Monday, January 27, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవివాహ వ్యవస్థకు దెబ్బ గ్రే డైవోర్స్

వివాహ వ్యవస్థకు దెబ్బ గ్రే డైవోర్స్

పెళ్లంటే…పందిళ్లు
తప్పెట్లు తాళాలు, భాజా భజంత్రీలు
మూడే ముళ్ళు… ఏడే అడుగులు
మొత్తం కలిపి నూరేళ్లు.
నూరేళ్ళే! ఒక్కళ్లతోనే!… అంత టైం లేదు విడాకులిచ్చేయండి. ఇప్పటికే యాభై దాటిపోయాయి.
‘అమ్మా! నాన్నా! నేను విడాకులు తీసుకుందామనుకుంటున్నా!’
‘లాయర్ ఎవరో చెప్పమ్మా! మేము కూడా తీసుకోవాలి’
విడాకులంటే?
ఆంక్షలు లేని జీవితం, ఎవరినీ భరించనక్కరలేదు, హాయిగా ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ అనుకుంటూ సంతోషించడం… ఇదీ విడాకులు తీసుకునే వారి అభిప్రాయం. కొన్నాళ్ల క్రితం దాకా పెళ్లయిన పిల్లలు విడాకులు తీసుకుంటారేమో అని తల్లిదండ్రులు భయపడేవారు. కాలం కాని కాలం ఒకటి వచ్చి పడింది. తల్లిదండ్రులు విడాకులు తీసుకుంటున్నారని పిల్లలు బాధపడుతున్నారు. ఇకపై పెళ్లి, పిల్లలు మాత్రమే వేడుక కాదు. విడాకులు కూడా వేడుకే అన్నట్టు గ్రే డైవోర్స్, సిల్వర్ స్ప్లిటర్స్ , లేట్ లైఫ్ డైవోర్స్ అని 50 దాటినవాళ్లు విడాకులకు తొందర పడుతున్నారు. గతంలో కన్నా దాదాపు 45 శాతం పెద్దవాళ్ళు విడాకుల తీసుకోవడం పెరిగిందట. ఈ మధ్య సెలెబ్రెటీల విడాకులతో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.

సైఫ్- అమృత, కమలహాసన్- సారిక, హ్రితిక్ – సుసానే , తాజాగా ఏ ఆర్ రెహమాన్- సైరాబాను విడాకులు వివాహ వ్యవస్థ మనుగడపై అనుమానాలు కలిగిస్తోంది. ఇన్నాళ్లూ విదేశాల్లో, ప్రముఖులకు మాత్రమే ఇది సాధారణం అనుకునేవారు. మిగతావాటి మాదిరి విడాకుల సంస్కృతి కూడా దిగుమతి అయినట్టుందని సనాతనవాదులు గొణుక్కుంటున్నారు. ఇంతకీ మధ్యవయసులో విడాకులకు కారణాలేంటి?

మనకు తెలిసినంతవరకు మన సంస్కృతిలో మహిళలు ఎప్పుడూ త్యాగాలకు సిద్ధంగా ఉండాలి. తనకంటూ కోరికలేవీ లేకుండా కుటుంబానికి అంకితం కావాలి. ఆమె పేరున ఎటువంటి ఆస్తులూ ఉండవు. పిల్లల్ని పెంచడం బాధ్యత. హక్కులు ఉండవు. మానసికంగా శారీరకంగా అలసిపోయి అలాగే జీవచ్ఛవాల్లా ఉండేవారు. మెల్లిగానైనా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. చదువుకుని ఉద్యోగం చేస్తూ తమకు నచ్చినట్టు ఉండటం ప్రారంభించారు. ఆస్తి హక్కు చట్టం వల్ల వారికి మేలు జరిగింది. ఆ తర్వాత కుటుంబం కోసం ఎప్పుడూ మహిళలే ఎందుకు కష్టపడాలనే ప్రశ్న ఉదయించింది. అక్కడినుంచి కుటుంబాల్లో గొడవలు మొదలయ్యాయి. పురుషాధిక్య భావజాలం ఉన్న మగవారు అణచివేత ప్రారంభించారు. దాంతో మహిళలు విడాకులకు సిద్ధపడుతున్నారు. అలాగే మహిళల హింస భరించలేని మగవారూ విడాకులు కోరుకుంటున్నారు. అయితే మగవారి విడాకులకు ప్రధాన కారణం వారి అక్రమ సంబంధాలు కాగా, మహిళలు ప్రశాంతమైన జీవితం కోసం విడాకులు తీసుకుంటున్నారు. వీరికి కొన్నిసార్లు పిల్లలు సాయపడుతున్నారు.

సాధారణ జంటల విడాకుల కారణాలకు, సెలబ్రిటీ జంటల విడాకులకు చాలా తేడా ఉందంటున్నారు ప్రముఖ న్యాయవాది వందన. ఈవిడే ఏ ఆర్ రెహ్మాన్ భార్య సైరాబాను తరఫు లాయరు కూడా. సమాజంలో ప్రముఖులుగా ఉన్నవారి విడాకులకు అక్రమ సంబంధాలు కారణం కాదంటారీమె. అసలది పెద్ద విషయమే కాదట వారికి. రాజకీయంగా, సాంస్కృతికంగా ఎదురయ్యే అభిప్రాయ భేదాలు, పిల్లల పెంపకం ఇవి వారు విడిపోవడానికి కారణాలంటారు వందన. అదీ కాక జీవితంలో అన్నీ అడగకుండానే వచ్చేస్తే ఒకరకమైన స్తబ్దత ఏర్పడుతుందని అటువంటి బోర్ డమ్ కూడా సెలబ్రిటీ విడాకులకు కారణం అంటారీమె. అదే సాధారణ జంటలైతే అవే కారణాలపై రాజీ పడతారని, సెలబ్రిటీ లకు అలా రాజీ పడే అవసరం ఉండదని కూడా అంటారీమె.

సమాజం వేగంగా మారుతోంది. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరిపైనా ఆధారపడటానికి సిద్ధంగా లేరు. పిల్లలు పెద్దవాళ్ళయ్యాకైనా సరే, తమకీ జీవితం కావాలని తల్లిదండ్రులు విడిపోతున్నారు. ఇండియన్ నేషనల్ బార్ అసోసియేషన్ సర్వేలో విడాకులు కోరుతున్నవారిలో 45 శాతం 50 ఏళ్ళు పైబడిన వారే అని వెల్లడైంది. ఇలాంటివేమీ భారతీయ కుటుంబ వ్యవస్థని దెబ్బ తీయలేవు, ఈ విడాకులన్నీ చదువుకున్న, పట్టణ ప్రాంత ధనిక వర్గాలకే పరిమితం అనేవారు ఉన్నారు గానీ ప్రస్తుతానికైతే పరిస్థితి గంభీరంగానే ఉందని చెప్పచ్చు.

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్