Tuesday, May 14, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంభారతీయ పాద ప్రమాణం

భారతీయ పాద ప్రమాణం

పురాణగాథ:-
పద్నాలుగేళ్లు పాలించిన “చెప్పు”

రామాయణ గాధలు తెలియనిదెవరికి? కాకపోతే- రాత్రంతా రామాయణం విని, పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని అడుగుతుంటాం కాబట్టి-మరలనిదేల రామాయణంబన్న . . . రోజూ తినే అన్నమే మళ్లీ మళ్లీ తింటున్నాం కదా అన్నారు విశ్వనాథవారు. రాముడు అడవికి వెళ్లాడు. భరతుడు తాత, మేనమామల కేకయ రాజ్యం నుండి అయోధ్యకు వచ్చాడు. అన్న రామన్న లేడు. తండ్రి దశరథుడి మరణం. తండ్రి ఉత్తర క్రియలయ్యాక మొత్తం అయోధ్యను తీసుకుని అడవిలో అన్న దగ్గరికి వెళ్లాడు. నేను రాజ్యం అడగలేదు, అమ్మ కైకేయి అడిగినప్పుడు అక్కడ లేను . నాన్న పోయారు. అయోధ్య సింహాసనం ఖాళీగా ఉంది . వచ్చి నువ్వే ఏలుకో – అని వినయంగా రామయ్యకు చెప్పాడు. భరతా! తండ్రి ఉన్నా, లేకున్నా మాట మాటే. రావడం కుదరదు. 14 ఏళ్లు నేనడవిలో నే ఉంటానన్నాడు రాముడు. అయితే నేనూ అయోధ్యకు వెళ్ళను. ఇక్కడే ప్రాణత్యాగం చేస్తాను అని దర్భలు పరుచుకుని మొండికేస్తాడు భరతుడు. ఇది తెగే వ్యవహారం కాదని మధ్యలో వసిష్ఠుడు కలుగజేసుకుని బంగారు పాదుకలు తెచ్చి- రామా ఒక సారి ఈ పాదుకలు తొక్కి భరతుడికివ్వు, నీ పాదుకలనే నిన్నుగా అనుకుని భరతుడు నీపేరిట రాజ్యం చేస్తాడు- అని సూచించాడు. ఈ మధ్యేమార్గం రాముడికి- భరతుడికి ఇద్దరికీ నచ్చింది. ఆ క్షణం నుండి ఏకంగా పదునాలుగేళ్లు చతుస్సాగర పర్యంత సకల మహీమండల సువిశాల రాజ్యాన్ని రామపాదుకలే పాలించాయి.

పాతకథ:-
సన్మానం “చెప్పు”

బలిజేపల్లి లక్ష్మీకాంత కవి తెలియని నాటక ప్రియులు ఉండరు. అయన రచించిన హరిశ్చంద్ర పద్య నాటకం ప్రదర్శించని తెలుగు ఊరు ఉండదు. సహజంగా గొప్ప రచయిత, రంగస్థల నటుడు. హరిశ్చంద్రుడిని పీక్కుతినే నక్షత్రకుడి పాత్ర బలిజేపల్లి స్వయంగా వేసేవారు. స్వాతంత్ర్యానికి పూర్వం ఒకచోట హరిశ్చంద్ర నాటకం ప్రదర్శిస్తున్నారు. ముందు వరుసలో తెలుగు తెలిసిన ఒక బ్రిటిషు ఆఫీసరు కూర్చున్నాడు. నక్షత్రకుడిగా బలిజేపల్లి పెట్టే కష్టాలు, హరిశ్చంద్రుడిని అనే మాటలకు పట్టరాని కోపం వచ్చి చెప్పు తీసుకుని బలిజేపల్లిపై విసిరాడు. ఈ లోపు కలకలం మొదలయ్యింది. నాటకంలో లీనమై నక్షత్రుకుడి మీద కోపం వచ్చిందని, క్షమించమని స్టేజ్ పైకి వచ్చి ప్రాధేయపడ్డాడు. బలిజేపల్లి పొంగిపోయాడు. ఆ చెప్పునే మెడలో హారానికి గుచ్చుకుని ధన్యోస్మి అన్నాడు. ఆ క్షణంలో సభికులు బలిజేపల్లికి పాదరక్షక బిరుదును ప్రదానం చేశారు. అప్పటినుండి ఆయన పాదరక్షక బిరుదాంకిత బలిజేపల్లి లక్ష్మీకాంత కవి అయ్యాడు. బహుశా ఇంకెవరికీ, ఎప్పటికీ ఈ పాదరక్షక బిరుదు రాదు.

ఎందరిమీదో కోపంగా, నిరసనగా చెప్పులు పడుతుంటాయి. నటనకు అభినందనగా చెప్పు అందుకున్నవాడు బలిజేపల్లి ఒక్కడే. చెప్పు విసిరినవాడు రసహృదయుడు. వేయించుకున్నవాడు ఇంకా సరస హృదయుడు.

ప్రస్తుత కథ:-
భారతీయ కొలమానం చెప్పులు

రాముడి కాలి చెప్పుల సైజ్ ఏమిటో వాల్మీకి రామాయణం ఏడు కాండలు- 24 వేల శ్లోకాల్లో ఎక్కడా చెప్పలేదు కాబట్టి మనకు తెలిసే అవకాశం లేదు. బ్రిటిష్ వాళ్లు వచ్చాక అన్నిటినీ ఇంగ్లిష్ కళ్లతోనే చూడడం మనకు అలవాటయ్యింది. మన కాళ్ల చెప్పుల సైజ్ కూడా బ్రిటిష్ లేదా అమెరికా కొలమానాల్లోనే చుస్తున్నామట. అంటే ఇంచ్ లేదా సెంటీ మీటర్లు బ్రిటన్లో, అమెరికాలో ఒకలాగా; భారత్ లో ఒకలాగా ఉంటాయని అనుకోవాల్సిన పనిలేదు. ఒక్కో భౌగోళిక ప్రాంతంలో కాలు, వేళ్లు, మడమ, దాని నిర్మాణం ఒక్కోలా ఉంటుంది. ముఖ కవళికలను బట్టి వారు ఏ దేశంవారో దాదాపుగా గుర్తు పట్టేయవచ్చు. అలా భారతీయుల కాళ్లు దానికవిగా ప్రత్యేకమైనవి. అలాంటి కాళ్లకు చెప్పులకోసం బ్రిటిష్/అమెరికా సైజ్ ను పరమ ప్రమాణంగా రెండున్నర శతాబ్దాలుగా తీసుకోవడం వల్ల భారతీయ పాదాలకు జరిగిన అన్యాయం, చికాకు, అవమానం అంతా ఇంతా కాదు.

చెన్నయ్ కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ చర్మ పరిశోధన సంస్థ(సి ఎస్ ఐ ఆర్- సి ఎల్ ఆర్ ఐ) దీనిమీద లోతుగా అధ్యయనం చేసింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో దాదాపు లక్షకు పైగా జనం కాళ్ల కొలతలు తీసుకుంది. భారతీయుల పాదాలు బ్రిటిష్, అమెరికా వారి పాదాలకంటే వెడల్పుగా ఉన్నాయని గుర్తించింది. భారతీయ పాద ప్రమాణాలతో 8 కొత్త సైజులను ప్రకటించింది.

కొన్ని తరాలపాటు తగిన చెప్పులు, బూట్లు వేసుకోలేకపోయిన కాళ్లు ఇప్పుడు దుకాణాలకు నడిచివెళ్లి…భారతీయ పాద ప్రమాణ పాదరక్షలు అడిగి…తొడుక్కుని…తన కాళ్లమీద తను సగర్వంగా నిలబడవచ్చు.

ఇది కూడా వికసిత్ భారత్ ఆత్మ నిర్భర్ అభియాన్ కిందికి రావాలేమో!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్