Wednesday, June 26, 2024
HomeTrending Newsమళ్ళీ రాజుకుంటున్న పశ్చిమాసియా

మళ్ళీ రాజుకుంటున్న పశ్చిమాసియా

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారేలా లేవు. హమాస్ దాడితో శివాలెత్తిన ఇజ్రాయల్ ఉగ్రవాదులను తుదముట్టించేందుకు గాజాను జల్లెడ పడుతోంది. గత ఎనిమిది నెలలుగా గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌ ఆణువణువూ గాలిస్తోంది. హమాస్ చేర నుంచి మొత్తం బందీలను విడిపించటం… ఉగ్రవాదాన్ని రూపుమాపటమే లక్ష్యంగా.. కొద్దిరోజులుగా రఫా వైపు యూదు బలగాలు కదిలాయి.

అంతర్జాతీయ న్యాయస్థానం రెండు రోజుల క్రితం కీలక తీర్పు వెలువరించింది. రఫా పట్టణంపై సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాలను ఇజ్రాయల్ ప్రధాని నెతన్యాహూ ఏమాత్రం పట్టించుకోలేదు. బందీల విడుదల, హమాస్ అంతం, స్వదేశ రక్షణ తమకు ప్రథమ కర్తవ్యాలని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో హామాస్ కు మొదటి నుంచి వెన్ను దన్నుగా ఉన్న హిజ్భోల్లా ఉగ్రవాద సంస్థ ఇజ్రాయల్ కు తాజాగా వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్‌ సర్‌ప్రైజ్‌లకు సిద్ధంగా ఉండాలని లెబనాన్‌ కేంద్రంగా పనిచేసే హెజ్బొలా ప్రధాన కార్యదర్శి హసన్ నస్రల్లా హెచ్చరిక చేశారు. ‘మా ప్రతిఘటన నుంచి మీరు సర్‌ప్రైజ్‌ను ఊహించొచ్చు’ అని ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇరాన్‌ మద్దతు గల హెజ్బొలా గ్రూపు ఆకస్మిక దాడులకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

ఈ తరుణంలో ఆదివారం హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై రాకెట్‌ దాడులు చేశారు. గాజా భూభాగం నుంచి హమాస్‌ బలగాలు రాకెట్ల వర్షం కురిపించడంతో రాజధాని టెల్‌ అవివ్‌ నగరంలో ఎయిర్‌ రైడ్‌ సైరన్లు వినిపించాయి. ఈ ఏడాది జనవరి తర్వాత హమాస్‌ దీర్ఘశ్రేణి రాకెట్‌ దాడులు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గాజా స్ట్రిప్ నుంచే భారీ క్షిపణులను లాంచ్‌ చేసినట్లు హమాస్‌కు చెందిన అల్-అక్సా టీవీ పేర్కొంది.

తాజా రాకెట్‌ దాడులకు ఇజ్రాయెల్‌ సైన్యం స్పందించింది. రఫా వైపు నుంచి వచ్చిన రాకెట్లు ఇజ్రాయెల్‌ భూభాగంలోకి వచ్చాయని, వాటిని అడ్డుకొన్నామని పేర్కొన్నది. దక్షిణ గాజాలోని రఫా ప్రాంతం నుంచి హమాస్ కనీసం ఎనిమిది రాకెట్లను ప్రయోగించినట్లు బీబీసీ తెలిపింది. దాడిలో ఇజ్రాయెల్‌కు ఎలాంటి నష్టం జరిగిందో వెల్లడి కాలేదు.

ఏడు నెలలుగా గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తున్నప్పటికీ.. యూదులను ప్రతిఘటించేందుకు రాకెట్లను ప్రయోగించే సత్తా హమాస్ కు ఉన్నదని  తాజా దాడితో రుజువైంది. హమాస్ దాడిని తిప్పికొడుతూనే ఇజ్రాయల్ బలగాలు రఫాపై రాకెట్ల వర్షం కురిపించాయి. దీంతో సుమారు 35 మంది మృతి చెందారు. మృతుల్లో ఎంతమంది ఉగ్రవాదులు తెలియరాలేదు. మరోవైపు హమాస్‌ మిలిటెంట్ల వద్ద బందీలుగా ఉన్న వారిని వెనక్కు తీసుకురావాలని ఇజ్రాయెల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ టెల్‌ అవివ్‌లో ప్రజలు ఆందోళనలు చేశారు.

అంతర్జాతీయంగా ఇజ్రాయల్ పై ఒత్తిళ్ళు వస్తోన్న సమయంలో హమాస్ దాడులు చేయటం పాలస్తీనా మద్దతుదారులకు కొరుకుడు పడని అంశం. ఇదే అదునుగా ఇజ్రాయల్ మరింత దూకుడుగా హమాస్ పై విరుచుకుపడుతుందని విశ్లేషణలు జరుగుతున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్