Sunday, May 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంరా రా...ఇటు రా రా ..

రా రా…ఇటు రా రా ..

తమిళనాడు యాత్రలో అనుకున్న ప్రదేశాలు కాకుండా అటు వైపు నుంచి పిలుపు వచ్చినట్లు వెళ్ళిన ముఖ్యమైన అరుదైన ప్రదేశాల్లో తంజావూరు చెంతనున్న త్యాగరాజస్వామి జీవసమాధి పొందిన తిరువాయూర్ ఒకటి.

తంజావూరు బృహదీశ్వరాలయం దర్శించడమే మహద్భాగ్యం అని తనివితీరా చూసి ఆనందించాం. అక్కడ ఉన్న పెద్ద నందీశ్వరుడు, మహా శివలింగానికి భళాభళీ… ఇక ఈ క్షేత్రం నిర్మించడంతో ఎన్నో అవాంతరాలు ఎదుర్కున్న 2వ కుళుత్తుంగ చోళుడు తన గురువు ను కలిసి ప్రార్థించాడు. అప్పుడు కరువురార్ మునిని చోళ రాజు వెంట పంపి ఇతడు అన్ని పరిష్కరిస్తాడని ఊరడించి పంపుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో సరిగ్గా ప్రధాన గుడి వెనుక ఈ మహర్షి విగ్రహం ఉంటుంది. గుడి నిర్మాణంలో  తప్పులను కరవురార్ మహర్షి సరిచేస్తారు. అంతేకాదు ఆ ప్రాంతంలో ప్రజలందరికీ వైద్యం కూడా అందిస్తారు. దానితో ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చి బృహదీశ్వర ఆలయ నిర్మాణంలో తమ చేయూతనిచ్చి నిర్మాణం పూర్తిచేస్తారు. విశాలమైన ఈ ఆలయాన్ని చూస్తే గజిని మహ్మద్ దండయాత్రలు గుర్తుకొస్తాయి. ఒకసారా.‌‌..రెండు సార్లా 18 సార్లు… దండయాత్రలు చేసి మొత్తానికి గెలిచి… అత్యంత విలువైన సంపదలను తరలించుకు పోయాడు.

కరువురార్ మహర్షి ముందు ప్రశాంతంగా కూర్చుని రెండు నిమిషాలు ధ్యానం చేయడమే ఆయనకు సమర్పించే పూజ అని చెప్పడంతో ఆ పని చేశాను. అప్పటికే ఎండలు మండుతుండటంతో కాళ్ళు కాలిపోతున్నాయి. ఎవరూ అక్కడికి రాలేమన్నారు. అక్కడ ఏముందో చూడాలని నేనే కాళ్ళు అంటుకుపోతున్నా వెళ్ళి చూస్తే ఇలా ఓ మహనీయుని కథ తెలిసింది. ఎవరూ లేకపోవడంతో రెండు నిమిషాలు మౌనంగా ధ్యానం చేసుకుని ఆ మహర్షికి నివాళులు అర్పించి వచ్చాను. ఇంతలో నేను రావడం లేదని పిల్లలు రానే వచ్చారు. వాళ్ళ పితృభక్తి రప్పించినా ఆ మహర్షి ఆశీర్వచనాలు అందుకోవడం సంతోషం. ఇక ఇక్కడి వారాహి అమ్మవారి ఆలయం అత్యంత దర్శనీయం. ఆ వైభవం అనిర్వచనీయం. మిట్ట మధ్యాహ్నం ఎండలో బృహదీశ్వర ఆలయ సందర్శనం పూర్తి చేసి తిరువాయూర్ చేరుకున్నాం.

తెలుగు వారి సంగీత ప్రతిభను ప్రపంచమంతా చాటిన సంగీత వాచస్పతి, నిధి సుఖమా… రాముని సన్నిధి సుఖమా అంటూ తన సంకీర్తనలతో ఆ శ్రీరామచంద్ర మూర్తి సాక్షాత్కారాన్ని సాధించిన నాదోపాసకులు, నాదబ్రహ్మ శ్రీ త్యాగరాజ స్వామి. ఆయన జీవితం ధన్యం. పుణ్యం. అజరామరం.

గుడివాడలో త్యాగరాజ వైభవ ప్రకాశ సభ ప్రతి యేటా ఉపద్రష్ట బ్రాహ్మణ సత్రంలో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించటం ఆనవాయితీ. ఉపద్రష్ట రామస్వామి శాస్త్రి, పోపూరి శ్యాం సుందర్ మరికొందరు మిత్రులు చాలా నిబద్ధతతో,  భక్తితో చేసే ఈ ఆరాధనోత్సవాలు గుడివాడ ఆధ్యాత్మిక ప్రయాణంలో అంతెరుగని మార్థవంగా చెప్పవచ్చు.

మనం జీవించి ఉన్న ఈ కాలంలో మన ముందు మన వలెనే జీవించి భగవత్ సాక్షాత్కారం లభిస్తుందని నిరూపించిన త్యాగరాజస్వామి, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్, అన్నమయ్య, రామదాసు, తులసీదాసు, కబీరు , తుకారాం వంటి నాదోపాసకులను గమనిస్తే మన మనసును లగ్నం చేసి తదేక దీక్షతో ఒక లక్ష్యం మేరకు ఆర్తి, విశ్వాసం, సర్వశ్య శరణాగతితో రామచంద్రుని వంటి దైవం లేదని, వేంకటేశ్వరుని వంటి గానం లేదని, కామాక్షి అమ్మవారి వంటి కృప సాధ్యమేనని లోలోతు భక్తితో తపిస్తే, ధ్యాన తపస్సు చేస్తే వాస్తవ ఫలితం అవగతమవుతుంది.

త్యాగరాజస్వామి వారి జీవ సమాధి వద్ద కూర్చుని మనస్ఫూర్తిగా వారిపై మా గురుదేవులు బోధించిన కీర్తనలు తనివితీరా పాడుకున్నాను. ఆయన సన్నిధిలో నా గీతాలు శృతి లయబద్ధంగా లేకుంటే క్షమించమని చెంపలు వేసుకున్నాను. త్యాగరాజస్వామి కొలిచిన సీతారాముల విగ్రహాలు దర్శించుకున్న తర్వాత నారద తుంబురు మహర్షులను రామాయణ సన్నివేశాల శిలాజ రూపాలను , గోడలపై తాపడం చేసిన త్యాగరాజు కీర్తనలను తెలుగులోనే… దర్శించి పరవశమయ్యాను..

ఎక్కడ గుడివాడ ఎక్కడి తిరువాయూర్.. కానీ ఇక్కడ చోడవరపు విజయకుమార్, ఉపద్రష్ట కుటుంబాలు త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలు చేయడం వల్లనే ఆయన గొప్పదనం.. సంగీత ప్రపంచంలో వారి స్థానం పరిచయమైంది. కళాతపస్వి కె విశ్వనాథ్ నిర్మించిన అనేక సంగీత ప్రధానమైన చిత్రాలు త్యాగరాజస్వామి ఘనతను తెలిపాయి. గురువులు ఆలపించిన గీతాలు కపర్దిగా రాయడం వల్లనే….

ఇటు రా రా అబ్బాయ్… నేను ఇక్కడే జీవ సమాధి స్థితి లో హాయిగా ఉన్నాను……అని పిలిచి మరీ దర్శనం ఇచ్చారు త్యాగరాజస్వామి. ఈ విషయం నేను కాదు… కారులో నన్ను కుటుంబ సమేతంగా తీసుకుని వెళ్లిన మిత్రులు చలసాని బంకించంద్ అన్నమాట.. ఆయన 35 ఏళ్ళు మద్రాసులో ఉన్నా…. తంజావూరు ఎన్నో సార్లు తిరిగినా ఇక్కడ ఇంత గొప్ప వ్యక్తి జ్ఞాపకం ఉందని తెలియదని….మీ వల్ల మేము ధన్యులమయ్యాం అని అంటుంటే సంగీత భక్తి రస ప్రవాహంలో చక్రవర్తుల మాట కూడా లెక్క చేయకుండా శ్రీరామ నామమే సర్వ లోకములు తరించే దైవ ధ్యానమని నిరూపించిన త్యాగరాజస్వామి స్మృతిని ప్రతియేటా ఆయన పంచరత్న కీర్తనలు ఆలపించే ఉత్సవం సహా జరుపుతున్న మహనీయుల పుణ్యమని… త్యాగరాజస్వామి జయంతి, వర్థంతి జరిపే వారి ఘనతనీ చెప్పాను..మా పిల్లలు బాగా సంతోషించారు.

నేను ఆ వీధి నుంచి కారులో వెనక్కి వస్తున్నా…
“ఎందరో మహానుభావులు అందరికీ వందనములు…”
“బంటు రీతి కొలవనీయవయ్యా రామా
తుంటవింటివాని మొదలైన మదాదులంగొట్టి నేలగూలజేయు నిజ
రోమాంచమనే ఘనకంచుకం రామభక్తుడనే ముద్రబిళ్ళయు
రామనామమనే వరఖడ్గమిని రాజిల్లునయ్యా త్యాగరాజునికే…””

ఎవరో…నా చెవుల్లో ఆలపిస్తూ హృదయ వేదికపై శ్వాస నిశ్వాసాలకి సుగంధ పరిమళ భరితమైన జల్లు కురిపిస్తున్నారు అనిపించింది…

తన పరిపూర్ణమైన సాత్విక జీవనంతో
వుంఛా వృత్తి ఎంచుకున్నా…ఆ జోలిలో పడిన నాణాల లెక్క కన్నా…త్యాగయ్య హృదయ వీణలో పలికిన రాగాలే ఘనమైనవి...అవి భగవంతుని పాదాలపై నేరుగా తాకినవి…అందులో ఒక్క నాణెం నేను సంపాదించాలంటే…ఎన్ని జన్మలు ఎత్తాలో…

కానీ మన అదృష్టం ఏమిటంటే… దేవుడిని కూడా బిజినెస్ లోకి దింపి…ఆయన ఎవరిని కరుణించాలో ధరల పట్టికలో పెట్టగలిగాం.. నిధులు చూపించి సన్నిధిలో కూర్చోబెడుతున్నాం… కోటి ఇస్తే స్మగ్లర్లు కైనా బ్రేక్ దర్శనం షురూ….

కానీ నీవే నేను కదా… అంతర్యామి…

గిరిపై నెలకొన్న రాముని గురి తప్పక గంటి…
పరివారలు విరి సురటలుచే నిలబడి విసురుచు గొసరుచు సేవింపంగ …
పులకితాంతుడై యానందా శ్రులు నింపుచు మాటలాడవలెనని…
కలువరించ గని పదిపూటలపై గాచెదనను త్యాగరాజ వినుతునీ…

దేవతలు నిను గొప్పగా కొలుస్తుంటే… పులకించిన హృదయంతో కన్నీరు కారుస్తూ చూస్తున్నానయ్యా…. నీతో మాట్లాడదామని వచ్చాను… ఫర్వాలేదు పది పూటలైనా వేచి ఉంటాను….

ఏది భక్తి… టిక్కెట్టు భక్తా..సత్వర దర్శనం భక్తా..

నేరుగా చూస్తూనే…పదిపూటలైనా వేచి నీతో మాట్లాడదామని వచ్చానయ్యా…అనగల ధీశక్తి భక్తా…

చాలు చాలు….నా రోషం ఎవరిమీద?

త్యాగరాజస్వామీ! పిలిచి మరీ దర్శనమిచ్చావు చూడూ….నీ పెను దయ ముందు నా చిన్న హృదయం ‌శూన్యమయిందయా…. ఈ పిపీలకానికి నీ పిడికెడు భక్తి అబ్బించరాదా… త్యాగరాజా….

– డాక్టర్ ఎమ్మెస్వీ సత్యనారాయణ బాబు (కపర్ది) గుడివాడ, +91 92914 97660

RELATED ARTICLES

Most Popular

న్యూస్