Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్గుజరాత్ జోరు- కోల్ కతాపై గెలుపు

గుజరాత్ జోరు- కోల్ కతాపై గెలుపు

IPL-2022:  ఐపీఎల్ లో నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 8 పరుగుల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ పై విజయం సాధించింది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి తన బ్యాట్ తో సత్తా చాటాడు.

నవీ ముంబైలోని డా.డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ శుభమన్ గిల్ (7) 8 పరుగుల వద్ద తొలి వికెట్ గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ వృద్దిమాన్ సాహా- కెప్టెన్ పాండ్యా లు రెండో వికెట్ కు 75 పరుగులు జోడించారు. సాహా ­25 పరుగులు; ఆ తర్వాత వచ్చిన డేవిడ్ మిల్లర్ 27 పరుగులు చేసి ఔటయ్యారు. పాండ్యా 48బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లతో 67 పరుగులు చేసి ఔటయ్యాడు. తెవాటియా17 పరుగులతో ఫర్వాలేదనిపించినా తర్వాత వచ్చినవారు విఫలమయ్యారు. దీనితో గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో ఆండ్రీ రస్సెల్ నాలుగు; టిమ్ సౌతీ మూడు; ఉమేష్ యాదవ్, శివమ్ మావి చెరో వికెట్ పడగొట్టారు.

కోల్ కతా34 పరుగులకే 4 కీలక వికెట్లు (శామ్ బిల్లింగ్స్-4; సునీల్ నరేన్-5; శ్రేయాస్ అయ్యర్-12; నితీష్ రానా-2) కోల్పోయి కష్టాల్లో పడింది. రింకూ సింగ్- వెంకటేష్ అయ్యర్ ఐదో వికెట్ కు 45 పరుగులు జోడించారు. రింకూ సింగ్-35; అయ్యర్-17 పరుగులు చేసి ఔటయ్యారు. శివమ్ మావి రెండు పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ దశలో ఆండ్రీ రస్సెల్- ఉమేష్ యాదవ్ గుజరాత్ బౌలర్లను ఎదుర్కొన్నారు. చివరి ఓవర్లో 18 పరుగులు కావాల్సి ఉండగా అల్జారి జోసెఫ్ బౌలింగ్ లో తొలి బంతిని రస్సెల్ సిక్సర్ గా మలిచాడు. ఈ దశలో కోల్ కతా విజయం ఖాయమని అంతా అనుకున్నా రెండో బంతికే బౌండరీ లైన్ వద్ద ఫెర్గ్యుసన్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు రస్సెల్ వెనుదిరగడంతో కోల్ కతా శిబిరంలో నిరాశ అలముకుంది. తర్వాతి నాలుగు బంతుల్లో కేవలం మూడు పరుగులే రావడంతో గుజరాత్ 8 పరుగులతో విజయం సొంతం చేసుకుంది. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమి, రషీద్ ఖాన్, యష్ దయాళ్ తలా రెండు వికెట్లు; అల్జారి జోసెఫ్, ఫెర్గ్యుసన్ చెరో వికెట్ పడగొట్టారు.

రషీద్ ఖాన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read : జోస్ బట్లర్ సెంచరీ- ఢిల్లీపై రాజస్థాన్ గెలుపు

RELATED ARTICLES

Most Popular

న్యూస్