Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంగుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తికి నివాళి

గుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తికి నివాళి

Great Telugu Pandit: తెలుగు విశ్వ విద్యాలయంలో ఈమధ్యే ప్రొఫెసర్ అయి…అంతలోనే కాకుండా పోయి…మనసు నొచ్చుకుని గుండెపోటుతో శాశ్వతంగా ఈ లోకాన్నే వదిలి వెళ్లిన గుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తి నాకు అత్యంత ఆప్త మిత్రుడు. దాదాపు 30 ఏళ్లుగా ప్రవహిస్తున్న సాహితీ స్నేహం మాది. వాళ్ల నాన్న గుమ్మన్నగారి లక్ష్మి నరసింహ శర్మగారు కూడా మా నాన్నలా తెలుగు పండితుడు. అష్టావధాని. నాది కడప, అనంతపురం. ఆయనది మెదక్, హైదరాబాద్. 1995 ప్రాంతాల్లో నేను ఒక పత్రికలో ఆదివారం అనుబంధం ఇన్ ఛార్జ్ గా పని చేస్తున్నప్పుడు పరిచయమయ్యాడు. పార్ట్ టైమ్ తెలుగు లెక్చరర్ గా సికింద్రాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కాలేజీలో పనిచేస్తూ పత్రికల్లో వ్యాసాలు రాసేవాడు. కోచింగ్ సెంటర్లకు స్టడీ మెటీరియల్ రాసేవాడు.

తెలుగు ప్రాచీన సాహిత్యాన్ని ఇష్టంగా చదివినవాడు. జీవితంలో స్థిరపడడానికి పొద్దు చాలని మనిషిలా కాళ్లకు చక్రాలు కట్టుకుని అలుపెరుగక తిరిగినవాడు. మెదక్ జిల్లా రచయితల చరిత్రను అనేక వ్యాసాల్లో ఆవిష్కరించినవాడు. రాసే ప్రతి మాటను ఆచి తూచి అందంగా రాసినవాడు.

ఎన్నో సార్లు ఉద్యోగం పర్మనెంట్ అవుతున్నట్లే అనిపించి…కాకపోయినా పట్టువదలని వాడు. ఎందరో పరిశోధక విద్యార్థులకు మార్గదర్శనం చేసినవాడు.

వేల సాహితీ కార్యక్రమాలను ఒంటి చేత్తో నిర్వహించినవాడు. లెక్కలేనన్ని వేదికలమీద గంగా ప్రవాహంలా సాహిత్య చర్చ చేసినవాడు. ఏ రిఫరెన్స్ పుస్తకాలు చూడకుండా గంటలు గంటలు ఆకట్టుకునే రీతిలో ఉపన్యసించగల వక్త.

నా చేత తెలుగులోనో, జర్నలిజంలోనో పి హెచ్ డి చేయించాలని ఎంతగానో ఆశపడ్డవాడు. నేను ఇప్పటికి నాలుగు సార్లు పి హెచ్ డి ఎంట్రన్స్ ఫెయిలయ్యను. మీ వ్యాపారం వదిలి ఒక్క నెల నేను చెప్పినట్లు చదవండి…మీకెందుకు పి హెచ్ డి అడ్మిషన్ రాదో? నేను చూస్తాను అని నన్ను ప్రోత్సహించినవాడు.

90 లలో సబ్ ఎడిటర్ గా నేను పని చేస్తున్నప్పుడు జీతం డబ్బులు సరిపోయేవి కాదు. ఇరవయ్యో తేదీ నాటికి పది రూపాయలు కూడా మిగలక ఉదయం టిఫిన్ మానేసి…ఒక ఇరానీ చాయ్ తో సరిపెట్టుకునే రోజుల్లో నైట్ డ్యూటీలు కాబట్టి…పగలు నాలుగు గంటలు పాఠాలు చెప్పండి అని…నన్ను తీసుకెళ్లి పార్ట్ టైమ్ తెలుగు, సంస్కృతం లెక్చరర్ గా చేసి…ఆర్థికంగా నాకు సాయం చేసినవాడు. సిటీ బస్ పాస్, మెస్ కార్డు నెల మొత్తానికి ముందే కొని ఉంటాము కాబట్టి భోజనానికి ఇబ్బంది ఉండేది కాదు.

తోడ్పాటు ఇచ్చిన గుమ్మన్నగారు….  నెమ్మదిగా జీవితంలో స్థిరపడిన తరువాత మరింతగా సాహితీ సముద్రాన్ని ఈదినవాడు. కూతురు, కొడుకు చక్కగా చదువుకుని స్థిరపడ్డారు. పెద్ద పెద్ద ఆశలు లేనివాడు. ఉన్నదానితో సర్దుకుపోయినవాడు. నిగర్వి.

కాలానికి ఎదురీది నిలిచినవాడు. కలకాలం గుర్తుంచుకోదగ్గ సాహితీ సేద్యం చేసినవాడు. కానీ కాలానికి కన్ను కుట్టినట్లుంది. లేక తనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని, దక్కిన ప్రొఫెసర్ పోస్టును కూడా యూనివర్సిటీ రాజకీయాలు దక్కకుండా చేశాయని ఎంతగా కుమిలిపోయాడో! ఏమో! మౌనంగా వెళ్లిపోయాడు.

సున్నిత మనస్కులను కాపాడుకోలేకపోతే రాతి గుండెలే మిగిలి…మన బతుకులే బండబారిపోతాయి. హైదరాబాద్ ఇరానీ హోటళ్లలో కప్పు, సాసర్ లో వన్ బై టీ లను తాగుతూ, పూరీలాంటి ఒక లుక్ మీ ని చీల్చి పంచుకుని తింటూ, ఉస్మానియా బిస్కట్ ముక్కను టీలో అద్దుకుని తింటూ గుమ్మన్నతో గడిపిన జ్ఞాపకాలన్నీ అక్షయమయిన అక్షరాలే. పదాలే. వాక్యాలే. పద్యాలే. పాటలే. విమర్శలే. అతడు తుది శ్వాస వరకు సాహిత్యాన్నే తిని, తాగి, పీల్చినవాడు.

ఇక నా పి హెచ్ డి ఎంట్రన్స్ ను గట్టెక్కించే గుమ్మన్నలు దొరుకుతారా?

సాహితీ మిత్రుడి ఆకస్మిక మృతికి కన్నీటి నివాళి.

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్