ఆ కోయిల తీయని గొంతులోనుండి ఉబికివచ్చిన పాటను తలచుకుంటూ…
ఈ జాజి పూరెమ్మలో చిందిన తేనియలను చప్పరిస్తూ…
ఆ నవలావణ్య వర్ణాలను ప్రకృతికి అద్దుతూ…
బడలికతో అలసిన పుడమికి గిలిగింతలు పెట్టడానికి రా! ఉగాది లక్ష్మీ! రా!
కాలశిల్పం ఘన సామ్రాజ్యాలను చెక్కింది. రాజులను తీర్చి దిద్దింది. రాజులను, రాజ్యాలను మార్చింది. వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పుడొకరూ కనపడరు. ఉగాది సముజ్వల కళా స్వరూప లక్ష్మి వైభవం మాత్రం చెక్కు చెదరలేదు. ఉగాది లక్ష్మికి మాత్రం వార్ధక్యం రాలేదు. రాబోదు.
వలపులు గుమ్మరించి, రసభావ పరంపరలను దోసిట పోసేలా సుమనోజ్ఞ వసంతానికి తెలుగు సోయగాలు అద్దే ఓ ఉగాది సుందరీ! నీకు శతకోటి నమస్సులు.
ఈ ఆకురాలిన చెట్టు చిన్నారి వన్నెల చిగురుటాకులతో చిగురిస్తోంది.
ఈ దారిలో ఎండిపోయిన గడ్డి మొలక పచ్చని పట్టు బట్ట కట్టుకుంటోంది.
ఈ పువ్వు గర్భం మళ్ళీ గాలికి గంధం పూస్తోంది.
ఈ తేనెటీగ మళ్ళీ మకరందంతో మత్తెక్కి జుమ్మని కొమ్మకొమ్మమీద నాట్యం చేస్తోంది.
ఎండిన మోడులు మళ్ళీ మోసులెత్తుతున్నాయి.
నీ రాకతో ప్రకృతి కనువిందుగా మారింది ఉగాది లక్ష్మీ!
ఓ ఉగాది లక్ష్మీ!
తెలుగు జాతి పొలాల్లో ద్వేష బీజాలను ఏరిపారేయ్!
తెలుగునాట శాంతి సౌభాగ్యాల విత్తులు చల్లు!
తెలుగు లోగిళ్ళలోకి సమతారసార్ద్ర వాసంతలక్ష్మిని తీసుకుని రా!
విశ్వతోముఖమైన తెలుగు వాఙ్మయదీపాన్ని వెలిగించు!
ఓ ఉగాది సుందరీ!
కళకళలాడే నీ ప్రకృతిని చూడడమే లోకానికి శుభసూచకం. మనసులకు హాయి. నీ లేతనవ్వుల తొలకరిలో తెలుగు పండి…పరవశిస్తోంది.
(1959లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉగాది కవి సమ్మేళనంలో ఎస్. టి. జ్ఞానాందకవి రాసి…పాడి వినిపించిన ఉగాది పద్యాలకు సరళానువాదమిది. ఈ పద్యాలు 1966 లో “విజయాభిషేకం” గ్రంథంలో మొదట ప్రచురణ కాగా…1989లో తెలుగు విశ్వవిద్యాలయం “ఆంధ్రప్రశస్తి”లో మళ్ళీ ప్రచురించింది.
సురగాలి తిమోతి జ్ఞానాందకవి విజయనగరం దగ్గర పెదపెంకిలో 1922లో పుట్టారు. 2011లో కన్నుమూశారు. కడు పేదరికం నుండి పద్మశ్రీ దాకా ఎదిగారు. అనేక పద్యకావ్యాలు రాశారు. అనేక అవార్డులు పొందారు. పదేళ్ళ వయసులో కూలీ పనులు చేస్తూ కవిత్వం రాయడం మొదలుపెట్టిన ఆయన అభినవ శ్రీనాథుడిగా పేరు తెచ్చుకున్నారు)
జ్ఞానాందకవి పద్యాల లింక్:-