అరవై నాలుగు తెలుపు నలుపు గళ్ళ పలక అతడికి యుద్ధరంగం.
అతడే రాజు.
అతడే మంత్రి.
అతడే సర్వసైన్యాధ్యక్షుడు.
అతడే కాల్బలం.
అతడు ఏనుగును లొంగదీసుకుని నడిపిన మావటి.
అతడు గుర్రాన్ని అధిరోహించి పరుగులు పెట్టించిన ఆశ్వికుడు.
అతడు ఎడారిలో ఒంటె మీద ఒంటరి ప్రయాణం చేసిన యోధుడు.
అతడిప్పుడు చదరంగ రథగజతురగ పదాతిసమావృత పరిజన మండిత లోకనుతుడు.
ఒక్కొక్క ఎత్తులో ప్రత్యర్థిని చిత్తు చేసి ప్రపంచ చదరంగ రారాజుగా విజయ సింహాసనం అధిష్ఠించిన జగజ్జేత.
దొమ్మరాజు గుకేష్. వయసు పద్దెనిమిదేళ్ళు. చిత్తూరు జిల్లానుండి తమిళనాడు చెన్నయ్ వెళ్లి స్థిరపడ్డ కుటుంబం. ఇంట్లో అందరూ ఇప్పటికీ తెలుగే మాట్లాడతారు. తండ్రి రజనీకాంత్ ఈ ఎన్ టీ డాక్టర్. తల్లి పద్మకుమారి మైక్రోబయాలజిస్ట్. ఇంకా చాలా వివరాలు మెయిన్ స్ట్రీమ్ మీడియాతోపాటు సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు గూగులించవచ్చు.
కొడుకును జగజ్జేతను చేయడానికి తండ్రి డాక్టర్ గా ప్రాక్టీస్ మానేసి…కొడుకుతోపాటు తిరుగుతూ ఉండడం; తల్లి జీతంతో ఇంటిని నెట్టుకొస్తూ కొడుకు కలలను నిజం చేయడం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
విశ్వనాథన్ ఆనంద్ తరువాత భారత్ కు చదరంగ జగజ్జేత కీర్తి కిరీటం పెట్టినవాడు పద్దెనిమిదేళ్ళ గుకేష్. దాని విలువ ఎంతో గెలిచాక చెస్ బోర్డుపై సంప్రదాయంగా ఎక్కడి పావులను అక్కడే సర్దుతున్న గుకేష్ కు పొంగుకొస్తున్న కన్నీళ్ళను చూస్తే తెలుస్తుంది.
కొడుకు జగజ్జేతగా అవతరించబోతున్న క్షణాల్లో సింగపూర్లో ఫిడే- ప్రపంచ చెస్ సమాఖ్య క్రీడా వేదిక గుమ్మం ముందు, వసారాల్లో ఆనందంతో నోటమాటరాక…తారాడుతూ…తరువాత పరుగున వెళ్ళి… అభినందనగా కొడుకును కౌగలించుకున్న తండ్రిని; వారిద్దరి కళ్ళల్లో జలజలా రాలిన ఆనంద బాష్పాలను చూస్తే దాని విలువ ఎంతో తెలుస్తుంది.
మనం రజనీకాంత్ లా భద్రమైన ఉద్యోగం వదిలి కొడుకు, కూతుళ్ళ అభిరుచులకు తగిన దారిలోకి వెళ్ళనివ్వం కాబట్టి;
ఆటలంటే అంటరానివిగా చూస్తాము కాబట్టి;
నామకరణం రోజే ఐ ఐ టీ అడ్వాన్స్ కోచింగ్ సెంటర్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షకోసం కోచింగ్ ఇచ్చే మరో సెంటర్లో అడ్వాన్స్ కడతాం కాబట్టి;
అన్నప్రాశన రోజే మెయిన్స్ కు పూర్తీ ఫీజు కడతాం కాబట్టి;
లాంగ్ టర్మ్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఇంటిగ్రేటెడ్ మెగా దగా సూపర్ రిఫైనరీ ఇంటర్ అత్యుత్తమ టీచింగ్ మెరిక క్లాసులో మన పిల్లలు పడడానికి కోటి దేవుళ్ళకు మొక్కుకుంటాం కాబట్టి;
మార్కులు, ర్యాంకులు అందునా అంకెలో అంకెగా ఒకటిగా మన పిల్లలు మిగిలిపోవాలని అనుకుంటాం కాబట్టి…
రజనీకాంత్ మనకు వింతగా కనిపిస్తారు. ఆశ్చర్యం అనిపిస్తారు.
నిజానికి ఆ తండ్రి అకుంఠిత దీక్ష అద్భుతం. ఆ తల్లి ఓర్పు కూడా అద్భుతం. వారి అరచేతులమీద పెరుగుతూ…చదరంగం ఆడి… వారి అరచేతుల్లో జగజ్జేత కీర్తి కిరీటాన్ని బహుమానంగా పెట్టిన ఆ కొడుకు పరమ అద్భుతం.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు