Saturday, November 23, 2024
HomeTrending Newsఅద్భుత ఫలితాలిచ్చిన హరితహారం

అద్భుత ఫలితాలిచ్చిన హరితహారం

harithaharam  : ఏడేండ్ల కిందట తెలంగాణ మోడువారిన చెట్టు.. దీనికి బతుకే లేదని అనుకొన్నం. కానీ.. తెలంగాణ తల్లి మెడలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అలంకరించిన హరితహారంతో పచ్చదనం పురుడు పోసుకొన్నది. ఎండిన చెట్టు పచ్చగా మారింది. ఇప్పుడు మహావృక్షంగా ఎదుగుతున్నది. రాష్ట్రంలో ఆకుపచ్చని అద్భుతాలు జరుగుతున్నవి. తెలంగాణలో పచ్చని అడవి పందిళ్లతో పండుగ కళ సంతరించుకొంటున్నది. అటవీ విస్తీర్ణం పెరుగుదలతో కొత్త జీవం పచ్చగా కళకళలాడుతున్నది.

ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మానస పుత్రిక హరితహారం కార్యక్రమం రాష్ట్రంలో మంచి ఫలితాలు ఇస్తున్నది. ఈ పథకంతో రాష్ట్రంలో ఏకంగా 63,200 హెక్టార్లలో అదనపు పచ్చదనం పెరిగింది. దీంతో అటవీ విస్తీర్ణంలో మన రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ప్రస్తుతం 21.47 శాతం అడవులు ఉన్నాయి. మెట్రో నగరాల్లో అటవీ విస్తీర్ణం వృద్ధిలో హైదరాబాద్‌ దేశంలో మొదటిస్థానంలో నిలిచింది. దశాబ్దకాలంలో నగరంలో 4,866 హెక్టార్ల అటవీ విస్తీర్ణం పెరిగింది. దేశంలో గత రెండేండ్లలో అటవీ విస్తీర్ణం 2,261 చదరపు కిలోమీటర్లు పెరుగగా, తెలంగాణలో 632 చదరపు కిలోమీటర్ల పెరుగుదల నమోదు కావటం విశేషం. దేశంలో విస్తీర్ణం పరంగా మధ్యప్రదేశ్‌, మిజోరంలో అడవులు అధికంగా ఉన్నాయని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా- 2021 రిపోర్టులో తెలిపింది.

2015 నుంచి 2021 వరకు అడవి పెరుగుదల

• రాష్ట్ర మొత్తం భౌగోళిక విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు. అందులో 2021 నాటికి అడవులు 26,969 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. ఇది రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 21.47 శాతం.
• 2015-21 మధ్య రాష్ట్రంలో నోటిఫైడ్‌ అడవులతోపాటు బయటి ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణం 1,360 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఇది 6.85 శాతం పెరుగుదల. ఇందులో ట్రీ కవర్‌ (చెట్ల పచ్చదనం) 361 చదరపు కిలోమీటర్లు (14.51 శాతం), ఫారెస్ట్రీ, గ్రీన్‌ కవర్‌ 1,721 చదరపు కిలోమీటర్లు.
• రాష్ట్రంలో 2014లో 19,854 చ.కి.మీ విస్తీర్ణంలో 19,85,400 హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉంది. 2015లో తెలంగాణకు హరితహారం ప్రారంభమైన తర్వాత 2015-17 మధ్య కాలంలో 565 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 16,300 హెక్టార్ల అటవీ విస్తీర్ణం పెరిగింది.
• 2017-19 మధ్యలో మరో 163 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు పెరిగాయి.
• 2019-21 మధ్య 632 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 63,200 హెక్టార్ల అటవీ విస్తీర్ణం పెరిగింది.
• 2014-2019 మధ్య అటవీ పచ్చదనం 6.85 శాతం పెరిగింది. చెట్ల పచ్చదనం (ట్రీ కవర్‌) 2014లో 2,487 చదరపు కిలోమీటర్లు (2,48,700 హెక్టార్లు) ఉండగా హరితహారం మొదలైన తర్వాత 2014-19 మధ్య 361 చదరపు కిలోమీటర్లు (36,100 హెక్టార్లు) పెరిగింది. ఇది 14.51 శాతం పెరుగుదల.

తెలంగాణలో హరితహారం కార్యక్రమంలో చెట్లు నాటడం సత్పలితాలిస్తున్నది. రాష్ట్రంలో 63,200 హెక్టార్ల విస్తీర్ణంలో కొత్త పచ్చదనం పెరిగింది. పచ్చదనం పెరిగిన దేశంలోని ఐదు రాష్ట్రాల్లో  తెలంగాణ ఒకటి. హైదరాబాద్‌ నగరం 4,866 హెక్టార్ల కొత్త పచ్చదనం వృద్ధితో దేశంలోని మెగాసిటీలో నంబర్‌ 1గా నిలిచింది.
–మోహన్‌చంద్ర పరిగేయిన్‌ (ఐఎఫ్‌ఎస్‌), కేంద్ర పర్యావరణ, అటవీశాఖ.

నివేదికలోని కీలకాంశాలు

• దేశంలో ప్రస్తుత అడవులు 7,13,789 చదరపు కిలోమీటర్లు. ఇది మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 21.71 శాతం.
• అడవి బయట చెట్లు విస్తరిచిన ప్రాంతం 95,748 చదరపు కిలోమీటర్లు. ఇది భౌగోళిక విస్తీర్ణంలో 2.91 శాతం. మొత్తం కలిపి దేశంలో అటవీ విస్తీర్ణం 8,09,537 చదరపు కిలోమీటర్లు (24.62 శాతం).
• 2019తో పోల్చితే అటవీ ప్రాంతంలో 1,540 చదరపు కిలోమీటర్లు (0.22 శాతం), అడవి బయట ప్రాంతాల్లో చెట్ల విస్తీర్ణం పెరుగుదల 721 చదరపు కిలోమీటర్లు (0.76 శాతం) నమోదయ్యింది. మొత్తం 2,261 చదరపు కిలోమీటర్లు పెరిగింది.
• అటవీప్రాంతం పెరుగుదలలో వరుసగా ఆంధ్రప్రదేశ్‌ (647చ.కి.మీ), తెలంగాణ (632 చ.కి.మీ), ఒడిశా (537 చ.కి.మీ), కర్ణాటక (155 చ.కి.మీ), జార్ఖండ్‌ (110 చ.కి.మీ) నిలిచాయి.
• 17 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణంలో వాటి భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతానికి పైగా ఉన్నది.
• దేశంలో మొత్తం మడ అడవుల విస్తీర్ణం 4,992 చదరపు కిలోమీటర్లు. రెండేండ్లలో 17 చదరపు కిలోమీటర్లు పెరిగింది.

మరికొన్ని అంశాలు

పల్లె ప్రకృతి వనాలున్న ఆవాసాలు 19,472
పల్లె ప్రకృతి వనాలు విస్తరించిన ప్రాంతం13,657ఎకరాలు
బృహత్‌ ప్రకృతి వనాలు మండలానికి ఒకటి.
మండలాలు 526
ఎకరాల్లో ప్లాంటేషన్‌7,178
రాష్ట్రవ్యాప్తంగా నర్సరీలు 15,241
పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో 12,759
పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో1002
అటవీశాఖ ఆధ్వర్యంలో 842
ఇతర నర్సరీలు 638

రాష్ట్రంలో అటవీ ప్రాంతంలో నాటిన మొక్కలు(కోట్లలో)

ప్లాంటేషన్‌: 20రూట్‌
స్టాక్‌ రెజువనేషన్‌ 80

అడవి బయట నాటిన మొక్కలు (కోట్లలో)

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ 10
ఇతర ప్రాంతాల్లో 130
రాష్ట్రవ్యాప్తంగా 230
హరితహారం వ్యయం రూ.6,556 కోట్లు

హైదరాబాద్‌ ఫస్ట్‌

దేశవ్యాప్తంగా గత దశాబ్ద కాలంలో మహానగరాల్లో
పచ్చదనం పెరుగుదలలో హైదరాబాద్‌ ప్రథమస్థానంలో నిలిచింది.
నగరంలో 4,866 హెక్టార్లలో అదనంగా అటవీ విస్తీర్ణం పెరిగింది.
మరోవైపు ఢిల్లీలో 1,991 చదరపు కిలోమీటర్లు,
అహ్మదాబాద్‌లో (855 చ.కి.మీ), బెంగళూరులో (498 చ.కి.మీ)
అటవీ విస్తీర్ణం తగ్గింది.

Also Read : సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత

RELATED ARTICLES

Most Popular

న్యూస్