Thursday, March 12, 2026
HomeTrending Newsగన్ పార్క్ వద్ద హరీష్ రావు.. సిఎం రేవంత్ ప్రతి సవాల్

గన్ పార్క్ వద్ద హరీష్ రావు.. సిఎం రేవంత్ ప్రతి సవాల్

కాంగ్రెస్ 6 గ్యారంటీలు 13 హామీల అమలు కోసం మాజీ మంత్రి హరీశ్ రావు తన రాజీనామా పత్రంతో గన్ పార్కుకు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీలు ఆగస్ట్ 15లోగా అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. హామీలు అమలైతే ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయనని చెప్పారు.

అవ్వాతాతలకు 4 వేల పింఛన్ రావాలని, వడ్లకు మొక్కజొన్నకు 500 బోనస్ ఇవ్వాలని, రైతుబంధు 15 వేలు వేయాలని డిమాండ్ చేశారు. ఇవేవీ కొత్త డిమాండ్లు కావని కాంగ్రెస్ నేతలే స్వయంగా బాండు పేపర్లు రాసిచ్చినవన్నారు. వంద రోజుల్లోగా  చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారని గుర్తు చేశారు. ‘‘ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని సోనియాగాంధీ రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. డిసెంబర్ 9న రుణమాఫీపై తొలి సంతకం చేస్తామని మాట తప్పినందుకు క్షమాపణ చెప్పాలి. ఆగస్ట్ 15 తేదీ లోగా హామీలు అమలు చేస్తే సంతోషం. నా ఒక్కడి ఎమ్మెల్యే పదవికంటే 2 లక్షల రుణమాఫీ జరగడం ముఖ్యం. నేను ఐదేళ్లు పదవిలో లేకపోయినా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే అంతకంటే సంతోషమేముంది’’ అని హరీష్ రావు అన్నారు. స్పీకర్ ఫార్మాట్లోనూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, రాజీనామా పత్రాన్ని తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టుల చేతుల్లో పెడుతున్నానని చెప్పారు.

కాంగ్రెస్ హామీలు నిజమైతే, రేవంత్ భేషజం వల్ల గన్ పార్కుకు రావడానికి ఇష్టం లేకపోతే ఆయన పీఏ ద్వారా లేకపోతే సిబ్బంది ద్వారా పంపండి. స్తూపం వద్ద పూలు పెట్టడానికి ఆయనకు ఇష్టం లేకపోవచ్చు. రేవంత్ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నా. జర్నలిస్టుల చేతుల్లో రాజీనామా లేఖ పెట్టి వెళ్తున్నాను. రేవంత్ హామీలను అమలు చేస్తే నా లేఖను వాళ్లు స్పీకర్‌కు ఇస్తారు. ఆయన ఇస్తారో ఇవ్వరో ఆయన విజ్ఞతకు వదిలిలేస్తున్నాను. రేవంత్ రాజీనామా పత్రాన్ని ఇవ్వకపోతే దేవుళ్ల పేర్ల మీద మళ్లీ మోసం చేస్తారని భావించాల్సి ఉంటుందని హరీష్ రావు అన్నారు.

హరీష్ రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మోసం చేయాలనుకునే ప్రతీసారి హరీష్ కు అమరవీరుల స్థూపం గుర్తొస్తదని మండిపడ్డారు. హారీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం అన్నారు. ఇన్నాళ్లు ఎప్పుడైనా అమరుల స్థూపం దగ్గరకు వెళ్లారా? చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటుండని, రాజీనామా లేఖ అలా ఉండదని హితవు పలికారు.

హరీష్ తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారని ఎద్దేవా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదని తెలిసినా హరీష్ రావు తెలివి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. హరీష్ తెలివి మోకాళ్లలో కాదు.. అరికాళ్లలోకి జారినట్టుందన్నారు. హరీష్..ఇప్పటికీ చెబుతున్నా.. నీ సవాల్ ను ఖచ్చితంగా స్వీకరిస్తున్నామని సిఎం స్పష్టం చేశారు. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతాం…నీ రాజీనామా రెడీగా పెట్టుకో ప్రతి సవాల్ చేశారు.

-దేశవేని భాస్కర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular