తెలుగులో పాత సినిమాలు చూసే అలవాటు ఉన్నవారికి హరనాథ్ అంటే ఎవరన్నది పరిచయం చేయవలసిన అవసరం లేదు. 1960 ప్రాంతంలో కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి సినిమాల్లో అవకాశాల కోసం చెన్నై రైలు ఎక్కినవారిలో ఆయన ఒకరు. మంచి ఒడ్డూ పొడుగు ఉండటం .. అందగాడు కావడం .. ఆపై శ్రీమంతుడు కావడంతో ఆయన ఆడింది ఆటగా .. పాడింది పాటగా సాగింది. ఆయనకంటూ ఒక బాడీ లాంగ్వేజ్ … స్టైల్ ఉండేవి. అవి తెచ్చిపెట్టుకున్నవి కావు. తాను బయట ఎలా ఉంటాడో అలాగే కెమెరా ముందు ఉండేవారు.
ఈ కారణంగానే హరనాథ్ సినిమాల్లోకి అడుగుపెట్టడానికి పెద్దగా కష్టపడలేదు. అలా అడుగు పెట్టిన తరువాత ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఆయన మొదటి సినిమా ‘మా ఇంటి మహాలక్ష్మీ’ .. హైదరాబాద్ సారథి స్టూడియోలో షూటింగు జరుపుకున్న మొదటి తెలుగు సినిమా కావడం విశేషం. ఆ తరువాత ఆయన హీరోగా వరుస సినిమాలు చేస్తూ వెళ్లారు. హరనాథ్ హైటు .. ఆయన వాకింగ్ స్టైల్ .. ఆయన సిగరెట్ తాగే స్టైల్ గురించి అంతా చెప్పుకునేవారు. ఇక పాటల్లో కూడా ఆయన అంతే డీసెంట్ గా కనిపించేవారు.
హరనాథ్ లోని ఈ ప్రత్యేకతలే ఆయనకి రొమాంటిక్ హీరో అనే పేరును తెచ్చిపెట్టాయి. ఎన్టీఆర్ .. ఏ ఎన్నార్ .. కృష్ణ వంటి హీరోలు ఒక రేంజ్ లో దూసుకుపోతున్న సమయంలో ఎంట్రీ ఇవ్వడం .. నిలదొక్కుకోవడం అంత తేలికైన విషయమేం కాదు. కానీ ఆ ఘనతను హరనాథ్ సాధించారు. తన తరువాత కృష్ణుడు .. రాముడు .. విష్ణువు వంటి పాత్రలను వేయడానికి తగినవాడు హరనాథ్ అని ఎన్టీఆర్ భావించడం విశేషం. ఆ తరహా పాత్రలను ఆయనతో వేయించడం మరో విశేషం. హరనాథ్ తన కెరియర్ పై పెద్దగా దృష్టి పెట్టకపోవడం శోభన్ బాబుకి కలిసొచ్చిందనే వారు లేకపోలేదు.
Also Read : కృష్ణ చేతుల మీదుగా హరనాథ్ జీవిత చరిత్ర