Friday, March 29, 2024
HomeTrending Newsఅంటార్కిటికా చేరిన హరిత ఉద్యమం

అంటార్కిటికా చేరిన హరిత ఉద్యమం

పర్యావరణ హితాన్ని కోరుతూ, దేశ వ్యాప్త పచ్చదనం పెంపు లక్ష్యంగా పనిచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొత్త చరిత్రను సృష్టించింది. మంచుఖండం అంటార్కిటికాపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జెండా ఎగిరింది.

ప్రపంచ పర్యావరణం కాపాడటమే లక్ష్యంగా, కర్బన ఉద్ఘారాలను తగ్గించేందుకు పాటుపడాలనే సంకల్పంతో చేపట్టిన అంటార్కిటికా యాత్రలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వాలంటీర్ కు చోటు దక్కింది. 35 దేశాల నుంచి 150 మంది సభ్యులతో కూడిన బృందంతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంటార్కిటికా ప్రయాణించింది. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులు, ఎదురయ్యే సవాళ్ల పై ఈ బృందం అధ్యయనం చేస్తోంది.

ఫౌండేషన్ – 2041 నెలకొల్పి భూగోళంతో పాటు, అంటార్కిటికా పర్యావరణం కాపాడటనే ఉద్యమం చేపట్టిన రాబర్ట్ స్వాన్ ను ఈ పర్యటనలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వాలంటీర్ కలిశారు.
గత ఐదేళ్లుగా చేపట్టిన కార్యక్రమాలు, భారతదేశ వ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం విస్తరిస్తున్న తీరును వివరించారు. చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రశంసించిన రాబర్ట్ స్వాన్ స్వయంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జెండాను అంటార్కిటికాలో ప్రదర్శించారు.

ఉత్తర, దక్షిణ ధృవాలను రెండింటినీ సందర్శించిన వ్యక్తిగా, పర్యావరణం కోసం పాటుతూ, అంతర్జాతీయ సమాజాన్ని ఆ దిశగా చైతన్యవంతం చేస్తున్న వాలంటీర్ గా రాబర్ట్ స్వాన్ ను ఐక్యరాజ్య సమితి గుర్తించింది. అంటార్కిటికా యాత్రలో పాల్గొన్న వాలంటీర్ అభిషేక్ శోభన్నను ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ మనస్ఫూర్తిగా అభినందించారు. ట్విట్టర్ వేదికగా రాబర్ట్ స్వాన్ కు కృతజ్జతలు తెలిపారు. రెండు ధృవాలను సందర్శించిన పర్యావరణవేత్త చేతులమీదుగా అంటార్కిటికాలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పతాకం ఆవిష్కరించటం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని సంతోష్ కుమార్ తెలిపారు. మరింత చిత్తశుద్దితో తమ పర్యావరణ ఉద్యమం కొనసాగిస్తామని ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్