరు నమోదు జరుగుతుంది. గుంట నక్క రిటర్నింగ్ అధికారిగా ఒకానొక శుభ ముహూర్తాన పోలింగ్ జరుగుతుంది. ఏనుగు నుండి పిపీలికం దాకా అన్నీ క్యూలో నిలుచుని ఓట్లు వేశాయి. నిర్ణయించిన ముహూర్తానికి పోలింగ్ ఫలితాలు ప్రకటించడమే ఇక తరువాయి.

విప్పిన బ్యాలెట్ బాక్సులతో పాటు అన్నీ కలిసి సింహం గుహ దగ్గరికి వెళతాయి. సరిగ్గా అదే సమయానికి సింహం నిద్రపోతూ ఉంటుంది. నిద్ర పూర్తయి నెమ్మదిగా సింహం కళ్లు తెరిచి…ఏమిటి మొత్తం అంతా కట్టకట్టుకుని వచ్చారు? అని అడుగుతుంది. ఏమీ లేదు మహారాజా! మొన్న పోలింగ్ జరిగింది కదా? మీరు అనుమతిస్తే ఫలితాలు ప్రకటిస్తాం…అని భయ భక్తులతో తగ్గు స్వరంతో మనవి చేసుకున్నాయి. అలాగే ప్రకటించండి…ఎలాగూ అడవికి నేనే కదా రాజును? అని సింహం ఆవులిస్తూ చెప్పింది.

“సింహం ఆవులించి నిద్ర లేచింది…ప్రజాస్వామ్యం పలాయనం చిత్తగించింది”.

3 . పెళ్లిలో పేకాట

“ప్రతి పెళ్ళిలోనూ పేకాట స్పెషల్ ఎట్రాక్షన్. చదివింపులకు తెచ్చుకున్న డబ్బుల్ని కూడా పోగొట్టుకుని చార్జీలకు లేక నడుచుకుని వచ్చిన వాళ్ళెందరో ఉన్నారు. మా ఊర్లో ఒకాయన పేరు ఇస్పేట్ల ఎంకట్రాముడు. పెళ్ళిలో ముక్కలు ఆడి ముప్పై కిలోమీటర్లు నడుచుకుని వూరు చేరాడు. పేకాటలో డబ్బులు పోగొట్టుకుని బంధువుల్ని అప్పు అడగాలంటే నామోషి, నడిచినందుకు కాదు గానీ ఈ విషయం ఊరంతా తెలిసినందుకు ఎంకట్రాముడికి రోషం వచ్చింది. ఒకోసారి పెళ్ళికొడుకు కూడా పేకాటలో జాయినై మామగారిచ్చిన ఉంగరాన్ని కూడా పోగొడుతుంటాడు. ఇప్పుడు మనుషులు కొంచెం షోకు నేర్చుకున్నారు గానీ, నా చిన్నప్పుడు ఇంట్లోంచి తెల్లటి పంచెలతో పెళ్ళికి బయలుదేరేవారు. వూరుదాటగానే పంచెను విప్పి నెత్తికి చుట్టుకుని డ్రాయర్లతో ఏరు దాటేవారు. తరువాత పంచె కట్టుకుని పెళ్ళి ఇంట్లో తేలేవారు. పంచెమాసిపోతే కట్టుకోడానికి ఇంకో పంచె ఉండేది కాదు.

పెళ్ళిలో పట్టీలు రాసేవాళ్ళుంటారు. పూర్వమైతే ఎవరెవరు ఎంత చదివించారో మైకులో చెప్పేవాళ్ళు. ఇప్పుడంటే గిఫ్టుల సంప్రదాయం వచ్చేసింది. కొన్ని పెళ్ళిళ్ళలో ఈ పట్టీలు రాసేవాళ్ళు డబ్బుతో సహా మాయమయ్యేవాళ్ళు. వాళ్ళను పట్టుకోవాలంటే ఇంకో పెళ్ళిలో వెతకాల్సివచ్చేది. వెనుకటికి మైకుసెట్లు పెట్టి నాలుగైదురోజులు ఊళ్ళోవాళ్ళ చెవుల తుప్పు వదిలించేవాళ్ళు. పెళ్ళయింతరువాత ఔత్సాహిక గాయకులు మైకులు పట్టుకుని పాడింది పాడకుండా చెడుగుడు ఆడేవాళ్ళు. ఇప్పుడంతా స్పీడు. పెళ్ళికి వెళ్ళడం, వధూవరులతో ఫొటో దిగడం, భోంచేయడం. ఒకే కల్యాణ మండపంలో నాలుగు బ్లాకులుంటే మరో ఇబ్బంది. వెళ్ళాల్సిన పెళ్ళికి కాకుండా ఇంకెవరి పెళ్ళికో వెళ్ళిపోతాం“.

4 . సినిమాకు కథ ఎందుకు?

“సినిమాకి కథ రాయడం ఈజీ. ఎందుకంటే కథ వుండదు కాబట్టి. ఒకవేళ కథ చెప్పాలనుకున్నా నిర్మాతలు ఒప్పుకోరు. హీరో ఎంట్రీ, బిల్డప్ సీన్లు ముందు చెప్పి, తర్వాత కథ చెప్పాలి. అంటే రైల్వే బోగీలో ఫైట్ పెడితే, హీరో దెబ్బలకి రౌడీలు బోగీ ఇనుప తలుపులు బద్దలు కొట్టుకుని బయటికి రావాలి. రజనీకాంత్ లింగాలో ఈ సీన్ వుంది.. ఆయన కొడితే బోగీ తలుపే వూడిపోతుంది. ఇంత అధ్వాన్నంగా బోగీలని తయారు చేస్తున్న రైల్వేశాఖపై విచారణ జరిపించాలి. రజనీ రాజకీయాల్లో కూడా ఇలాగే తంతాడని అభిమానులు భ్రమపడ్డారు. పాలిటిక్స్లో గ్రాఫిక్స్ వుండవు. ఇది తెలిసే రజనీ తప్పుకున్నాడు. తెలుగు సినిమా లేదా తమిళ సినిమాలకి అదీ కాదంటే ఇండియన్ సినిమాకి కథ రాయాలంటే సైన్స్ జ్ఞానం వుండకూడదు. ఫిజిక్స్ అసలు తెలీకూడదు. ఎందుకంటే హీరో దైవాంశ స్వరూపుడు కాబట్టి. భౌతికశాస్త్రం ప్రకారం 80 కిలోల మనిషి గాల్లో ఎగిరి పడాలంటే, అది గొరిల్లా లాంటి జంతువుకి కూడా సరిగా సాధ్యం కాదు. మన హీరో కొడితే ఇద్దరు ముగ్గురు Sky Diving చేయడమే కాకుండా ఒక్కోసారి ఎలెక్ట్రిక్ పోల్ ఎత్తు ఎగురుతారు. ఈ రూల్స్ మాకెందుకు? మేం సినిమా తీసేది మాస్ కోసం, మన దేశంలో సైంటిస్ట్లకే సైన్స్ అర్థం కాక, రాకెట్ లాంచింగ్ అర్చనలు పూజలు చేయించి మరీ చేస్తున్నారు. జనానికి ఏది నచ్చితే అదే మంచి సినిమా, మాకు డబ్బులొస్తే అది హిట్ అని నిర్మాతలు, దర్శకులు అంటారు. మళయాల సినిమాల నుంచి బోలెడు డబ్బులు పోసి కథలు కొంటున్నాం మాకు నేటివిటి వుండే కథలు చెప్పండి అని కొందరు నిర్మాతలు అడుగుతూ వుంటారు. అడిగారు కదాని నువ్వు రైతు కథ చెప్పడానికి ప్రయత్నిస్తే రైతు వీధుల్లో వుంటే ప్రభుత్వమే పట్టించుకోవడం లేదు. ఇక ఆ కథలు తీస్తే జనం ఏమి చూస్తారని అంటారు. వెనుకటి రోజుల్లో రచయితలకి కొంచెం వెసులుబాటు వుండేది. NTR సినిమా అయితే మారువేషం, ANR అయితే అపార్థం కలిపితే వర్కవుటయ్యేది. NTR కనీసం వంద సినిమాల్లో మారువేషాలు వేసుంటారు. జనం చూసుంటారు. NTR ఎన్ని వేషాలు వేసినా మనం గుర్తు పడతాం. విలన్లు గుర్తు పట్టకపోతే అది వాళ్ల ఖర్మ. ANR హీరోయిన్తో గొడవ పడడం, నాలుగు ప్రేమ గీతాలు, రెండు విరహ గీతాలుకథ ఎవడికి కావాలి? జనం మెచ్చింది మనం తీయాలా? మనం వేసేది జనం చూడాలా? ఇది ఎప్పుడూ మిలియన్ డాలర్ క్వశ్చన్”.

ఈ నాలుగూ చెయి తిరిగిన రచయిత జి ఆర్ మహర్షివి. ఆయన్ను హాస్య రచయిత, వ్యంగ్య రచయిత అని పరిమిత చట్రంలో బిగించడం నాకు ఇష్టం లేదు.

సమకాలీన అంశాలను సునిశిత హాస్యంతో, వ్యంగ్యంతో గుండెలు మెలిపెట్టేలా చెప్పడం జి ఆర్ మహర్షి ప్రత్యేకత. తెలుగు సాహిత్యంలో పి జి చేశారు. మంచి కథా రచయిత. చాలా కాలం జర్నలిస్టుగా పనిచేశారు. ఆ సమయంలో రాసిన కాలమ్స్ తో నో ప్రాబ్లమ్, నెమలికన్ను పేరిట రెండు పుస్తకాలు ప్రచురించారు. కొన్ని సినిమాలకు కథలు, మాటలు రాశారు. కొన్ని సినిమాలకు కేవలం కామెడీ ట్రాక్ లు రాశారు. డిజిటల్ వేదికల మీద ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు.

రాసే వాక్యం ఎదుటి మనిషితో మాట్లాడుతున్నంత సహజంగా, సరళంగా ఎలా ఉండాలో జి ఆర్ మహర్షిని చూసి నేర్చుకోవచ్చు. పెద్ద పెద్ద సమాస పదబంధాలతో, అర్థం కాని కవితాభివ్యక్తులతో డొంకతిరుగుడుగా చెప్పకుండా సూటిగా ఎలా చెప్పాలో జి ఆర్ మహర్షిని చూసి నేర్చుకోవచ్చు. ఎంత గంభీరమైన విషయాన్నయినా తేలిగ్గా ఎలా చెప్పాలో జి ఆర్ మహర్షిని చూసి నేర్చుకోవచ్చు. తెలుగు వాక్యంలో వ్యంగ్యం ఎన్ని నడకలు పోగలదో తెలుసుకోవాలంటే జి ఆర్ మహర్షిని పట్టుకోవాలి.

జి ఆర్ మహర్షి నాకు ఆత్మీయ మిత్రుడు. నా రాతల మీద ఆయన ప్రభావం ఎక్కువ. నేనాయన్ను కలిసిన ప్రతిసారీ సాహిత్య చర్చల్లో గంటలు సెకన్లలా దొర్లిపోతాయి.

బూతు, పచ్చి బూతు, ద్వంద్వార్థాలు, వెక్కిరింత ఎవరైనా రాయగలరు. సరైన వ్యంగ్యం అందరూ రాయలేరు. ఆ వ్యంగ్యం మాటున విషాద సముద్రాలను పట్టి చూపడం కోటికొక్కరికి కూడా సాధ్యం కాదు.

ఆయనే అన్నట్లు- ఎవడి వ్యంగ్యం వాడిది అయినప్పుడు ప్రొఫెషనల్ వ్యంగ్యాన్ని పట్టించుకునేదెవడు?

ఒక్కసారి జి ఆర్ మహర్షిని చదివి చూడండి. మన దుఃఖాలు కనీసం అవి చదువుతున్నంతసేపయినా దూదిపింజల్లా తేలిపోతాయి. అవి మనల్ను మనకే పట్టిచ్చి…అద్దంలో చూపే వ్యంగ్యాలు. వెంటాడే మిత్ర వాక్యాలు.

(జి ఆర్ మహర్షి ఫోన్-90002 26618. ఆయన సినిమాల మీద రాసిన వ్యాసాల సంకలనం “మార్నింగ్ షో” పేరుతో పుస్తకంగా ప్రచురితమయ్యింది. 07-02-24 న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఉదయం 10.30 కు ఆవిష్కరణ. ఆ సందర్భంగా)

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్