1.3 C
New York
Thursday, December 7, 2023

Buy now

హంపీ వైభవం-2

Talking Stones:
“శిలలు ద్రవించి ఏడ్చినవి జీర్ణములైనవి తుంగభద్రలో
పల గుడిగోపురంబులు సభాస్థలులైనవి కొండముచ్చు గుం
పులకు చరిత్రలో మునిగిపోయిన దాంధ్రవసుంధరాధిపో
జ్వల విజయ ప్రతాప రభసంబొక స్వప్న కథా విశేషమై”

తెలుగు పద్య ప్రేమికులకు బాగా పరిచయమయిన, ఎంతో ఇష్టమయిన పద్యమిది. ఈ పద్యం చదివి, విని, అర్థం చేసుకుని ఇప్పటి హంపీ శిథిలాల్లో ఆకాశం అంచులు తాకిన అప్పటి విజయనగర వైభవాన్ని ఊహించుకున్న వేనవేల మందిలో నేనూ ఒకడిని.

కావ్యం ఎప్పుడూ శ్రీకరంగా, మంగళంతో ప్రారంభం కావాలన్నది ఆదర్శం. కొడాలి వేంకట సుబ్బారావుకు ఈ విషయం తెలియక కాదు. ఆయన హంపీ క్షేత్రం ప్రారంభమే ‘నేటి స్థితి’ అన్న ఉప శీర్షికతో ప్రారంభించారు. ఎలాంటి హంపీ…ఎలా మహమ్మదీయ సేనల దాడుల్లో తలలు పగిలి, చేతులు కాళ్లు విరిగి, గర్భగుళ్లలో మూలవిరాట్టులు చీలి…గోపురాలు కూలి…ధూప దీప నైవేద్యాలు కరువై…తన గతమేమిటో తానే మరిచిపోయేంతగా దుమ్ము ధూళిని కప్పేసుకున్న స్థితిని చూసి కొడాలి తట్టుకోలేకపోయారు. కొన్ని తరాలపాటు పేరుకుపోయిన ఆ దుమ్ము దులిపారు. ఆ ధూళిలో నిద్రాహారాలు మాని తిరిగారు. ఆ ధూళినే నెత్తిన చల్లుకుని, విభూతిగా నుదుటన పెట్టుకుని, కలంలో నింపుకుని కలకాలం నిలిచి ఉండేలా హంపీ రాతి స్తంభాల రాగాలకు సరితూగగల సాహిత్యం సృష్టించారు.

Hampi

మామూలు కంటితో చూస్తే అవి రాళ్లు, స్తంభాలు, మంటపాలు, అరుగులు, కొండలు, గుట్టలు. కొడాలి కంటితో చూస్తే…దేవుడు ఒళ్లంతా ఎందుకు కళ్లివ్వలేదని బాధపడతాం. అక్కడ కళ్లు ఎటు తిప్పితే అటు కొండలు, గుట్టలే. వాటిమీద గుడులు, గోపురాలు, మంటపాలే. అందుకే “నేటి స్థితి” తరువాత రెండో ఉప శీర్షిక “కొండలు” అయ్యింది.

ఒక కొండకు ఒక కొండ కొక్కెం తగిలించుకుని నిలుచున్నాయి. ఒకదానికొకటి ఎలా లంకె పెట్టుకున్నాయో ఊహించలేం. ప్రేమతో తల్లి తన పాపను ఒడిలో పెట్టుకుని లాలిస్తున్నట్లు…పెద్ద కొండ చిన్న కొండను ఒడిలో పెట్టుకుని ముద్దు చేస్తోంది. కొండలు పరస్పరం పోటీలు పడి పెరిగినట్లు ఉన్నాయి. ఒంటికాలి ముని వేలుమీద తపస్సు చేసే మౌన మునిలా పట్టుతప్పకుండా నిలిచి ఉన్నాయి. ఇక్కడ రాతి కొండలు కూడా మనుషుల చేష్టలతో మాట్లాడుతున్నాయి.

ఇక్కడ రాతికి సహజసిద్ధంగా నునుపును ప్రకృతి ప్రసాదించింది. ఇంతింత రాతి బండలను అంతంత పైకి పేరుస్తూ ఎలా నిర్మించారో? అప్పట్లో ఇప్పటిలా క్రేన్లు, జె సీ బి లు లేవు. ఇసుకను వాలుగా పోస్తూ ఏనుగులతో రాళ్లను పైకి మోయించి…బిగించిన వారి నిర్మాణ కౌశలాన్ని వర్ణించడానికి మాటలు చాలవు.

ఒక కొండను తొలిస్తే రథం.
ఒక కొండను ఊపితే ఉయ్యాల.
ఒక కొండను తవ్వితే బావి.
పైకప్పుకు రాతి దూలాలు.
మహా ద్వారానికి రాతి తలుపులు.
తినడానికి రాతి కంచాలు. వేడి వేడి అన్నం అందులో వడ్డిస్తే ఐరన్ రిచ్ ఫుడ్ కావడానికి వీలుగా ఇనుప లోహం ఉన్న రాతినే కంచాలకు వాడడం. ఆ కంచాల మీద వేలి గోటితో మీటితే రాగాలు పలకడం.

వీణకు తీగెలు బిగించి గోటి మీటుతో రాగాలు పలికించడం విన్నాం. కన్నాం. వయోలిన్ తీగ మీద తీగ రాపాడితే రాగం విన్నాం. హంపీ విఠలాలయం నాట్య మండపం రాతి స్తంభాలకు స్వరాలు పలుకుతాయి. గంధపు చెక్కలతో ఒక్కో స్తంభాన్ని లయబద్దంగా సుతారంగా కొడితే రాగాలు పలుకుతాయి.

వీణ తీగల్లో ఏది ఏ శ్రుతి పలకాలో నిర్ణయించి దాని ప్రకారం తీగ మందాన్ని ఎంపిక చేస్తారు. అలా ఇక్కడ రాతి స్తంభంలో చెక్కిన చిన్న చిన్న స్తంభాలే పలికే తీగలు. తబలా, డోలు, ఘటం…ఇలా ఏ శబ్దం ఏ స్తంభంలో వస్తుందో ఆ స్తంభం కిందే ఆ వాద్యాన్ని కూడా చెక్కారు. ప్రపంచంలో ఎప్పుడయినా ఇంకెక్కడయినా ఇలాంటి రాళ్లు నోళ్లు విప్పి పలుకుతూ నాట్యమాడే నాట్యమండపం ఒకటి ఉంటుందా? ఇక్కడి ఏకశిలారథం ఏ శిలా యుగంలో అయినా ఉందా?

రాతి గోడల నిండా రామాయణం కథా శిల్ప విన్యాసాలు. యుద్ధాలు. ప్రకృతి రాతిలోకి దూరి హొయలు పోయింది. రాతి కాలువ. ఫాల్స్ సీలింగ్ లా రాతి పైకప్పు పద్మం. విజయనగరంలో రాయి శిల్పి చేతిలో మైనం ముద్ద.

అవి-
మాటలు నేర్చిన రాళ్లు.
పాటలు పేర్చిన రాళ్లు.
కళ్లు విచ్చిన రాళ్లు.
కళలు వచ్చిన రాళ్లు.
కవులు మెచ్చిన రాళ్లు.
కలగా మిగిలిన రాళ్లు.

తమకు ఉలితో చక్కిలిగింతలు పెట్టి ఆయుస్సు ప్రాణం పోసిన విజయనగర ప్రభువులు లేరని విలపిస్తున్న రాళ్లు. వారితో పాటు దివికేగలేక హంపీ మట్టి దిబ్బల్లో కాళ్లు ఇరుక్కుని గుండెలు బాదుకుంటున్న రాళ్లు.  తెలుగు- కన్నడ సాహితీ సమరాంగణ సార్వభౌముడు, కన్నడ రాజ్య రమా రమణుడు, ఆంధ్రభోజుడు, మురురాయర గండడు, దక్షిణాపథ సాంస్కృతిక హిమవన్నగం శ్రీకృష్ణదేవరాయలును భుజాన మోసి…ఇప్పుడు కోతులను, కొండ ముచ్చులను భుజాన మోస్తూ కుమిలి కుమిలి ఏడుస్తున్న రాళ్లు.

ఆ ఏడుపు కొడాలి విన్నారు.
అందుకే అన్నారు-
“శిలలు ద్రవించి ఏడ్చినవి”
అని.

రేపు- హంపీ వైభవం-3
“తుంగభద్రా తరంగం”

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : 

హంపీ వైభవం-1

RELATED ARTICLES

Most Popular

న్యూస్