Thursday, March 28, 2024
Homeస్పోర్ట్స్జోస్ బట్లర్ సెంచరీ- ఢిల్లీపై రాజస్థాన్ గెలుపు

జోస్ బట్లర్ సెంచరీ- ఢిల్లీపై రాజస్థాన్ గెలుపు

IPL-2022: ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 15 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించింది. రాజస్థాన్ ఓపెనర్లు జోస్ బట్లర్ సెంచరీ, దేవదత్ పడిక్కల్ అర్ధ సెంచరీతో సత్తా చాటడంతో రాజస్థాన్ ఈ సీజన్ ఐపీఎల్ లో అత్యధిక స్కోరు (222) నమోదు చేసిన జట్టుగా నిలిచింది. లక్ష్య సాధనలో ఢిల్లీ తుది వరకూ పోరాడినా 19వ ఓవర్ మేడెన్ కావడంతో 20 ఓవర్లకు 207 పరుగులు చేయగలిగింది.

ముంబై వాంఖేడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి మూడు ఓవర్లు నిదానంగా ఆడి కేవలం 12 పరుగులే చేసిన రాజస్థాన్ ఓపెనర్లు నాలుగో ఓవర్ నుంచి దూకుడు మొదలు పెట్టి తొలి వికెట్ కు 155 పరుగులు జోడించారు, 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేసిన పడిక్కల్, ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత బట్లర్ తో జత కలిసిన కెప్టెన్ సంజూ శామ్సన్ కూడా ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేశాడు, 65 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 116 పరుగులు చేసిన బట్లర్ 19వ ఓవర్ చివరి బంతికి ముస్తాఫిజర్ బౌలింగ్ లో వార్నర్ పట్టిన క్యాచ్ కు ఔటయ్యాడు.  శామ్సన్ 19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.

ఢిల్లీ ఇన్నింగ్స్ ధీటుగానే మొదలు పెట్టింది, 14బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 28 పరుగులు చేసిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను ప్రసిద్ కృష్ణ ఓ చక్కటి బంతికి పెవిలియన్ పంపాడు. సర్ఫరాజ్ ఖాన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. కెప్టెన్ రిషభ్ పంత్- మరో ఓపెనర్ పృథ్వీ షా లు మూడో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు, 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 37 పరుగులు చేసిన షా ను రవిచంద్రన్ అశ్విన్ ఔట్ చేశాడు. కెప్టెన్ పంత్ కూడా 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 స్కోరు చేసి ఔటయ్యాడు. అక్షర్ పటేల్(1), శార్దూల్ ఠాకూర్(10) విఫలమయ్యారు. లలిత్ యాదవ్- పావెల్ చివర్లో మెరుపులు మెరిపించినా రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో విజయం సాధ్యపడలేదు. లలిత్ 24 బంతుల్లో ­3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37  పరుగులు చేసి 19వ ఓవర్లో ఔటయ్యాడు. ప్రసిద్ వేసిన 19వ ఓవర్ మేడిన్ కావడం విశేషం. చివరి ఓవర్లో 36 పరుగులు అవసరం కాగా పావెల్ మూడు వరుస సిక్సర్లతో రాజస్థాన్ కు కాసేపు వణుకు పుట్టించాడు. 19వ ఓవర్ కూడా పావెల్ స్ట్రయికింగ్ లో ఉంటే మ్యాచ్ ఫలితం తారుమారు అయిఉండేది.  పావెల్ 15 బంతుల్లో 5 సిక్సర్లతో 36 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి ఔటయ్యాడు.

రాజస్థాన్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ మూడు; అశ్విన్ రెండు; యజువేంద్ర చాహల్, ఒబెద్ మెక్ కే చెరో వికెట్ పడగొట్టారు.

జోస్ బట్లర్ కు ‘ ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read : ఐపీఎల్: ధోనీ మ్యాజిక్- ముంబైకి ఏడో ఓటమి

RELATED ARTICLES

Most Popular

న్యూస్