Tuesday, December 3, 2024
HomeTrending Newsఅమెరికా పాఠశాలలో కాల్పులు... నలుగురు మృతి

అమెరికా పాఠశాలలో కాల్పులు… నలుగురు మృతి

అమెరికాలో తుపాకుల మోత కొనసాగుతోంది. ఓ విద్యార్థి దురాగతానికి అమాయకులు బలయ్యారు. జార్జియా సమీపంలోని అపాలాచీ పాఠశాలలో బుధవారం జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో తొమ్మిది గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు అనుమానిత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బారో కౌంటీ షెరిఫ్‌ కార్యాలయం తెలిపిన వవరాల ప్రకారం.. ఉదయం 10.30 గంటలకు ముందు అపాలాచీ హై స్కూల్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

కాల్పులకు కారణాలు తెలియరాలేదు. అనుమానితుడిని 14 సంవత్సరాల విద్యార్థి కోల్ట్‌ గ్రేగా గుర్తించారు. అతనిపై అభియోగాలను నమోదు చేసి విచారణ జరుపతున్నట్లు జార్జియా బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌ క్రిస్‌ హోసే తెలిపారు. ఘటనపై జార్జియా గవర్నర్‌ బ్రియాన్‌ కెంప్‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర, భాగస్వామ్య పక్షాలతో కలిసి పని చేస్తున్నట్లు గవర్నర్‌ బ్రియాన్‌ కెంప్‌ తెలిపారు. జార్జియా విద్యాశాఖ అధికారుల ప్రకారం అపాలాచీ పాఠశాలలో సుమారు 1,900 మంది విద్యార్థులు ఉన్నారు. బారో కౌంటీలో రెండో పెద్ద ప్రభుత్వ పాఠశాల కాగా… ఈ స్కూల్‌ను 2000 సంవత్సరంలో ప్రారంభించారు.  బారో కౌంటీ దక్షిణ అంచున ఉన్న అపాలాచీ నది పేరును ఈ స్కూల్‌కు పెట్టారు.

అపాలాచీ పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకొని మరింత ప్రాణనష్టం నివారించిన భద్రతా సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సైతం కాల్పుల ఘటనపై విచారం వ్యక్తం చేశారు. తుపాకీ సంస్కృతిని అంతం చేయాలని పిలుపునిచ్చారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్